నిర్లక్ష్యానికి కేరాఫ్‌ ఎంసీహెచ్‌..  ఒకరికి చేయాల్సిన శస్త్ర చికిత్స మరొకరికి..

MCH Hospital Doctors Negligence in Karimnagar - Sakshi

‘గత నెలలో జిల్లా కలెక్టర్‌ శశాంక మాతా శిశు ఆసుపత్రి సందర్శనకు వెళ్లారు. ఓ రిటైర్డ్‌ వైద్యురాలి భర్త (ఆయన కూడా వైద్యుడే) కలెక్టర్‌ ముందు తన ఆక్రోశాన్ని వెళ్లగక్కాడు. కాంట్రాక్టు పద్ధతిలో నియామకమైన ఓ రిటైర్డ్‌ అధికారి తన భార్యకు సంబంధించిన పదవీ విరమణ బెనిఫిట్స్‌ రాకుండా అడ్డుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్మెంట్‌ తర్వాత ఎంసీహెచ్‌లో కాంట్రాక్టు డాక్టర్‌గా చేరేందుకు కూడా అడ్డుపడుతున్నాడని ఫిర్యాదు చేశారు. ఆసుపత్రిని అధ్వానంగా మార్చిన సదరు కాంట్రాక్టు డాక్టర్‌ను తొలగించాలని కోరారు. ఆసుపత్రిలో రింగ్‌ మాస్టర్‌లా వ్యవహరిస్తున్న సదరు కాంట్రాక్టు అధికారికి రూ.1.15 లక్షల వేతనం ఇస్తున్నారని ఫిర్యాదు చేశారు’.

సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌లోని మాతా శిశు కేంద్రం (ఎంసీహెచ్‌) అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారింది. గర్భిణులు, బాలింతలు, శిశువులకు మెరుగైన వైద్యసేవలు అందించాల్సిన ఈ కేంద్రం నిర్లక్ష్యం, అలసత్వానికి వేదికగా మారింది. ఇక్కడి డాక్టర్లు బాధ్యతలు మరిచిపోయి వైద్యవృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తిస్తుంటే.. సిబ్బంది రోగులను ఆదాయ వనరులుగా భావిస్తూ పీక్కుతింటున్నారు. గర్భిణుల ప్రసూతి సమయంలో డాక్టర్లు, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు అడ్డగోలుగా తయారైంది. శస్త్ర చికిత్స చేయాల్సిన రోగులనే మారుస్తూ గర్భిణుల జీవితాలతో ఆటలాడుతున్నారు. ఆసుపత్రిలో వైద్యుల నియామకం మొదలు ఆసుపత్రి నిర్వహణ వరకు ఒకరిద్దరు ‘పెద్ద’ల చేతుల్లోనే ఉంది. కాంట్రాక్టు పద్ధతిలో ఓ రిటైర్డ్‌ డాక్టర్‌కు ఏటా లక్షల రూపాయలు చెల్లిస్తూ అడ్మినిస్ట్రేటర్‌గా పెట్టి ఆసుపత్రి పరువును బజారుకీడుస్తున్నారు. ఆసుపత్రికి చెందిన రెగ్యులర్‌ వైద్యాధికారులు కూడా కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన వైద్యున్ని చూసి భయపడే పరిస్థితి నెలకొంది. 

రెగ్యులర్‌ వైద్యులను కాదని..
ఇటీవల గైనకాలజీ విభాగం హెచ్‌వోడీ మూడు నెలలపాటు లీవులో వెళ్లారు. అయితే.. ఆ పోస్టులో ఇన్‌చార్జిగా మరో రెగ్యులర్‌ వైద్యురాలిని నియామకం చేయాల్సి ఉండగా, ఓ కాంట్రాక్టు జూనియర్‌ వైద్యులరాలికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇదేంటని అడిగే పరిస్థితి కూడా ఇక్కడ లేకుండా పోయింది. పూర్తిగా ఆసుపత్రి రాజకీయ నాయకుల చేతుల్లో ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే.. వైద్యులు రెండు గ్రూపులుగా విడిపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనివల్లే ప్రసవం కోసం వచ్చే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

