లొంగిపో బిడ్డా.. ఇంటికి రా! 

Maoist Leader Kankanala Rajireddy Request Him To Come Back Home - Sakshi

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు 

కంకణాల రాజిరెడ్డి తల్లి వీరమ్మ వేడుకోలు 

కాల్వశ్రీరాంపూర్‌ (పెద్దపల్లి): ‘పానం చేతనైతలేదు.. బొందిల జీవి పోకముందు ఒక్కసారి నిన్ను చూడాలని ఉంది.. రా కొడుకా..’అంటూ మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి తల్లి వీరమ్మ వేడుకుంటోంది. బుధవారం ఓఎస్‌డీ శరత్‌చంద్ర పవార్, డీసీపీ రవీందర్‌ రాజన్న స్వగ్రామం కిష్టంపేటను సందర్శించి వీరమ్మను పరామర్శించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి లొంగిపోతే అన్నివిధాల సహకరిస్తామని పోలీసు ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వీరమ్మ కంటతడి పెడుతూ తన కన్న కొడుకును చూడాలని ఆత్రంగా ఉందని, మీరన్నా రాజన్నకు విషయం చేర్చాలని మీడియా ముందు చేతులు జోడించింది. ‘పోలీసులే వచ్చి పానం మంచిగున్నదా అని అడిగి మందులు ఇస్తున్నరు. నేను కాటికి దగ్గరవుతున్న.. నిన్ను చివరి చూపు చూసి నీ చేతుల పానం ఇడువాలని ఉంది బిడ్డా’అంటూ కన్నీటి పర్యంతమైంది.

‘జంగళ్ల కూడా కరోనా వస్తుందంటున్నరు. ఎవరూ చూడని చావు నీకొద్దు. నిన్ను చూడకుండా నేను చావద్దు బిడ్డా. నీకు శాత కాకుండా అయిందని అంటున్నరు. కలోగంజో ఉన్నదే తిందాం బిడ్డా. ఇంటకి రా నాయన’అంటూ ప్రాధేయపడుతోంది. కాగా, రాజిరెడ్డి తల్లి వీరమ్మను పరామర్శించిన అనంతరం ఓఎస్‌డీ శరత్‌చంద్ర, డీసీపీ రవీందర్‌ మాట్లాడుతూ, మావోయిస్టులు అడవుల్లో ఇబ్బందులు పడుతున్నారని, వనం వీడి జనంలోకి వస్తే చికిత్సతోపాటు రివార్డు వారికే అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కాసర్ల తిరుపతిరెడ్డి, పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, సుల్తానాబాద్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై వెంకటేశ్వర్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top