అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్‌ వన్‌

Minister Harishrao Says Telangana number One In All Sectors In Karimnagar - Sakshi

సాక్షి, హుజూరాబాద్‌(కరీంనగర్‌): దక్షిణ భారతదేశంలో అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. బుధవారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ఎల్‌ఐసీ ఏజెంట్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం రంగ అతి పెద్ద సంస్థ అయిన ఎల్‌ఐసీని ప్రైవేటీకరించేందుకు కుట్రలు చేస్తున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. ఎల్‌ఐసీని ప్రైవేటీకరిస్తే ఏజెంట్లకు భద్రత లేకుండా పోతుందన్నారు. ఎల్‌ఐసీ ప్రజల నుంచి పాలసీల రూపంలో సేకరించిన డబ్బును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పుగా ఇస్తుందని తెలిపారు.

దేశంలో అతిపెద్ద  టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ను మూసివేశారని, బలవంతంగా యాభై వేల మంది ఉద్యోగులను వాలంటరీ రిటైర్మెంట్‌ ఇచ్చి తొలగించాలన్నారు. ఎల్‌ఐసీలో ఎఫ్‌డీఐకి అనుమతివ్వడం దుర్మార్గమన్నారు. ఎల్‌ఐసీని పరిరక్షించుకోవాలన్నా, అభివృద్ధి సాధించాలన్నా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బండి సంజయ్‌ ఎంపీగా గెలిచి రెండు సంవత్సరాలు అవుతున్నా హుజూరాబాద్‌కు ఏం చేశారని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్, నాయకులు పాడి కౌశిక్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అనంతరం స్థానిక విద్యానగర్‌లోని చొల్లేటి కిషన్‌రెడ్డి ఇంటి వద్ద కాలనీ వాసులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సైదాపూర్‌ రోడ్డు పునర్నిర్మాణం చేస్తామని.. సిద్దిపేట, కరీంనగర్‌ రోడ్ల తరహాలో అద్దంలా మెరిసేలా రోడ్డు నిర్మాణం ఉంటుందన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. ఇల్లందకుంట మండలానికి చెందిన పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు.

బతుకమ్మ పండుగలోపు రుణాలు
బతుకమ్మ పండుగ లోపు మహిళా సంఘాలకు రూ.కోటి 50లక్షలు ఇస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌ యార్డులో బుధవారం మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమానికి హాజరై రూ.2కోట్ల13లక్షల 48వేల వడ్డీలేని రుణాల చెక్కును అందించారు. ఈ సంవత్సరానికి సంబంధించి రూ.కోటి 50లక్షలు బతుకమ్మ పండగ లోపు జమ చేస్తానని వెల్లడించారు. పని చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.

జమ్మికుంట పట్టణంలో ఇంటింటికి మిషన్‌ భగీరథ తాగునీళ్లు అందిస్తున్నామని వివరించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మహిళలకు ఏం ఇచ్చిందని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు పాడి కౌశిక్‌రెడ్డి, తుమ్మెటి సమ్మిరెడ్డి, వైస్‌ చైర్‌పర్సన్‌ దేశిని స్వప్న, జెడ్సీటీసీ మాజీ సభ్యుడు ఆరుకాల వీరేశలింగం, నాయకులు పోడేటి రామస్వామి, టంగుటూరి రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

చదవండి:  మిత్రమా హరీశ్‌రావు.. ఈ బాధలన్నీ నీకు తెలియవా: ఈటల

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top