మోటారు వాహనాల చట్ట సవరణ అమలులోకి.. పెరగనున్న లైఫ్‌ టాక్స్‌

Life tax on ex showroom price - Sakshi

డిస్కౌంట్‌తో సంబంధం లేదంటున్న మోటారు వాహన చట్ట సవరణ 

బిల్లుకు గవర్నర్‌ ఆమోదంతో గెజిట్‌ జారీ 

వాహనం ఎప్పుడు కొన్నా.. రిజిస్ట్రేషన్ ఇప్పుడు జరిగితే కొత్త విధానమే వర్తింపు 

సాక్షి, హైదరాబాద్‌: ఇక నుంచి వాహనాల ఎక్స్‌షోరూమ్‌ ధరల మీదనే జీవిత పన్ను విధిస్తారు. ఇంతకాలం వాహనం కొనుగోలుపై షోరూమ్‌ నిర్వాహకులు ఇచ్చే డిస్కౌంట్‌ పోను, మిగతా మొత్తం మీద మాత్రమే పన్ను విధించేవారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోటారు వాహనాల చట్ట సవరణ ఇప్పుడు అమలులోకి వచ్చింది. చట్ట సవరణ బిల్లుకు గత నెల చివరలో గవర్నర్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చట్టం అమలుకు వీలుగా ప్రభుత్వం గెజిట్‌ విడదుల చేసి, అమలు ప్రారంభించింది.  

మార్చికి ముందు కారుకొన్నా.. ఏప్రిల్‌లో రిజిస్ట్రేషన్ చేస్తే కొత్త విధానమే.. 
చట్ట సవరణ నేపథ్యంలో అమలుపై రవాణాశాఖ స్పష్టతనిచ్చింది. కారు ఏప్రిల్‌కు ముందు కొన్నా, రిజిస్ట్రేషన్ ఇప్పుడు జరిగితే, కొత్త విధానమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ కొత్త విధానం అమలులోకి రావటానికి ముందు గత నెలలో కార్లు కొన్నవాళ్లు చాలామంది ఇంకా రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేదు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే కారు కొన్నందున తమకు కొత్త విధానం వర్తించదన్న ధీమాతో ఉన్నారు. కానీ, కారు ఎప్పుడు కొన్నా.. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కొత్త విధానమే వర్తిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.  

పెరగనున్న పన్ను.. 
ధర ఎక్కువ కార్లపైనే ఈ కొత్త విధానం ప్రభావం ఉండనుంది. కారు కొన్నప్పుడు ఎక్స్‌షోరూం ధరపైన షోరూం నిర్వాహకులు డిస్కౌంట్‌ ఇవ్వటం సహజమే. ధర ఎక్కువగా ఉండే కార్లపై ఈ మొత్తం ఎక్కువగా ఉంటుంది. ఈ డిస్కౌంట్‌ను సాకుగా చూపి చాలామంది కొంతమేర పన్ను ఎగవేస్తున్నారు.

ఇప్పుడు దానికి అవకాశం లేదు. రూ.5 లక్షల ధర ఉన్న కార్లపై 13 శాతం, రూ.5 లక్షలు దాటి రూ.10 లక్షల లోపు ఉండే కార్లపై 14 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉండే కార్లపై 17 శాతం, రూ.20 లక్షలకంటే ఎక్కువ ధర ఉండే కార్లపై 18 శాతం చొప్పున జీవిత పన్నును సవరిస్తూ గతేడాది రవాణాశాఖ ఉత్తర్వు జారీ చేసిన విషయం తెలిసిందే.

తాజా సవరణ ప్రకారం.. డిస్కౌంట్‌ మొత్తం మినహాయించక ముందు ఉండే ఎక్స్‌షోరూం ధరలపై పైన పేర్కొన్న నిర్ధారిత శాతంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తుల పేరు మీద కాకుండా సంస్థలు, కంపెనీల పేరుతో ఉండే కార్లపై అదనంగా రెండు శాతం, రెండో కారు తీసుకునేవారు అదనంగా 2 శాతం చెల్లించాల్సి ఉంటుంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top