కేంద్రంపై సీఎల్పీ నేత భట్టి ధ్వజం

Mallu Bhatti Vikramarka Slams Central Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చదువురాని ప్రధాని నేతృత్వం లోని బీజేపీ ప్రభుత్వం స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రను వక్రీకరిస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ధ్వజమెత్తారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఫొటో లేకుండా ఆజాదీకా అమృత్‌ ఉత్సవాలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. దేశంకోసం త్యాగాలు చేసిన మహనీయులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అని మండిపడ్డా రు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ నెహ్రూ స్థానంలో సావర్కర్‌ బొమ్మ పెట్టినంత మాత్రాన చరిత్ర మారదన్న విషయాన్ని బీజేపీ గుర్తుంచుకోవాలన్నారు.

హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్‌ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌లో నెహ్రూ ఫొటో పెట్టాలని అడగడానికి వెళ్లిన యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐలకు చెందిన 12 మంది నాయకులను పోలీసులు నిర్బంధించడం, రైల్వే రిక్రూట్‌మెంట్‌ పరీక్ష జరిగే రోజే ఉన్న టెట్‌ పరీక్షను వాయిదా వేయాలని విద్యామంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన మరో 21 మంది ఎన్‌ఎస్‌యూఐ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు. అరెస్టు చేసిన విద్యార్థి, యువజన నాయకులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు భట్టి తెలిపారు. సామాజిక మార్పునకు కృషి చేసిన మహానేత నందమూరి తారక రామారావు అని కొనియాడారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top