‘ఐటీఐఆర్‌’పై బీజేపీది అసత్య ప్రచారం

KTR Says BJP False Propaganda On ITIR Project In Hyderabad - Sakshi

పలుమార్లు కేంద్రానికి ప్రాజెక్టు సమగ్ర నివేదిక పంపాం

అయినా కేంద్ర మంత్రి పంపలేదనడం లోక్‌సభను తప్పుదోవపట్టించడమే

మంత్రి కేటీఆర్‌ మండిపాటు  

సాక్షి, హైదరాబాద్‌: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ (ఐటీఐఆర్‌)కు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) పంపినా తెలంగాణ నుంచి ఎలాంటి సమాచారం లేదని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి సంజయ్‌ ధోత్రే ప్రకటించడం లోక్‌సభను తప్పుదోవ పట్టించడమేనని మంత్రి కె. తారక రామారావు విమర్శించారు. ఐటీఐఆర్‌ ప్రాజెక్టుపై స్థానిక బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంపై కేటీఆర్‌ గురువారం స్పందించారు.

ఐటీఐఆర్‌కు సంబంధించి గతంలోనే ఎన్నోసార్లు రాష్ట్రం నుంచి విజ్ఞప్తులు వెళ్లిన విషయాన్ని బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ వేసిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో కేంద్ర మంత్రి దాచిపెట్టారన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొలిరోజు నుంచే రాష్ట్రానికి ఐటీఐఆర్‌ ప్రాజెక్టును తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ లేఖ రాయడంతోపాటు కనీసం పది సందర్భాల్లో కేంద్రానికి ప్రత్యక్షంగా, లేఖల ద్వారా విజ్ఞప్తి చేశామన్నారు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన బండారు దత్తాత్రేయకు కూడా 2016లో స్వయంగా తాను డీపీఆర్‌ను అందజేసిన విషయాన్ని కేటీఆర్‌ గుర్తుచేశారు. బీజేపీ నేతలు ఇప్పటికైనా ఐటీఐఆర్‌ ప్రాజెక్టును హైదరాబాద్‌కు తీసుకురావాలన్నారు.

బీజేపీ నేతలవి అసత్య ప్రకటనలు
రాష్ట్ర బీజేపీ నాయకులతోపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా అసత్యాలతో ప్రజలను తప్పదోవ పట్టిస్తోందని కేటీఆర్‌ మండిపడ్డారు. ఐటీఐఆర్‌పై సత్వర నిర్ణయం తీసుకొని హైదరాబాద్‌ ఐటీ పరిశ్రమకు మరింత ఊతం అందించాలని 2014 జూన్‌ నుంచి 2021 జనవరి వరకు కేంద్రానికి పదేపదే విజ్ఞప్తి చేశామన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి పంపిన ప్రతి లేఖ, విజ్ఞప్తులు కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి రెండుసార్లు ఐటీఐఆర్‌కు సంబంధించిన డీపీఆర్‌లను సమర్పించినా తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తులను కేంద్రం బుట్టదాఖలు చేసిందన్నారు. పార్లమెంటు వేదికగా తాజాగా కేంద్ర మంత్రి కూడా ఇచ్చిన సమాధానాన్ని బట్టి ఐటీఐఆర్‌ రద్దుకే బీజేపీ మొగ్గు చూపుతున్నట్లు తేలుతోందన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top