చదువు కోసం సమాధిపైకి.. అక్కడైతేనే ఆన్‌లైన్‌కు ఓకే

Mahabubabad: Students Sit On Tombs For Better Signal Online Classes - Sakshi

నెట్‌వర్క్‌ ఎక్కడుంటే చదువులూ అక్కడే.. 

విద్యార్థులకు ఇంకా రాని ఉచిత యూనిఫామ్‌

కరోనా ఇబ్బందుల్లో పిల్లలకు కొత్తవి కొనని తల్లిదండ్రులు

గత ఏడాది ఇంటికే రెండు జతల బట్టలు ఇచ్చిన ఉపాధ్యాయులు

మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం కోయగూడెం గ్రామంలో సెల్‌ నెట్‌వర్క్‌ సిగ్నల్స్‌ సరిగ్గా రావు. ఊరిబయట పంట చేల వద్ద ఉన్న సమాధుల వద్ద మాత్రం నెట్‌వర్క్‌ బాగుంటుంది. దీంతో విద్యార్థులు సమాధుల వద్ద కూర్చుని ఆన్‌లైన్‌ పాఠాలు వినాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ముగ్గురు విద్యార్థినులు గురువారం సమాధిపై కూర్చొని ఆన్‌లైన్‌ పాఠాలు వింటున్న దృశ్యాన్ని ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. – బయ్యారం 

ఈ ఏడాది పాతవే!
సాక్షి, మహబూబాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రతిఏటా పాఠశాలలు ప్రారంభం రోజునే అందజేసే ఉచిత రెండు జతల స్కూల్‌ యూనిఫామ్స్‌ ఈ ఏడాది విద్యార్థులకు ఇంకా ఇవ్వలేదు. నిరుపేదల విద్యార్థులు ఈ బట్టలనే వేసుకొని సంతోషంగా ఉండేవారు. అయితే గత ఏడాది కరోనా భయంతో పాఠశాలలు మూసి వేసినా  యూనిఫామ్స్‌ మాత్రం ఇవ్వడం ఆపలేదు. ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బట్టలను ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం ఇంకా క్లాత్‌ కూడా కొనుగోలు చేయలేదని, ఈ ఏడాది బట్టలు రావడం ఇబ్బందే అని అధికారులు చెబుతున్నారు. అసలే కరోనా కష్టకాలంలో కుటుంబాలు పోషించుకోవడమే ఇబ్బందిగా ఉంది. ఇటువంటి పరిస్థితిలో పిల్లలకు బట్టలు కొనలేని దుస్థితిలో తల్లిదండ్రులు ఉండటంతో పేద పిల్లలు పాత బట్టలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. 

గత ఏడాది ముందుగానే..
ప్రతీ సంవత్సరం మాదిరిగానే గత ఏడాది కూడా పిల్లలకు కొత్త బట్టలు కుట్టించారు. కరోనాతో పాఠశాలలు తెరుచుకోక పోవడంతో, ఆన్‌లైన్‌ ద్వారానే క్లాసులు నిర్వహించారు. అయినా యూనిఫామ్స్‌ మాత్రం ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మరీ  పంపిణీ చేశారు.  గత ఏడాది జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలతో పాటు, మోడల్‌ స్కూల్స్, కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో  మొత్తంగా 50,474 మంది విద్యార్థులు, విద్యార్థినులు చదివారు. వీరికి ఒక్కొక్కరికి రూ. 600 విలువ చేసే క్లాత్, మగవారికి షర్ట్, ప్యాయింట్, నెక్కర్, ఆడ పిల్లలకు చిన్న వారికి షర్ట్, పర్కిన్‌ క్లాత్, పెద్దవారికి పంజాబీ డ్రస్‌ క్లాత్‌ చున్నీల క్లాత్‌ ఇచ్చారు.

అదే విధంగా జతకు రూ. 50 చొప్పున రెండు జతలకు రూ. 100 ఖర్చుతో యూనిఫామ్స్‌ కొనుగోలు చేసి అందజేశారు. ఇలా సర్వశిక్ష అభియాన్‌ నిధుల నుంచి రూ. 354.683 లక్షలు విడుదల చేశారు. ఈ నిధులతో కొనుగోలు చేసిన క్లాత్‌ జిల్లా విద్యాశాఖ అధికారికి, అక్కడి నుంచి ఎమ్మార్సీకి అక్కడి నుంచి పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపించారు. ఈ ప్రక్రియ అంతా గత ఏడాది ఏప్రిల్‌ నెల చివరలోనే పూర్తి చేయగా జూన్‌ మొదటి వారంలో  కుట్టించి విద్యార్థుల ఇంటికి వెళ్లి బట్టలు పంపిణీ చేశారు. 

