మిత్రమా హరీశ్‌రావు.. ఈ బాధలన్నీ నీకు తెలియవా: ఈటల

Etela Rajender Slams On KCR And Harish Rao At Veenavanka Huzurabad - Sakshi

వీణవంక/హుజూరాబాద్‌: ‘నేను గడ్డి పోచను కాదు. గడ్డపారనని కేసీఆర్‌కు అర్థమైంది. కేసీఆర్‌ బొమ్మ పెట్టుకుని నేను గెలవలేదు. హుజూరాబాద్‌ ప్రజల కాళ్లలో ముళ్లిరిగితే పంటితో పీకాను కాబట్టే ఇన్నాళ్లూ నా ప్రజలు గెలిపిస్తున్నారు’ అని మాజీ మంత్రి , బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. బుధవారం హుజూరాబాద్‌ మధువని గార్డెన్స్‌లో, వీణవంక మండలం ఘన్ముక్కుల గ్రామంలో టీఆర్‌ఎస్, టీడీపీకీ చెందిన పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఈటల మాట్లా డుతూ, ఫ్లెక్సీల్లో, గోడలపై మీ ఫొటోలుండొచ్చు. కానీ నా ఫొటో ప్రజల గుండెల్లో ఉంది. గాలి దుమారానికి, వర్షానికి మీ ఫొటోలు కొట్టుకు పోతాయి. కానీ ప్రజల గుండెల్లో ఉన్న నా ఫొటో చెరిగిపోదు’ అన్నారు. ఒకప్పుడు ప్రజా దర్బారు లాంటి కార్యక్రమాల ద్వారా ముఖ్యమంత్రులు ప్రజలను కలుసుకునేవారని తెలిపారు.

చివరకు తనలాంటి వాళ్లనూ ప్రగతిభవన్‌ గేట్ల దగ్గరే పోలీసులు ఆపారని గుర్తుచేసు కున్నారు. ‘మిత్రమా హరీశ్‌రావు.. ఈ బాధలన్నీ నీకు తెలియవా? నీవు అనుభవించలేదా? నీవు అబద్ధాలాడుతున్నావు, కావాలంటే నీ ఇల్లాలినడుగు, తడిచిపోయిన మెత్త(దిండు)నడుగు’ అన్నారు. ‘డబ్బు, అధికారం విషయంలో నేను టీఆర్‌ఎస్‌ వాళ్లతో పోటీ పడకపోవడచ్చు. కానీ, ప్రజాభిమానం నాపై ఉంది. నేను చిన్నోన్నే కావొచ్చు. అయినా చిచ్చర పిడుగులా కొట్లాడుతా’ అని వ్యాఖ్యానించారు.

తన వల్లే సీఎం కేసీఆర్‌కు దళితులు, గొల్లకురమలు, ఇతర కులాల వాళ్లు గుర్తుకు వస్తున్నారని, తన దెబ్బకు కేసీఆర్‌ ఫాంహౌస్, ప్రగతిభవన్‌ నుంచి బయటికి వచ్చారని అన్నారు. హుజూరాబాద్‌లో జరిగేది కౌరవులకు, పాండవులకు మధ్య జరుగుతున్న యుద్ధమని, తాము పాండవుల పక్షాన ఉన్న వాళ్లమని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, ఎర్రబెల్లి సంపత్‌రావు తదితరులున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top