మినరల్‌ వాటర్‌.. మిల్లెట్‌ భోజనం!

Kotwal's special focus on the health of city police - Sakshi

నగర పోలీసుల ఆరోగ్యంపై కొత్వాల్‌ ప్రత్యేక దృష్టి 

బందోబస్తు విధుల్లో ఉన్న సిబ్బందికి బిర్యానీకి బదులు పౌష్టికాహారం 

ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సహకారంతో పంపిణీ    ఈ తరహా సేవలు అందించడం దేశంలోనే తొలిసారి 

సాక్షి, హైదరాబాద్‌ :  సభలు, సమావేశాలు, నిరసన ర్యాలీలు, ప్రముఖుల పర్యటనలు... భాగ్యనగరంలో దాదాపు నిత్యం ఎక్కడో ఒక చోట రోడ్లపై కనిపించే దృశ్యాలివి. దీనికితోడు నగరానికి ప్రముఖల రాకపోకల హడావుడి ఓవైపు.. ఏటా అట్టహాసంగా జరిగే గణేశ్‌ నిమజ్జనాలు, బోనాల వంటి పండగ సంబరాలు మరోవైపు... ఇలాంటి కార్యక్రమాలకు భారీ బందోబస్తు చేపట్టడం నగర పోలీసులకు కత్తిమీద సామే.. మరి అలాంటి సిబ్బంది ఆహార అవసరాలు తీర్చేందుకు ఇప్పటివరకు హెవీ, జంక్‌ ఫుడ్‌ అందిస్తున్న హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ తాజాగా తృణధాన్యాలతో చేసిన పౌష్టికాహారం అందిస్తోంది. దే

శంలో మరే ఇతర పోలీసు విభాగం ఇప్పటివరకు ఇలాంటి చర్యలు తీసుకోలేదు. నగర పోలీసు విభాగంలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ దీన్ని అమలు చేస్తున్నారు. బందోబస్తు విధుల్లో ఉన్న అధికారులకు మిల్లెట్స్‌ ఫుడ్‌తోపాటు మినరల్‌ వాటర్‌ కూడా అందిస్తున్నారు.

నగరం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థకు ఆర్డర్‌ ఇవ్వడం ద్వారా ఈ మిల్లెట్‌ ఫుడ్‌ ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. ప్రస్తుతం ‘ప్లాన్డ్‌ బందోబస్తు’ల వరకు మాత్రమే అమలవుతున్న ఈ విధానాన్ని ‘సడన్‌ బందోబస్తు’లకూ వర్తింపజేయాలని ఆనంద్‌ యోచిస్తున్నారు.  

అనారోగ్య సమస్యలకు అనేక కారణాలు
రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, కమిషనరేట్లతో పోలిస్తే హైదరాబాద్‌ సిటీ పోలీసుల పనితీరు పూర్తి భిన్నంగా ఉంటుంది. వాళ్లు ఏటా కనిష్టంగా 100 నుంచి 150 రోజులు బందోబస్తు విధుల్లో ఉండాల్సి వస్తుంది. వేళాపాళా లేని ఈ విధులతో సమయానికి ఆహారం, నిద్ర ఉండకపోవడంతోపాటు ఇంకా అనేక కారణాల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. చాలా మంది బీపీ, షుగర్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలతోపాటు ఊబకాయంతో బాధపడుతున్నారు. 

ఫిట్‌ కాప్‌తో 12 వేల మంది స్క్రీనింగ్‌... 
ఈ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోందని, సిబ్బందిలో అకాల మరణాలు సైతం సంభవిస్తున్నాయని గుర్తించిన నగర కొత్వాల్‌ సీవీ ఆనంద్‌... ఈ పరిణామం వ్యవస్థ పనితీరుపై ప్రభావం చూపుతుండటంపై ఆందోళన చెందారు. ఈ పరిస్థితులను మార్చేందుకు హెల్పింగ్‌ హ్యాండ్‌ సంస్థ సహకారంతో ఫిట్‌కాప్‌ పేరుతో ప్రత్యేక యాప్‌ను రూపొందించారు.

