మూడేళ్ల వరకు వేచి చూసే ధోరణికి స్వస్తి... త్వరలో అమల్లోకి రానున్న కీలక సంస్కరణ
ఏ సంవత్సరం పన్ను చెల్లింపులకు ఆ సంవత్సరమే నోటీసులు
2022 సంవత్సరం పన్ను ఇంకా చెల్లించని 20వేల మంది డీలర్లు
ఆ సంవత్సరంలో చెల్లించాల్సిన మొత్తం రూ.1,000 కోట్ల పైమాటే
ఒక్క నెలలోనే 20 వేల మందికి నోటీసులు జారీ చేసిన జీఎస్టీ కమిషనర్
వెంటనే పన్ను చెల్లించాలని ఆదేశాలు.. కనీసం రూ.800 కోట్లు జమ అవుతాయని అంచనా
సాక్షి, హైదరాబాద్: చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకొని పన్ను చెల్లింపులో జాప్యం చేయడంతోపాటు పన్ను ఎగవేతకు పాల్పడే విధానానికి చెక్ పెట్టేలా తెలంగాణ పన్నుల శాఖ చర్యలకు ఉపక్రమించింది. ఇక నుంచి ఎప్పటికప్పుడే పన్ను చెల్లింపులు జరిగేలా కీలక సంస్కరణ అమలు చేయనుంది. గతంలో లాగా మూడేళ్ల పాటు పన్ను చెల్లింపు కోసం వేచి చూడకుండా ఏయేటికాయేడు నోటీసులు జారీ చేసి పన్ను చెల్లింపులకు సత్వర పరిష్కారం చూపాలని నిర్ణయించింది. ఈ మేరకు కీలక సంస్కరణ అమలు దిశలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కమిషనర్ రఘునందన్‌రావు ముందడుగు వేశారు. 2025 డిసెంబర్ నాటికి పన్ను చెల్లించకుండా పెండింగ్ పెట్టిన రాష్ట్రంలోని 20వేల మంది డీలర్లకు నోటీసులతోపాటు పన్ను చెల్లించేలా ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
ఇక నుంచి మార్పు
జీఎస్టీ కమిషనర్ రఘునందన్‌రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. చట్టంలో మూడేళ్ల కాలపరిమితి ఉన్నా, పన్ను చెల్లించని డీలర్లకు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. మూడేళ్ల వరకు పన్ను చెల్లించకుండా ఉండే వెసులుబాటును వ్యాపారులకు ఇవ్వొద్దని, ఏటా సమీక్షించి వెంటనే నోటీసులు జారీ చేయాలని, 19 రోజుల అనంతరం పన్ను చెల్లింపు ఉత్తర్వులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని తన ఆదేశాల్లో అధికారులను కోరారు. మరో రెండు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో మొండి బకాయిలు రాబట్టడంతోపాటు చట్టం ప్రకారం రావాల్సిన పన్నులో వీలున్నంత ఎక్కువ మొత్తాన్ని రాబట్టేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కూడా రఘునందన్‌రావు చెప్పారు.
మూడేళ్ల నిబంధన.. ముప్పు తిప్పలు
జీఎస్టీ చట్టం ప్రకారం సకాలంలో పన్ను చెల్లించని డీలర్ల (వ్యాపారులు) నుంచి మూడేళ్ల సమయంలోపు నోటీసులిచ్చి పన్ను వసూలు చేయాలి. ఉదాహరణకు 2022 డిసెంబర్‌లో చెల్లించాల్సిన పన్ను లావాదేవీని 2025 డిసెంబర్‌లోపు పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ మూడేళ్ల సమయంలోపు ఎప్పుడైనా సదరు డీలర్‌కు నోటీసులిచ్చి పన్ను చెల్లించాలని కోరవచ్చు. అయితే, గడువు ముగియడానికి 19 రోజుల్లోపు ఈ నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. ఈ మూడేళ్ల వెసులుబాటుతో రాష్ట్రంలో దాదాపు 8 శాతం మంది డీలర్లు పన్ను చెల్లించడం లేదని ఆ శాఖ ఉన్నతాధికారుల పరి«శీలనలో తేలింది. అంటే దాదాపు 20 వేల మందికి పైగా డీలర్లు మూడేళ్ల పన్ను బకాయి ఉన్నారని గుర్తించింది.
వీరికి నోటీసులిచ్చి పన్ను చెల్లించాలని ఆదేశాలివ్వడంలో పన్నుల శాఖ అధికారులు కూడా నిర్లక్ష్యం ప్రదర్శించారనే నిర్ధారణకు వచ్చారు. 2025 డిసెంబర్‌లోపు వారికి నోటీసులు జారీ చేయలేని పక్షంలో చట్టం ప్రకారం సదరు పన్ను వసూలు చేసే అవకాశముండదన్న కారణంతో ఒక్క నెల రోజుల వ్యవధిలోనే 20వేల మంది డీలర్లకు పన్ను చెల్లింపుల కోసం జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేశారని సమాచారం. ఈ మేరకు 20వేల మంది డీలర్లు చెల్లించాల్సిన పన్ను రూ.1,000 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. అందులో కనీసం రూ.800 కోట్లు వెంటనే వసూలవుతాయని పన్నుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కొందరు తమ నోటీసులతోపాటు పన్ను చెల్లింపు ఆదేశాలపై జీఎస్టీ ట్రిబ్యునల్‌కు వెళతారని, మరికొందరు హైకోర్టును ఆశ్రయిస్తారని భావిస్తున్నారు.


