‘గెజిట్‌’తో నదులు, ప్రాజెక్టుల స్వాధీనం చెల్లదు 

Madabhushi Sridhar Condemned Centre Grabs Krishna Godavari From AP TS - Sakshi

కేంద్రం తక్షణమే నోటిఫికేషన్‌ ఉపసంహరించుకోవాలి 

రౌండ్‌ టేబుల్‌ భేటీలో న్యాయ నిపుణుడు మాడభూషి శ్రీధర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి నదులు, వాటిపై ఉన్న అన్ని ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గత ఏడాది జూలై 15న జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికి, రాజ్యాంగానికి విరుద్ధమని ప్రముఖ న్యాయనిపుణుడు, మాజీ కేంద్ర సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ద్వారా సంక్రమించిన అధికారాలతో ఈ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసినట్టు కేంద్రం చెపుతోందని, అయితే నదులు, వాటిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించాలని ఈ చట్టం లో ఎక్కడా లేదన్నారు.

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులను ఏర్పాటు చేసి, వాటి అధికార పరిధిని నిర్ణయించే అవకాశమే కేంద్రానికి ఉందన్నారు. గెజిట్‌ నోటిఫికేషన్‌పై తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం శనివారం ఇక్కడ నిర్వహించిన అఖిలపక్ష రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. బోర్డుల అధికార పరిమితిని నిర్వచించే సాకుతో గెజిట్‌ ద్వారా కేంద్రం రాష్ట్రాల అధికారాలను లాక్కుందని విమర్శించారు.

దీనివల్లరూ.70 వేల కోట్ల అంచనాలతో తెలంగాణ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను రూ.30 వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత అర్ధంతరంగా నిలిపివేయాల్సి వస్తుందన్నారు. ఈ ప్రాజెక్టులు ఆగిపోతే రాష్ట్రం సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్నారు.  కేంద్రం తక్షణమే ఈ గెజిట్‌ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

న్యాయసమ్మతంగా ఉండాలి: తెలంగాణ భౌ గోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నదీ జలాల్లో న్యాయమైన కేటాయింపులను జరపాలని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఎత్తిపోతల పథకాలతో నీళ్లను తీసుకోవాలంటే అధిక సమయం, వ్యయం అవుతుందని, అదే ఏపీలో కేవలం ప్రాజెక్టుల గేట్లను ఎత్తడం ద్వారా నీళ్లు వస్తాయని అన్నారు.

కాగా, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం ఇంకా కొనసాగుతోందని, వీటిపై రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని కాంగ్రెస్‌ నేత చిన్నారెడ్డి విమర్శించారు. కేంద్రం తెచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ వల్ల హైదరాబాద్‌ సహా మొత్తం రాష్ట్రం తాగునీటి కోసం కటకటలాడాల్సి వస్తుందని రిటైర్డ్‌ ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సీనియర్‌ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, కె.శ్రీనివాస్‌రెడ్డిలు ఈ కార్యక్రమానికి సంధానకర్తలుగా వ్యవహరించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top