
కన్వీనర్ కోటా భర్తీకి కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్ జారీ
నీట్‌లో అర్హత సాధించినవారికి మాత్రమే అవకాశం
25న సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులకు గడువు
వెబ్ ఆప్షన్ల తేదీలను త్వరలో ప్రకటించనున్న వర్సిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం (కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్) మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి కాంపిటెంట్ అథారిటీ (కనీ్వనర్) కోటా కింద ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలలో ప్రవేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల ప్రక్రియ బుధవారం (16వ తేదీ) ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. చివరి తేదీ ఈ నెల 25 సాయంత్రం 6 గంటలు.
అభ్యర్థులు https:// tsmedadm.tsche.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా నీట్ యూజీ –2025లో అర్హత సాధించాలి. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలతో పాటు ప్రైవేట్, మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్, డెంటల్ కాలేజీలలోని కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ఉన్న సీట్లకు మాత్రమే ఈ నోటిఫికేషన్ వర్తించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు (జీఓ నంబర్ 114) జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ కాలేజీల్లో 85 శాతం, ప్రైవేటు కాలేజీల్లో 50 శాతం సీట్లను భర్తీ చేస్తారు.
కటాఫ్ మార్కులు ఇలా:
ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించి వివిధ కేటగిరీల కింద నిర్దేశించిన కటాఫ్ మార్కులను యూనివర్సిటీ వెల్లడించింది. ఓసీ, ఈడబ్లు్యఎస్ కేటగిరీ విద్యార్థులకు 144 మార్కులు (50 శాతం పైగా పర్సంటైల్), బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 113 మార్కులు (40 శాతం పైగా), దివ్యాంగులకు 127 (45 శాతం పైగా) మార్కులు కటాఫ్‌గా నిర్ణయించారు.
అర్హతలు ఇవే
⇒ అభ్యర్థి భారతీయ పౌరుడై ఉండాలి. పీఐఓ/ఓసీఐ కార్డు కలిగి వుండొచ్చు.
⇒ తెలంగాణ రాష్ట్రంలో కనీసం 4 సంవత్సరాలు చదువుకున్న లేదా నివసించినవారు మాత్రమే అర్హులు.
⇒ ఇంటర్ లేదా సమానమైన అర్హత సబ్జెక్టులు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/బోటనీ/జువాలజీ లేదా బయోటెక్నాలజీ, ఇంగ్లిష్
⇒ నీట్‌లో ఓసీలు 50%, బీసీ, ఎస్సీ, ఎస్టీలు 40%, ఓసీ– పీడబ్ల్యూడీలు 45% మార్కులు సాధించటం తప్పనిసరి.
⇒ 2025 డిసెంబర్ 31 నాటికి కనీస వయస్సు 17 ఏళ్లు ఉండాలి.
⇒ రిజిస్ట్రేషన్లు, ప్రాసెసింగ్ ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.4,000, ఎస్సీ, ఎస్టీలకు రూ.3,200. ఫీజు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి.
⇒ అవసరమైన సర్టిఫికెట్లు: నీట్ ర్యాంక్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, ఇంటర్ మార్కుల మెమో, స్టడీ సర్టిఫికేట్లు (9వ తరగతి నుంచి ఇంటర్ వరకు), కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్, ఫొటో, సంతకం వంటి పత్రాలు తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి.
⇒ ప్రవేశాలకు సంబంధించి మెరిట్ జాబితా జారీ చేయడమే అర్హత అని భావించరాదు. ఒరిజినల్ సర్టీఫికేట్లు పరిశీలించిన తర్వాతే ప్రవేశం ఖరారు అవుతుందని యూనివర్సిటీ తెలిపింది. వెబ్ ఆప్షన్ల తేదీలను విశ్వవిద్యాలయం తర్వాత ప్రకటించనుంది.