మళ్లీ ఊపిరి పోశారు! 

Lung Transplantation Successful For Coronavirus Patient At KIMS Hyderabad - Sakshi

కరోనా బాధితుడికి కిమ్స్‌లో ఊపిరితిత్తుల మార్పిడి సక్సెస్‌

పూర్తిగా కోలుకున్న రిజ్వాన్‌.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌

దేశంలో ఇది తొలిసారి: కిమ్స్‌

సాక్షి, హైదరాబాద్‌: శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇ బ్బంది, ఆయాసంతో పాటు కరోనా వైరస్‌ బారిన పడిన ఓ యువకుడికి నగరంలోని కిమ్స్‌ వైద్యులు విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స చేశారు. ప్రస్తుతం అతను పూర్తిగా కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. శుక్రవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎండీ భాస్కర్‌రావు, హార్ట్‌ అండ్‌ లంగ్స్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ స్పెషలిస్టు డాక్టర్‌ సందీప్‌ అట్టావర్‌లు చికిత్సకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. కరోనా బారిన పడిన వ్యక్తికి ఒకే సమయంలో 2 ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స చే యడం దేశంలోనే తొలిసారని వైద్యులు తెలిపారు. 

దాతది కోల్‌కతా.. స్వీకర్తది చండీగఢ్‌ 
పంజాబ్‌లోని చండీగఢ్‌కు చెందిన రిజ్వాన్‌ (32) గత కొంతకాలంగా శ్వాస సంబంధ సమస్య (సర్కోయిడోసిస్‌)తో బాధపడుతున్నాడు. చికిత్స కోసం అనేక ఆస్పత్రులను తిరిగాడు. అయినా ఫలితం లేకపోవడంతో ఇటీవల ఆయన హైదరాబాద్‌ కిమ్స్‌లోని ప్రముఖ గుండె, ఊపిరితిత్తుల మార్పిడి నిపుణుడు డాక్టర్‌ సందీప్‌ అట్టావర్‌ను సంప్రదించాడు. అయితే బాధితుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా సర్కోయిడోసిస్‌కు తోడు కరోనా కూడా సోకినట్లు తేలింది. దీంతో ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నట్లు నిర్ధారించారు. ఊపిరితిత్తుల మార్పిడి ఒక్కటే దీనికి పరిష్కారమని వైద్యులు నిర్ణయించారు. అవయవ మార్పిడి చికిత్సకు రిజ్వాన్‌ అంగీకరించడంతో అవయవదానం కోసం జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేశారు. ఆగస్టు 24న కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి (52) బ్రెయిన్‌డెత్‌ స్థితికి చేరుకున్నాడు. అతడి అవయవాలు దానం చేసేందుకు కుటుంబీకులు అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే అవయవ మార్పిడి చికిత్స కోసం ఎదురు చూస్తున్న రిజ్వాన్, కిమ్స్‌ వైద్యులకు ఈ సమాచారం అందింది. అప్పటికే రిజ్వాన్‌ కోవిడ్‌ను జయించడంతో వైద్యులు చికిత్సకు సిద్ధమయ్యారు.  

వైద్యులు రెండు బృందాలుగా విడిపోయి.. 
ఆస్పత్రికి చెందిన వైద్యులు రెండు బృందాలుగా విడిపోయారు. వీరిలో ఓ వైద్య బృందం వెంటనే ప్రత్యేక విమానంలో కోల్‌కతాకు వెళ్లి దాత శరీరం నుంచి ఊపిరితిత్తులను సేకరించి, అదే రోజు అదే విమానంలో హైదరాబాద్‌కు చేరుకుంది. ఆస్పత్రిలో ఉన్న మరో వైద్య బృందం అప్పటికే రోగి ఛాతీని ఓపెన్‌ చేసి ఉంచింది. డాక్టర్‌ సందీప్‌ అట్టావర్‌ నేతృత్వంలోని వైద్య బృందం సుమారు 10 గంటల పాటు శ్రమించి రోగికి విజయవంతంగా అమర్చారు. ప్రస్తుతం బాధితుడు పూర్తిగా కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసినట్లు వైద్యులు ప్రకటించారు. తనకు పునర్జన్మను ప్రసాదించిన కిమ్స్‌ వైద్యులకు బాధితుడు రిజ్వాన్‌ కృతజ్ఞతలు తెలిపాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top