Khammam: అమ్మానాన్న లేకున్నా... నేనున్నా

Khammam MLA Banoth Haripriya Nayak Shows Her Humanity On Kids - Sakshi

సాక్షి, ఇల్లెందు(ఖమ్మం): అమ్మానాన్నలను కోల్పోయి అనాథలుగా మారిన ఇద్దరు చిన్నారులకు నేనున్నా అని గతంలో ప్రకటించిన ఎమ్మెల్యే ఇప్పుడు వారిని స్వయంగా తీసుకెళ్లి పాఠశాలలో చేర్పించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆదర్శంగా నిలిచారు ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియానాయక్‌. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులోని 13వ నంబర్‌ బస్తీకి చెందిన భట్టు గణేశ్‌ గొంతు కేన్సర్‌తో 2018లో, ఆయన భార్య స్రవంతి కిడ్నీ సమస్యతో మూడు నెలల క్రితం మృతి చెందారు.

దీంతో వారి ఇద్దరు పిల్లలు కృషన్, హరిప్రియ పోషణభారం అమ్మమ్మ నాగమణిపై పడింది. వీరు ఓ చిన్న రేకుల షెడ్డులో నివసిస్తున్నారు. ఈ విషయాన్ని గణేశ్‌ మిత్రుడు ఫణి మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌ ద్వారా తెలియజేయగా, ఆయన స్పందిస్తూ పిల్లల బాధ్యత చూడాలని ఎమ్మెల్యే హరిప్రియ, జిల్లా కలెక్టర్‌ డి.అనుదీప్‌లకు సూచించారు. దీంతో అప్పట్లోనే ఎమ్మెల్యే చిన్నారుల ఇంటికి వెళ్లి చదువు, పోషణ బాధ్యత స్వీకరించడంతోపాటు డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.

అప్పటి నుంచి వారి బాధ్యత చూస్తున్న ఎమ్మెల్యే, తాజాగా పాఠశాలలు తెరిచిన నేపథ్యంలో బుధవారం చిన్నారులిద్దరినీ తీసుకెళ్లి ఇల్లెందులోని మార్గదర్శిని ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో 1, 3వ తరగతుల్లో చేర్పించి పుస్తకాలు, దుస్తులు అందజేశారు. ఆమె వెంట మార్కెట్‌ చైర్మన్‌ హరిసింగ్‌ నాయక్, మున్సిపల్‌ చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

చదవండి: అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్‌ వన్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top