సాక్షి, హైదరాబాద్: తమ వద్ద పెట్టుబడి పెడితే భారీ వడ్డీ ఇస్తామని ఆశచూపి రూ.15 కోట్లకు టోకరా వేసిన నిందితుడిని పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. నాగోలు ఇన్‌స్పెక్టర్ మక్బూల్ జానీ తెలిపిన మేరకు.. ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందిన కిచ్చ వీరభద్రరావు (51) బండ్లగూడ ఆనంద్ నగర్‌లో గల రాజీవ్ స్వగృహలో నివాసముంటున్నాడు. భార్య రాజ్యలక్ష్మి, సహాయకుడు వెంకట దుర్గాప్రసాద్‌తో కలిసి నాగోల్ వీరభద్ర ట్రేడింగ్ పేరుతో కార్యాలయం ప్రారంభించారు.
తమ సంస్థలో రూ.లక్ష పెట్టుబడి పెట్టిన వారికి నెలకు రూ.10 వేల చొప్పున వడ్డీ చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ప్రజలు ఆకర్షితులయ్యారు. ఈ క్రమంలో సుమారు 290 మంది వినియోగదారులు రూ.30 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు. ప్రారంభంలో కొంతమందికి వడ్డీ చెల్లిస్తూ నమ్మకం కల్పించిన నిందితులు 2025 మే నెలలో గుర్గాంలో వీరభద్రరావుపై సైబర్ క్రైమ్ కేసు నమోదు కావడంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు.
అనంతరం రూ.30 కోట్లలో రూ.15 కోట్లు చెల్లించి, మిగతా రూ.15 కోట్ల చెల్లింపులను నిలిపివేశారు. అధిక వడ్డీ ఆశ చూపి 290 మందికి టోకరా వేశారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా వీరభద్రరావు, రాజ్యలక్షి్మ, వెంకట దుర్గాప్రసాద్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


