
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న
సాయుధ పోరాటానికి విరమణ..శాంతియుతంగా పోరాడుతాం
మూలవాసీ బచావో మంచ్ నేతృత్వంలో పోరాటం చేస్తాం
మా షరతులకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన
120 మంది అనుచరులతో కలిసి జగదల్‌పూర్‌కు పయనం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఇకపై తమ పోరాటం రాజ్యాంగానికి లోబడి కొనసాగుతుందని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ సతీశ్ తెలిపారు. తాము సాయుధ పోరాటానికి మాత్రమే విరమణ ఇచ్చామని, ఇకపై శాంతియుగ మార్గంలో పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. ఆశన్న నేతృత్వంలో దాదాపు 120 మంది మావోయిస్టులు తమ ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించి జనజీవన స్రవంతిలో కలిసేందుకు గురువారం ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యాన్ని వీడారు.
వీరంతా ప్రభుత్వ పెద్దల సమక్షంలో శుక్రవారం లాంఛనంగా సాయుధ పోరాట బాటను వీడనున్నారు. ఈ సందర్భంగా అడవిని వీడి బయటకు వచ్చిన తర్వాత ఆశన్న ఛత్తీస్‌గఢ్ మీడియాతో మాట్లాడారు. ‘శాంతి చర్చల కోసం ప్రజా సంఘాలు, మేధావులు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. దీంతో సాయుధ పోరాటానికి విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ సందర్భంగా మేము పెట్టిన ప్రధాన షరతుల విషయంలో ప్రభుత్వ స్పందన సానుకూలంగా ఉంది.
గతంలో మా పార్టీ, అనుబంధ సంఘాల్లో పని చేశారనే ఆరోపణలపై పోలీసులు జైళ్లలో పెట్టిన వారిని వెంటనే విడుదల చేయాలి. దీంతోపాటు మూలవాసీ బచావో మంచ్ సంస్థపై నిషేధాన్ని ఎత్తివేయాలి. ఆ సంస్థలో పనిచేస్తున్నారనే ఆరోపణలతో పెట్టిన కేసులు ఎత్తివేయాలి. ఇకపై మూలవాసీ బచావో మంచ్ వంటి సంస్థల ద్వారా చట్టబద్ధంగా మా పోరాటం కొనసాగిస్తాం. మేము కేవలం సాయుధ పోరాటానికే విరమణ ఇచ్చాం తప్పితే లొంగిపోలేదు. మా పోరాటం ఆపేది లేదు. జనజీవన స్రవంతిలో కలిసినవాళ్లు ప్రభుత్వ పోలీసు విభాగమైన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్‌జీ)లో చేరబోమని స్పష్టం చేశాం’అని ఆయన వెల్లడించారు.