ఆ అధికారిదే హవా..
ఆసుపత్రి నిర్వహణ కోసం ఓ రిటైర్డ్‌ డాక్టర్‌ను కాంట్రాక్టు పద్ధతిన ప్రతినెలా రూ.1.15 లక్షల వేతనంతో నియమించారు. సదరు అధికారి నిర్వహణ మరిచి అన్నింట్లో తల దూరుస్తూ రింగ్‌ మాస్టర్‌లా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎంసీహెచ్‌లో బాధ్యతలు అప్పగిస్తే.. ఎంసీహెచ్‌తోపాటు జిల్లా ఆసుపత్రిలో చక్రం తిప్పుతున్నారు. అన్నీ తానై నడుపుతున్నారు. ఓ గ్రూపును తయారు చేసి తన వెంటే ఉంచుకొని హల్‌చల్‌ చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగాలు భర్తీ, పర్మినెంట్‌ ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్లు, వారిపై ఫిర్యాదులు, నిధుల వినియోగం, అభివృద్ధి పనులు మొదలైన అన్ని పనులకు ఉన్నతాధికారులను గు ప్పిట్లో పెట్టుకొని చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఓ రాజకీయ పార్టీ అండతోనే ఈ రిటైర్డ్‌ డాక్టర్‌ను నియమించి చోద్యం చూస్తున్నారనే ఆరోపణలున్నాయి. 

నియామకాల్లోనూ..
జిల్లా ఆసుపత్రిలో అయినా సరే ఎంసీహెచ్‌ ఆసుపత్రిలో అయితే సదరు రింగ్‌మాస్టర్‌ తెలియకుండా కాంట్రాక్టు పద్ధతిన నాల్గవ తరగతి ఉద్యోగి కూడా ఉద్యోగం సంపాదించలేని పరిస్థితి. సదరు అధికారిని ప్రసన్నం చేసుకుంటేనే కింది నుంచి పైస్థాయి వరకు ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంటుంది. అతన్ని కాదని ఇతరులతో పైరవీలు చేయించారో ఏ స్థాయిలోనైనా అడ్డుకునే శక్తి అతనికి ఉంది. ఉన్నతాధికారులంతా అతని గ్రిప్‌లోనే ఉండడంతో ఆయన ఆడింది ఆటగా నడుస్తోంది. 

సిజేరియన్‌ ఘటనపై విచారణకు కమిటీ..
 మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వీణవంక మండలం నర్సింగాపూర్‌ గ్రామానికి చెందిన మాలతి అనే మహిళకు వైద్యులు నిర్లక్ష్యంతో సిజేరియన్‌ చేసేందుకు ప్రయత్నించిన ఘటనపై విచారణకు ఆదేశించారు. ఆర్‌ఎంఓ డాక్టర్‌ శౌర య్య, చిల్డ్రన్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ అజయ్‌ కుమార్‌లతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రత్నమాల ఆదేశాలు జారీ చేశారు.

వైద్యులపై పోలీసులకు ఫిర్యాదు
మాతాశిశు కేంద్రంలో వైద్యుల  నిర్లక్ష్యంపై బాధితురాలి భర్త, వీణవంక మండలం నర్సింగాపూర్‌ గ్రామానికి చెందిన సింగిరెడ్డి నరోత్తమ్‌ రెడ్డి మంగళవారం టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరోత్తమ్‌రెడ్డి భార్య మాలతి 7 నెలల గర్భిణి. ఈ నెల 17న ఆమెకు కడుపులో నొప్పి రావడంతో 108 వాహనంలో కరీంనగర్‌లోని మాతాశిశు కేంద్రానికి తరలించారు. గర్భసంచికి కుట్లు వేయాలని 21న నరోత్తమ్‌రెడ్డి భార్యను ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకెళ్లారు. డెలివరీ ఆపరేషన్‌కు వచ్చారనుకొని వైద్యులు నిర్లక్ష్యంగా పొట్టచీరారు. దీనివల్ల పుట్టబోయే పిల్లల పరిస్థితి విషమంగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. నరోత్తమ్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

చదవండి: కాళేశ్వరం అద్భుత సృష్టి.. ఈనెల 25న డిస్కవరీ చానల్‌లో

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top