
స్లాట్ బుకింగ్‌కు ఏం కావాలి?
ఎర్రర్ వస్తోంది.. ఏం చేయమంటారు?
ఫీజు ఏ గేట్‌వే నుంచి కట్టాలి?
వెబ్ ఆప్షన్స్‌లో జాగ్రత్తలు చెప్పండి
ఎప్‌సెట్ కౌన్సెలింగ్‌లో ఎన్నో సందేహాలు
కాల్ సెంటర్‌కు రోజుకు 600 కాల్స్.. కుప్పలు తెప్పలుగా మెసేజ్‌లు
నేరుగా క్యాంప్ ఆఫీసుకు వస్తున్న విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో విద్యార్థులు తికమక పడుతున్నారు. దరఖాస్తు చేసే సమయంలో సవాలక్ష సందేహాలొస్తున్నాయి. దీంతో ఎప్‌సెట్ క్యాంప్ కార్యాలయాన్ని సంప్రదిస్తున్నారు. ఇంజనీరింగ్‌తోపాటు పాలిసెట్, ఇతర సాంకేతిక కోర్సుల కోసం సాంకేతిక విద్యామండలి ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతోపాటే ఈ–మెయిల్స్ కూడా స్వీకరిస్తున్నారు. మరోవైపు క్యాంపు కార్యాలయంలో అనుమానాలు నివృత్తి చేసే ఏర్పాట్లూ చేశారు.
ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకూ విరామం లేకుండా ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. రోజుకు కనీసం ఆరువందలకు తగ్గకుండా ఫోన్ కాల్స్, వందల కొద్దీ ఈ–మెయిల్స్ అందుతున్నాయి. క్యాంపు కార్యాలయానికీ రోజుకు వంద మంది వరకూ వస్తున్నారు. వీరందరికీ సమా ధానం చెప్పేందుకు ప్రత్యేక సిబ్బందిని నియ మించారు. ఫోన్‌కాల్స్, మెసేజ్, మెయి ల్స్‌కు ఎలా సమాధానం ఇవ్వాలనే అంశాలపై వారికి ముందే శిక్షణ ఇచ్చారు.
ఎన్నో అనుమానాలు
టోల్ ఫ్రీ మొదలు పెట్టిన తొలినాళ్లలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌పై ఎక్కువగా ప్రశ్నలు వచ్చాయని క్యాంప్ కార్యాలయ అధికారులు తెలిపారు. షెడ్యూల్ విడులైన తర్వాత స్లాట్ బుకింగ్, ఫీజు చెల్లింపు, కౌన్సెలింగ్‌కు సంబంధించిన విధివిధానాలపై ప్రశ్నలు వస్తున్నాయి. కొంతమంది అప్లికేషన్లు నింపడంపైనా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పొరపాటున ఏదైనా డేటా తప్పుగా ఇస్తే సరిచేస్తారా అని ముందే ప్రశ్నిస్తున్నారు. కుల ధ్రువీకరణ, ఆదాయ పత్రాలను ఎలా పొందాలని, ఎప్పుడు తీసుకున్నవి చెల్లుతాయని అడుగుతున్నారు. ప్రతీ దశలోనూ స్లాట్ బుక్ చేసుకోవాలా అనే ప్రశ్నలు వేస్తున్నారు. ధ్రువపత్రాల పరిశీలనకు ఎక్కడకు వెళ్లాలి? ఏఏ సరి్టఫికెట్లు తీసుకెళ్లాలని కొంతమంది అడుగుతున్నారు.
స్లాట్ బుకింగ్, ఆప్షన్ల సమయంలో ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలూ కాల్ సెంటర్ ద్వారా తెలుసుకుంటున్నారు. ఆప్షన్లు మొదలు కాకున్నా, ఇంజనీరింగ్ సీట్లు ఎన్ని? ఏ ర్యాంకుకు ఎక్కడ సీటు వస్తుందని ప్రశ్నిస్తున్నారు.
కొంతమంది స్లాట్ బుకింగ్ కోసం ఏ గేట్ వే ద్వారా డబ్బులు చెల్లించాలని, మరికొంతమంది గేట్ వే ద్వారా చెల్లిస్తుంటే ఎర్రర్ వస్తుందని చెబుతున్నారు. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ క్యాంపు కార్యాలయం సిబ్బంది ఓపికగా సమాధానం ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచీ ఫోన్లు వస్తున్నాయి. ఈ ఏడాది నుంచి నాన్–లోకల్ తీసివేయడంతో తాము ఏ కేటగిరీ కింద సీటు పొందొచ్చని ప్రశ్నిస్తున్నారు.
కాల్ సెంటర్‌కు మంచి స్పందన
వందల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి. కౌన్సెలింగ్‌కు వెళ్లే విద్యార్థి ప్రతీ సందేహాన్ని నివృత్తి చేసుకుంటున్నారు. ఇది మంచి స్పందనే. సాంకేతిక విద్య వెబ్‌లోకి వెళ్తే ఎప్‌సెట్ కౌన్సెలింగ్ వివరాలు తెలుస్తాయి. అంతేకాదు, గత ఏడాది ఏ ర్యాంకుకు ఎక్కడ సీటు వచ్చాయనేది అందుబాటులో ఉంచాం. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ టోల్ ప్రీ నంబరులో సిబ్బంది అందుబాటులో ఉంటారు. 7660009768– 79 నంబర్లకు ఫోన్ చేయవచ్చు.
– శ్రీనివాస్, ఎప్‌సెట్ క్యాంప్ ఆఫీసర్
ప్రతీ సందేహానికి సమాధానం
విద్యార్థులు ఫోన్‌లో కౌన్సెలింగ్‌కు సంబంధించిన అనేక సందేహాలు అడుగుతున్నారు. మేం ఇచ్చే సమాధానాల తర్వాత సంతృప్తి చెందుతున్నారు. కొన్నిసార్లు స్లాట్ బుకింగ్ ఎర్రర్స్ వచ్చినప్పుడు వెంటనే వాటిని నివృత్తి చేస్తున్నాం. తిరిగి లాగిన్ అయ్యేలా చేస్తున్నాం.
– శ్యామల, టోల్ ఫ్రీ నంబర్ సిబ్బంది
మెయిల్స్ అన్నీ పరిశీలిస్తాం
రోజూ వందల్లో మెయిల్స్ వస్తున్నాయి. విద్యార్థులు అడిగే ప్రశ్నల్లో కొన్నింటికీ ఎప్‌సెట్ వెబ్‌సైట్‌లో సమాచారం ఉంటుంది. ఆ లింక్‌ను వారికి పంపుతున్నాం. సాంకేతిక సమస్యలు ఉంటే ఆయా విభాగాలకు పంపి, తక్షణమే పరిష్కరించేలా చేస్తున్నాం.
– నవ్య, ఈ–మెయిల్స్ పరిశీలించే ఉద్యోగి