
భారీ ఎన్‌కౌంటర్‌లో 38 మంది మావోయిస్టుల మృతి?
22 మంది కంటే ఎక్కువే చనిపోయారన్న ఛత్తీస్‌గఢ్ సీఎం
గుంజపర్తి–ఇత్తగూడ సమీపంలో చోటుచేసుకున్న ఎదురుకాల్పులు
మృతుల్లో ఎవరెవరున్నారనే దానిపై కొరవడిన స్పష్టత
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉన్న కర్రిగుట్టలు కాల్పుల మోతతో దద్దరిల్లాయి. పోలీసులు, మావోయిస్టుల మధ్య భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. బుధవారం జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో 38 మంది మావోయిస్టులు చనిపోయినట్టు విశ్వసనీయవర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ మాత్రం.. 22 కంటే ఎక్కువ మావోయిస్టుల మృతదేహాలు లభించినట్లు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్ బుధవారం ఉదయమే జరిగినట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం మొదలైంది.
తొలుత 15 మంది మావోయిస్టులు మాత్రమే చనిపోయినట్లు తెలిసింది. ఆ తర్వాత ఈ సంఖ్య గంటగంటకూ పెరగగా, ఛత్తీస్‌గఢ్ సీఎం మధ్యాహ్నం 1.30 ప్రాంతంలో మీడియాతో మాట్లాడారు. ‘కొన్ని రోజులుగా కర్రిగుట్టల దగ్గర యాంటీ నక్సలైట్ ఆపరేషన్ కొనసాగుతోంది. భద్రతా దళాలకు ఈ రోజు భారీ విజయం దక్కింది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది..’అని వెల్లడించారు.
మృతదేహాలేవీ..?
బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రిగుట్టల సమీపాన గుంజపర్తి – ఇత్తగూడ సమీపంలో ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్టు సమాచారం. చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను స్వా«దీనం చేసుకున్నామని ఛత్తీస్‌గఢ్ సీఎం ప్రకటించినా..ఎవరెవరు చనిపోయారు? ఆ మృతదేహాలను ఎక్కడికి, ఎలా తరలించారనే అంశాలపై స్పష్టత రాలేదు. దీంతో చనిపోయిన మావోయిస్టుల్లో అగ్రనేతలు ఉన్నారా లేక దళ సభ్యులు, జన మిలీషియా సభ్యులే ఉన్నారా? అనే అంశంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి.
ఈ గుట్టలపై తెలంగాణ మావోయిస్టు కమిటీతో పాటు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, పీఎల్‌జీఏ బెటాలియన్ వన్ ఉన్నట్టు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. మరోవైపు బుధవారం ఐఈడీ పేలి ఓ జవాను గాయపడగా, ఎలుగుబంటి దాడిలో ఇంకొకరు గాయపడినట్టు తెలుస్తోంది. అయితే వీటిపై పోలీసు వర్గాల నుంచి అధికారిక సమాచారం అందలేదు.
మిషన్‌లో అంతా గోప్యతే
మంగళవారం డ్రోన్‌తో తీసిన కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. కొందరు సాయుధులు నడిచి వెళ్తున్న దృశ్యాలు వాటిల్లో కనిపించాయి. ఈ వీడియో ‘మిషన్ సంకల్ప్’కు సంబంధించినదే అని ప్రచారం జరిగినా, అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు. అయితే ఆ మరుసటి రోజే భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఒక్క వీడియోనే కాదు మిషన్ సంకల్ప్ మొదలైనప్పటి నుంచి అన్ని విషయాల్లో భద్రతా దళాలు గోప్యత పాటిస్తున్నాయి.
మావోయిస్టులు ఉపయోగించిన గుహలు అంటూ వైరల్ అయిన వీడియోలపైనా స్పష్టత కరువైంది. ఏప్రిల్ 24న జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మహిళా మావోయిస్టులు చనిపోయారని ప్రకటించి, వారి పేర్లు, ఫొటోలు వెల్లడించడానికి 72 గంటల సమయం తీసుకున్నారు. వారు ఎక్కడివారనేది వెల్లడించలేదు. అలాగే మంగళవారం చనిపోయిన మరో మహిళా మావోయిస్టుకు సంబంధించిన వివరాలపై కూడా స్పష్టత లేదు. ప్రస్తుత భారీ ఎన్‌కౌంటర్ విషయంలోనూ అదే గోప్యత కొనసాగుతోంది.
కొనసాగుతున్న ఆపరేషన్
మిషన్ సంకల్ప్ ఏప్రిల్ 21న మొదలైంది. ఈ ఆపరేషన్‌లో 24 వేల మంది బలగాలను, నాలుగు హెలీకాప్టర్లు, రెండు డ్రోన్లు, 20 వరకు ఆన్‌మ్యాన్డ్ వెహికల్స్(యూఏవీ)ను ఉపయోగిస్తున్నారు. ఇప్పటివరకు కర్రిగుట్టల్లో 70 శాతం ప్రాంతాన్ని భద్రతా దళాలు తమ అ«దీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈనెల 6 తర్వాత దశల వారీగా ఇక్కడ బలగాలను తగ్గించాలని ముందుగా నిర్ణయించినా, బుధవారం నాటి ఎన్‌కౌంటర్ నేపథ్యంలో మరికొన్ని రోజులు యధాతథంగా కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాదిలో ఇప్పటివరకు జరిగిన వివిధ ఎన్‌కౌంటర్లలో 184 మంది మావోయిస్టులు చనిపోయారు.
ఐదుగురు మావోయిస్టుల లొంగుబాటు
ములుగు: మావోయిస్టు పార్టీకి చెందిన ఐదుగురు బుధవారం లొంగిపోయినట్లు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీశ్ తెలిపారు. లొంగిపోయిన వారిలో కొమటిపల్లికి చెందిన ఆర్పీసీ సభ్యుడు మడావి భీమా, జంగిల్‌శాఖ సభ్యుడు మడావి కోస, డీకేఏఎంఎస్ సభ్యుడు మడివి భీమా, ఆర్పీసీ సభ్యుడు వంజం ఊర, చైతన్య నాట్యమండలి సభ్యురాలు వంజం హుంగి ఉన్నట్లు చెప్పారు.