కోరి తెచ్చుకున్న తెలంగాణలో కొందరికే ఉద్యోగాలు: భట్టి | Mallu Bhatti Vikramarka Says Goal Is To Provide Jobs To Youth In Khammam Mega Job Mela, More Details Inside | Sakshi
Sakshi News home page

కోరి తెచ్చుకున్న తెలంగాణలో కొందరికే ఉద్యోగాలు: భట్టి

Apr 22 2025 6:15 AM | Updated on Apr 22 2025 9:30 AM

Mallu Bhatti Vikramarka says goal is to provide jobs to youth

మెగా జాబ్‌మేళాను ప్రారంభిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. చిత్రంలో ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్రీజ

యువతకు ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని వెల్లడి

మధిర: కోరి, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొందరు రాజకీయ నాయకులకే ఉద్యోగాలు దక్కాయి తప్ప.. గత పదేళ్లలో నిరుద్యోగులకు లాభం జరగలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో సోమవారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఇందుకోసం తొలుత పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ను ప్రక్షాళన చేసి, జాబ్‌ కేలెండర్‌ను విడుదల చేయగా.. తొలి ఏడాది లోనే 56 వేల ఉద్యోగాలు భర్తీ చేసి, మరో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేస్తున్నామని చెప్పారు. 

రెండో దశలో బహుళ జాతి సంస్థలను రాష్ట్రానికి రప్పించి, లక్షలాది యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా కృషి జరుగుతోందని వివరించారు. ఇందుకోసం సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు దావోస్‌లో పర్యటించి రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకోవడమే కాక ప్రస్తుతం జపాన్‌ పర్యటనలో ఉన్నారని తెలిపారు. మూడో దశలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాలకు తోడు రూ.9 వేల కోట్లతో రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చామని, జూన్‌ 2న లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందిస్తామని భట్టి వెల్లడించారు.  

మరో నాలెడ్జ్‌ సిటీతో 5 లక్షల మందికి లబ్ధి 
నాటి ప్రధాని రాజీవ్‌ గాంధీ దూరదృష్టితో దేశంలో ఐటీ విప్లవానికి నాంది పలికితే, హైదరాబాద్‌లో అప్పటి కాంగ్రెస్‌ సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హైటెక్‌ సిటీకి పునాదులు వేశారని భట్టి గుర్తు చేశారు. కాగా, ఐదు లక్షల మంది యువతకు ఉపాధి కల్పించేలా మరో నాలెడ్జి సిటీ ఏర్పాటు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. 

విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నామని తెలిపారు. కాగా, జాబ్‌మేళాలో 97 కంపెనీల ప్రతినిధులు పాల్గొనగా 5,827 మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వీరిలో 2,325 మందిని ఎంపిక చేసి, కొందరికి డిప్యూటీ సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ, సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్‌ మేనేజర్‌ షాలేంరాజు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement