మిలియన్‌ ప్లస్‌.. మహిళలు ‘మైనస్‌’! | Lowest wages for female workers in southern states | Sakshi
Sakshi News home page

మిలియన్‌ ప్లస్‌.. మహిళలు ‘మైనస్‌’!

Jul 6 2026 5:03 AM | Updated on Jul 6 2026 5:03 AM

Lowest wages for female workers in southern states

దక్షిణాది రాష్ట్రాల్లోని మహిళా కార్మికులకు అత్యల్ప వేతనాలు 

10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో రోజుకు రూ.500 సంపాదించడం గగనమే.. 

మిలియన్‌ ప్లస్‌ సిటీల్లో కార్మిక శక్తిపైకేంద్ర గణాంకాల శాఖ నివేదిక 

మహిళా నిరుద్యోగిత అంశంలోమదురై తర్వాత హైదరాబాదే 

ప్రతి 100 మంది హైదరాబాద్‌ మహిళల్లో 9 శాతం నిరుద్యోగులే  

సాక్షి, హైదరాబాద్‌: మిలియన్‌ ప్లస్‌ సిటీస్‌..అంటే పది లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలు. ఈ నగర ప్రాంతాల్లో జనాభాకు అనుగుణంగా అభివృద్ధి శరవేగంగా సాగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు దినదిన ప్రవర్ధమానంగా అన్ని రంగాల్లో దూసుకెళుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు ఐటీలో ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. ఈ విధంగా విశ్వనగరాలుగా అభివృద్ధి చెందే నగరాల జాబితాలో ముందు వరుసలో ఉన్న ఈ మిలియన్‌ ప్లస్‌ సిటీల్లో మహిళా కార్మికుల పరిస్థితి మాత్రం దయనీయంగా ఉందని కేంద్ర గణాంకాల శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. 

ఇలాంటి కొన్ని నగరాల్లో దినసరి వేతనాలు తీసుకునే మహిళా కార్మికులు రోజుకు రూ.500 కూడా సంపాదించలేకపోతున్నారని, ఆయా నగరాల్లో మహిళా నిరుద్యోగిత తీవ్ర స్థాయిలో ఉందని కేంద్ర గణాంక శాఖ ఇటీవల విడుదల చేసిన ‘లేబర్‌ మార్కెట్‌ డైనమిక్స్‌ ఇన్‌ మిలియన్‌ ప్లస్‌ సిటీస్‌’అనే నివేదిక వెల్లడించింది. దేశ వ్యాప్తంగా 46 మిలియన్‌ ప్లస్‌ సిటీస్‌లో కార్మిక శక్తి గురించి రూపొందించిన ఈ నివేదికలో దక్షిణ భారతదేశంలోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరు, మదురై నగరాల్లోని పరిస్థితిని అంశాల వారీగా వెల్లడించింది. నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

పురుషులకు అధిక వేతనాలు 
» స్వయం ఉపాధి పొందే వారిలో మహిళా, పురుష కార్మికుల మధ్య వేతన వ్యత్యాసం ఎక్కువగా ఉంది. వేతన జీవుల్లో ఈ వేతన అంతరం కొంత తగ్గగా, ఆయా నగరాల్లోని పురుషులతో పోల్చుకుంటే మహిళల్లో నిరుద్యోగిత ఎక్కువగా ఉంది.  

» హైదరాబాద్‌లోని మొత్తం కార్మిక శక్తిలో పురుషులు 77.6 శాతం ఉండగా, బెంగళూరులో 78.2, విశాఖపట్నంలో 80.1, విజయవాడలో 70.1, మదురైలో 80.5, చెన్నైలో 76.1, కోయంబత్తూరులో 68.4 శాతం పురుషులు పనిచేస్తున్నారు.  

» స్వయం ఉపాధి ద్వారా మహిళలు పొందుతున్న వేతనాలు దయనీయంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 30 రోజులకు సగటున రూ.15,558 పొందుతుంటే బెంగళూరులో రూ.25,692, విశాఖపట్నంలో రూ.9,745, విజయవాడలో రూ.17,913, మదురైలో రూ.5,528, చెన్నైలో రూ.17,308, కోయంబత్తూరులో రూ.13,999 చొప్పున లభిస్తోంది. అదే స్వయం ఉపాధి పొందుతున్న పురుష కార్మికులకు 30 రోజల్లో అధిక వేతనాలు లభిస్తుండటం గమనార్హం. కోయంబత్తూరులో సగటున రూ.45,188, చెన్నైలో రూ. 33,321, మదురైలో రూ.23,762, విజయవాడలో రూ.26,475, విశాఖపట్నంలో రూ.29,570, బెంగళూరులో రూ. 37,823, జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.33,420 చొప్పున వేతనం లభిస్తోంది.  

కోయంబత్తూరులో అత్యల్ప మహిళా నిరుద్యోగిత 
» మదురై మహిళల్లో నిరుద్యోగిత సమస్య ఎక్కువగా ఉంది. అక్కడి 100 మంది మహిళలకు గాను 11.4 శాతం నిరుద్యోగిత ఉంది. నగరాల వారీగా చూస్తే హైదరాబాద్‌లో 9.1, బెంగళూరులో 3.7, విశాఖపట్నంలో 5.7, విజయవాడలో 7.7, చెన్నైలో 5.0 శాతం మహిళా నిరుద్యోగులు ఉన్నారు. కాగా దక్షిణ భారతదేశంలోనే అత్యల్పంగా కోయంబత్తూరులో 0.5 శాతం మంది మహిళలు మాత్రమే నిరుద్యోగులుగా ఉన్నారు. అదే పురుషుల విషయానికి వస్తే కోయంబత్తూరులో 3.2 శాతం, చెన్నైలో 4.2 శాతం, మదురైలో 11.7 శాతం, విజయవాడలో 6.5 శాతం, విశాఖపట్నంలో 6.1 శాతం, బెంగళూరులో 2.4 శాతం, జీహెచ్‌ఎంసీ పరిధిలో 5.9 శాతం నిరుద్యోగిత ఉంది. మొత్తం మీద మదురైలో 23 శాతం నిరుద్యోగిత నమోదు కాగా, బెంగళూరులో 6.1 శాతం, కోయంబత్తూరులో కేవలం 3.7 శాతం నిరుద్యోగం ఉంది. హైదరాబాద్‌లో మహిళలు, పురుషులు కలిపి 15 శాతం నిరుద్యోగిత నమోదైంది.  

» హైదరాబాద్‌ విషయానికి వస్తే మొత్తం 100 పురుష కార్మికుల్లో 28.8 శాతం మంది స్వయం ఉపాధి పొందుతుండగా, 69.3 శాతం మంది వేతన జీవులుగా, 11.9 శాతం క్యాజువల్‌ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఇక మహిళల్లో 23.7 శాతం మంది స్వయం ఉపాధి పొందుతుండగా, 69.3 శాతం మంది వేతన జీవులుగా, 7 శాతం మంది మాత్రమే క్యాజువల్‌ కార్మికులుగా పనిచేస్తున్నారు. మొత్తం 100 మంది పురుషుల్లో 72 మంది సేవల రంగంలో, 27.4 శాతం మంది మైనింగ్, క్వారీయింగ్‌ రంగంలో ఉపాధి పొందుతున్నారు. మహిళల విషయానికి వస్తే 76.6 శాతం మంది సేవల రంగంలో, 21.7 శాతం మంది క్వారియింగ్, మైనింగ్‌లో పనిచేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement