‘రాయలసీమ ఎత్తిపోతల’ పరిశీలనకు కృష్ణా బోర్డు నిర్ణయం 

Krishna River Board Decides To Visits Rayalaseema Project - Sakshi

సభ్యులతో కృష్ణాబోర్డు ఇన్‌చార్జి చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ భేటీ 

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనుల పరిశీలనకు కృష్ణా బోర్డు సిద్ధమవుతోంది. ఓ పక్క జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నుంచి అందిన ఆదేశాలు, మరోపక్క కేంద్ర జల శక్తి శాఖ నుంచి పెరిగిన ఒత్తిడి. వీటికితోడు తెలంగాణ రాసిన లేఖ నేపథ్యంలో బుధవారం నుంచి ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించేందుకు బోర్డు ఏర్పాట్లు చేసుకుంటోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలుపుదల చేయించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా బోర్డుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో పాటే గతంలో ఎన్జీటీ ఆదేశాలకు అనుగుణంగా నిజనిర్ధారణ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని లేఖలో కోరింది.

ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రం సైతం దీనిపై త్వరగా తేల్చి తమకు నివేదిక ఇవ్వాలని జలశక్తి శాఖ బోర్డుకు సూచించింది. దీంతో కృష్ణా బోర్డు ఇన్‌చార్జి చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ సోమవారం సభ్యులతో భేటీ అయ్యారు. బోర్డు సభ్యులు హరికేశ్‌ మీనా, లుతాంగ్, సభ్య కార్యదర్శి దేవేందర్‌ తదితరులతో ఆయన పర్యటన విషయమై చర్చించారు. అయితే ఇప్పటికే పర్యటనకు సంబంధించి ఓ నోడల్‌ అధికారిని నియమించాలని ఏపీని కోరిన విషయాన్ని సభ్యులు చైర్మన్‌ దృష్టికి తెచ్చారు. గతంలో పర్యటన చేస్తామని చెప్పిన సమయంలో ముందుగా తెలంగాణ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను సందర్శించాలంటూ ఏపీ లేఖ రాసిందని, అయితే నోడల్‌ అధికారి నియామకంపై మాత్రం ఇంతవరకు స్పందించలేదని వెల్లడించారు.

మంగళవారం ఉదయం వరకు వేచిచూసి సాయంత్రానికి రాయలసీమ ప్రాజెక్టు పర్యటన షెడ్యూల్‌ ఖరారు చేయాలని, అవసరం అయితే కేంద్రానికి సమాచారం అందించి భద్రత కోరాలని నిర్ణయించినట్లు తెలిసింది. రాయలసీమ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి వారం, పది రోజుల్లో వాస్తవాలను కేంద్రానికి నివేదించాలని సభ్యులు దృఢ సంకల్పంతో ఉన్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top