క్షేత్ర స్థాయిలోకి లైసెన్స్‌డ్ సర్వేయర్లు: మంత్రి పొంగులేటి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘టేపులు, గొలుసుల పద్ధతులకు స్వస్తి పలికి కచ్చితత్వం వచ్చేలా ఆధునిక రోవర్స్‌తో ఇక భూ కొలతలు చేయిస్తాం. దీని కోసం మొదటి విడతగా 600 ఆధునిక రోవర్స్‌ను కొనుగోలు చేసి జిల్లాలకు పంపిణీ చేయిస్తున్నాం. క్షేత్ర స్థాయిలోకి వెళ్లే లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ఈ ఆధునిక టెక్నాలజీ ఎక్విప్‌మెంట్‌ను సమకూర్చుతున్నాం’అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
శిక్షణ పూర్తి చేసుకున్న 47 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ఆదివారం ఖమ్మం కలెక్టరేట్‌లో ఆయన ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం ధరణి ద్వారా సృష్టించిన చిక్కుముడులను విప్పుతూ, రైతులకు చుట్టంలా ఉండేలా భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ పొందిన 5,500 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను మండలాల వారీగా భూ విస్తీర్ణం ప్రాతిపదికన కేటాయించినట్టు తెలిపారు.
31 జిల్లాల్లోనూ ఫోరెన్సిక్ ఆడిట్..
ధరణిలో జరిగిన లోపాలపై పైలట్‌గా సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తి చేశామని, ఆ నివేదికలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన 31 జిల్లాల్లోనూ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామన్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో అవకతవలకు జరిగాయని, భూ భారతి వచ్చిన తర్వాతే ఇది జరిగినట్టు ప్రతిపక్షాలు చెబుతున్నది వాస్తవం కాదని చెప్పారు.
నాటి ధరణిలో ఉన్న లొసుగులతోనే ఇవి జరిగాయని తమ పరిశీలనలో తేలిందన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.


