వెంకటాపూర్‌ సజీవ దహనం కేసును ఛేదించిన పోలీసులు

Mancherial Venkatapur Fire Accident Case Shantaiah Wife Arrested - Sakshi

వెంకటాపూర్‌ సజీవ దహనం కేసును ఛేదించిన పోలీసులు

ఆస్తి, సింగరేణి వారసత్వ ఉద్యోగం కోసం ప్రియుడితో కలిసి భర్త శాంతయ్యను హత్య చేసిన భార్య

అనంతరం పెట్రోల్‌ పోసి నిప్పంటించినట్లు గుర్తింపు

శాంతయ్య భార‍్యతో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా వెంకటాపూర్‌లో ఆరుగురి సజీవదహనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసు వెనుక వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది. ఘటనలో మృతి చెందిన శాంతయ్య భార్య, బంధువులు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే శాంతయ్య భార‍్యతో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.  ఆస్తి, సింగరేణి వారసత్వ ఉద్యోగం కోసం ప్రియుడితో కలిసి భర్త శాంతయ్యను భార్య హత్య చేయించినట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చినట్లు సమాచారం. 

నస్పూర్, వెంకటాపూర్‌లో స్థానికులు చెప్తున్న వివరాల మేరకు.. వెంకటాపూర్‌కు చెందిన మాసు శివయ్య ఆ గ్రామ వీఆర్‌ఏ, అతడి భార్య రాజ్యలక్ష్మి (పద్మ) గృహిణి. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. కుమారుడు సందీప్‌ నస్పూర్‌లో ఉంటున్నాడు. ఇక లక్సెట్టిపేట మండలం ఊత్కూరుకు చెందిన సింగరేణి కార్మికుడు శనిగరపు శాంతయ్య నస్పూర్‌లో నివాసం ఉంటూ ఆర్కే5 బొగ్గు గనిలో పనిచేస్తున్నాడు. వెంకటాపూర్‌కు సమీపంలోనే బొగ్గుగని ఉండగా.. కూలిపనులకు వెళ్లే క్రమంలో రాజ్యలక్ష్మి దంపతులకు శాంతయ్యతో పరిచయం ఏర్పడింది. ఈ సాన్నిహిత్యం పెరిగి శాంతయ్య వారి ఇంట్లోనే ఉండటం మొదలుపెట్టాడు. రాజ్యలక్ష్మితో శాంతయ్య వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. తనను, పిల్లలను పట్టించుకోవడం లేదని అతడి భార్య సృజన పంచాయితీ పెట్టింది. శ్రీరాంపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆ కుటుంబాలకు పలుమార్లు కౌన్సెలింగ్‌ కూడా జరిగింది. 

డబ్బు రేపిన చిచ్చుతో.. 
శాంతయ్య–సృజన దంపతులకు ఒక కుమార్తు, ఇద్దరు కుమారులు ఉన్నారు. శాంతయ్య సింగరేణి ఉద్యోగి కావడంతోపాటు సొంతూరులో భూములు ఉన్నాయి. ఇటీవల కొంత భూమి విషయంలో వాటాగా రూ.12 లక్షలు వచ్చాయి. అందులో కుమార్తె పేరిట రూ. 5లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయించి, మిగతా సొమ్ము తన వద్దే పెట్టుకున్నాడు. తనకు, కుమారులకు డబ్బులు ఇవ్వకుండా.. రాజ్యలక్ష్మితో ఉంటూ వారికి డబ్బులు ఇస్తున్నాడని సృజన గొడవపడింది. దీనికితోడు నాలుగు నెలలుగా శాంతయ్య వెంకటాపూర్‌లోనే ఉండిపోవడం, డ్యూటీకి సరిగా వెళ్లకపోవడంతో కక్షపెంచుకున్నట్టు తెలిసింది.

ఇదీ చదవండి: మంచిర్యాల ప్రమాదంపై షాకింగ్‌ నిజాలు.. కారణం అదేనా?

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top