మహారాష్ట్రలోని పుణే పోలీసు విభాగం కోసం అందుబాటులో ఉన్న హెల్త్‌కేర్‌ సర్వీసెస్‌ ప్రొవైడర్‌ యాప్‌ స్ఫూర్తితోనే ఫిట్‌కాప్‌కు రూపమిచ్చారు. ఈ యాప్‌ ‘3 డీస్‌’గా పిలిచే డయాగ్నైస్, డెవలప్, డూ విధానంలో పనిచేస్తోంది. ఇప్పటికే 12 వేల మందికి స్క్రీనింగ్‌ చేసిన పోలీసు విభాగం అందులో అనేక మంది జీవనశైలికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించింది.

వారంతా వెంటనే ఆహార అలవాట్లు మార్చుకోవాలని వైద్యులు సూచించడంతో ఈ మార్పును బందోబస్తు డ్యూటీల నుంచే అమలులోకి తీసుకురావాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ విధుల్లో ఉన్న వారికి ఏళ్లుగా బిర్యానీ ప్యాకెట్లు సరఫరా చేయడం ఆనవాయితీగా కొనసాగుతుండగా దీన్ని మారుస్తూ మిల్లెట్‌ భోజనం అందించడానికి శ్రీకారం చుట్టారు. మిల్లెట్‌ బిర్యానీ, మిల్లెట్‌ కిచిడీ, మిల్లెట్లతోపాటు బెల్లంతో రూపొందించిన స్వీట్లు, మిల్లెట్‌ కర్డ్‌ రైస్, మినరల్‌ వాటర్‌ను అందిస్తున్నారు.  

హఠాత్తుగా తలెత్తే వాటికి ఎలా..? 
సిటీ పోలీసులకు ప్రధానంగా రెండు రకాలైన బందోబస్తు డ్యూటీలు ఉంటాయి. ఏళ్లుగా నిర్వహిస్తూ వస్తున్న గణేష్‌ ఉత్సవాలు, బోనాలు, ఎన్నికలు తదితరాలు ప్లాన్, స్కీమ్‌ ఉంటాయి. దీంతో ఏ రోజు? ఎక్కడ? ఎంత మంది విధుల్లో ఉంటారనేది స్పష్టంగా తెలుస్తుంది. దీని ఆధారంగా ఆ స్వచ్ఛంద సంస్థకు ఆర్డర్‌ ఇచ్చి మిల్లెట్‌ ఫుడ్‌ తయారు చేయిస్తున్నారు.

అయితే కొన్ని సందర్భాల్లో హఠాత్తుగా బందోబస్తు విధులు వచ్చిపడతాయి. ఈ అన్‌ప్లాన్డ్‌ విధుల్లో ఉన్న వారికి ప్రస్తుతం మిల్లెట్‌ ఫుడ్‌ అందించలేకపోతున్నారు. అయితే వారికీ కచ్చితంగా ఇచ్చేందుకు మార్గాలను ఉన్నతాధికారులు అన్వేషిస్తున్నారు. 

పోలీసులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు.. 


అధికారులు, సిబ్బంది ఎంత ఆరోగ్యంగా ఉంటే ప్రజలకు అంత మెరుగైన సేవలు అందించవచ్చు.  ఈ నేపథ్యంలోనే ఫిట్‌కాప్‌కు రూపమిచ్చాం. దీనికి కొనసాగింపుగానే మిల్లెట్‌ ఫుడ్‌ను పరిచయం చేశాం. సాధారణ భోజనాలకు అయ్యే ఖర్చుకు అదనంగా 30 నుంచి 40 శాతం దీనికి ఖర్చవుతుంది. దీనిపై సిబ్బంది నుంచి పాజిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ ఉంది. ఆహారం తీసుకోవడం ఆలస్యమైనా ఏ ఇబ్బందీ లేదని చెబుతున్నారు. అలాగే భోజనం చేసేప్పుడే కాకుండా ఎప్పుడైనా అధికారులు, సిబ్బందికి మినరల్‌  వాటర్‌ అందుబాటులో ఉండేలా చూస్తున్నాం.

– ‘సాక్షి’తో సీవీ ఆనంద్, హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌    
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top