ఈ ఏడాది ఊసే లేదు... 
గత ఏడాది మాదిరిగా ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ చేసి ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభించిన విద్యాశాఖ పిల్లలకు అందజేసే యూనిఫామ్‌ మాత్రం ఇవ్వడం లేదు. వేసవి కాలంలోనే పాఠశాలలకు రావాల్సిన క్లాత్‌ రాలేదు. అసలు ఈ ఏడాది యూనిఫామ్స్‌కు బడ్జెట్‌ కేటాయించకపోవడం గమనార్హం. కరోనాతో ప్రైవేట్‌ పాఠశాలలు వదిలి ప్రభుత్వ పాఠశాలల బాటపడుతున్న విద్యార్థులకు ఉచిత బట్టలు ఇవ్వడం లేదని తెలియడంతో నిరుత్సాహ పడుతున్నారు. ప్రభుత్వం అందజేసే ఉచిత యూనిఫామ్స్‌తో పిల్లలకు బట్టలు కుట్టించే భారం తగ్గిందని, ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కష్టకాలంలో అప్పులు చేసి బట్టలు కుట్టించాల్సి వస్తుందని తల్లిదండ్రులు అంటున్నారు.

పాతబట్టలే వేసుకుంటున్నా..
ప్రతీ సంవత్సరం బడి తెరవగానే రెండు జతల కొత్త బట్టలు ఇచ్చేవారు. ఈ బట్టలు వేసుకొని బడికి పోయేదాన్ని.. బతుకమ్మ పండుగకు అమ్మానాన్నలు కొత్త బట్టలు కుట్టిస్తారు.. ఇప్పుడు సార్లు బట్టలు ఇవ్వలేదు. ఇటు అమ్మానాన్న కొత్త బట్టలు కుట్టివ్వలేదు. దీంతో పాత బట్టలే వేసుకుంటున్నా.. నేనే కాదు.. అందరూ ఇలాగే చేస్తున్నారు. చినిగినవి కుట్టుకుంటూ వేసుకుంటున్నాం. 
– గద్దల పూజిత, పదో తరగతి విద్యార్థిని,జెడ్పీహెచ్‌ఎస్‌ పెద్దవంగర  

కష్టకాలంలో బట్టలు ఇవ్వలేదు
ఒక వైపు కరోనా కష్టకాలంలో బతకటమే ఇబ్బందికరంగా మారింది. అంతకముందు ప్రతీ సంవత్సరం పిల్లలకు రెండు జతల యూనిఫామ్స్‌ ఇచ్చిన ప్రభుత్వం ఈ ఏడాది యూనిఫామ్‌ ఇవ్వటం మరిచిపోయింది. పోయిన సంవత్సరం కరోనా ఎఫెక్ట్‌తో పాఠశాల ప్రారంభం అయిన సమయంలోనే పుస్తకాలతో పాటు యూనిఫామ్‌ ఇచ్చారు. ఈ సంవత్సరం యూనిఫామ్‌ ఇస్తారో ఇవ్వరో తెలియని పరిస్థితి ఉంది. – మేర్గు సంధ్య(బయ్యారం)

ఈ ఏడాది బడ్జెట్‌ రాలేదు..
ఈ ఏడాది బడ్జెట్‌లో యూనిఫామ్‌కు డబ్బులు కేటాయించలేదు. దీంతో ప్రతీ ఏడాది మాదిరిగా జిల్లాకు క్లాత్‌ రాలేదు. దీంతో పిల్లలకు యూనిఫామ్స్‌ ఇవ్వలేదు. ప్రతీ విద్యార్థి ఆన్‌లైన్‌ క్లాసులు వినేలా చర్యలు తీసుకుంటున్నాం.. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే యూనిఫామ్‌ కుట్టించి ఇస్తాం.
–  సోమశేఖర శర్మ, జిల్లా విద్యాశాఖ అధికారి  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top