చనిపోయినా.. మోస్ట్‌ వాంటెడ్‌లే!

Maoists Haribhushan And RK Even They Deceased Most Wanted In NIA Hit List - Sakshi

ఎన్‌ఐఏ హిట్‌ లిస్టులో ఆర్కే, హరిభూషణ్‌ పేర్లు! 

328 మంది మావోయిస్టులతో ఎన్‌ఐఏ జాబితా 

టాప్‌ వాంటెడ్‌లో దేవ్‌జీ, గణపతి, హిడ్మా.. 

మొత్తంగా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ కేడరే ఎక్కువ.. 

మావోయిస్టులపై మళ్లీ ఆరా.. రివార్డులు పెంచే అవకాశం? 

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌.. తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం మడగూడెం గ్రామం కోయతెగకు చెందిన మావోయిస్టు నేత. రాష్ట్ర కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుడిగా వ్యవహరించిన ఆయన గతేడాది జూన్‌ 21న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ అడవుల్లో కోవిడ్‌తో మరణించారు. అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ (ఆర్కే) మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు. ఏపీలోని గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమకోటకు చెందిన ఆయన.. అనారోగ్యంతో బాధపడుతూ గతేడాది అక్టోబర్‌ 14న బస్తర్‌ అటవీ ప్రాంతంలో చనిపోయారు. 

..ఈ ఇద్దరు కీలక మావోయిస్టు నేతలు చనిపోయి నెలలు గడుస్తున్నా.. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) వారి పేర్లను ఇంకా ‘మోస్ట్‌ వాంటెడ్‌’జాబితాలో ఉంచింది. ఎన్‌ఐఏ తమ వెబ్‌సైట్‌లో దేశవ్యాప్తంగా ఉగ్రవాద, తీవ్రవాద, వేర్పాటువాద, తీవ్ర ఆర్థిక నేరాలతో సంబంధమున్న 328 మంది పేర్లతో ‘మోస్ట్‌ వాంటెడ్, పరారీలో ఉన్న వారి జాబితా’ను రూపొందించింది. అందులో ఇప్పటికే చనిపోయిన మావోయిస్టు నేతల పేర్లు ఉండటం చర్చనీయాంశమవుతోంది. 

మావోయిస్టుల వివరాలపై మళ్లీ ఆరా.. 
సీపీఐ (మావోయిస్టు) పార్టీలో కీలక నేతలపై మరో సారి రివార్డులు పెరగనున్నాయని.. నిఘా వర్గాలు మోస్ట్‌ వాంటెడ్‌ల జాబితాను మళ్లీ రూపొందిస్తున్నాయని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల రిక్రూట్‌మెంట్‌ పెరిగిందన్న ఇంటెలిజెన్స్‌ సమాచారం మేరకు.. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు నేతల వివరాలను జిల్లాలు, పోలీస్‌స్టేషన్ల వారీగా సేకరిస్తున్నారు.

హనుమకొండ, జేఎస్‌ భూపాలపల్లి, జనగామ జిల్లాల నుంచి ఇప్పటికే ఇలాంటి డేటా తీసుకున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్‌ సహా 11 రాష్ట్రాల్లో పనిచేస్తున్న మావోయిస్టు నేతల వివరాలు, వారిపై ఉన్న రివార్డులపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ రివార్డులు పెంచనున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన 54 మంది ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లో పనిచేస్తున్నట్టు తేలిందని సమాచారం. 

‘మోస్ట్‌ వాంటెడ్‌’లో బస్వరాజ్, గణపతి, హిడ్మా
ఎన్‌ఐఏ సిద్ధం చేసిన మావోయిస్టు కీలక నేతల జాబితాలో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారే అధికంగా ఉన్నట్టు తెలిసింది. కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాళ్ల కేశవరావు అలియాస్‌ బస్వరాజ్, గంగన్న, ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్‌ గణపతి పేర్లను టాప్‌ వాంటెడ్‌ లిస్టులో చేర్చగా.. ఆ తర్వాత మడావి హిడ్మా, మరికొందరి పేర్లున్నట్టు తెలిసింది. గణపతిపై ఇప్పటికే రూ.2.52 కోట్ల రివార్డు, బస్వరాజ్‌పై రూ.1.25 కోట్లు, కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్న నేతలపై రూ.కోటి చొప్పున రివార్డులు ఉన్నా యి. తెలంగాణ నుంచి 9మంది మావోయిస్టులు కేంద్ర కమిటీలో కీలకంగా ఉన్నట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి.

ఇందులో మల్లోజుల వేణుగోపాల్‌ అలి యాస్‌ భూపతి, కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్‌ సాధు, కటకం సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్, మల్లా రాజిరెడ్డి, గంకిడి సత్యనారాయణరెడ్డి, మో డం బాలకృష్ణ, పుల్లూరు ప్రసాదరావు అలియాస్‌ చంద్రన్న, గాజర్ల రవి అలియాస్‌ గణేశ్, తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్‌ ఆశన్న, తిప్పిరి తిరుపతి తదితర అగ్రనేతల పేర్లు ఈ జాబితాలో చేర్చినట్లు సమాచారం. ఇక ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 40 మందిని మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో చేర్చినట్లు తెలిసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top