హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్‌ కేసులో కీలక వ్యక్తి అరెస్ట్‌ | Key Person Arrested In Hyderabad Kidney Racket Case | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్‌ కేసులో కీలక వ్యక్తి అరెస్ట్‌

Jan 26 2025 9:32 PM | Updated on Jan 26 2025 9:32 PM

Key Person Arrested In Hyderabad Kidney Racket Case

కిడ్నీ రాకెట్‌ కేసులో కీలక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: కిడ్నీ రాకెట్‌ కేసులో కీలక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలో డాక్టర్‌ రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నీ రాకెట్‌లో కీలకంగా వ్యవహరించాడని రాజశేఖర్‌పై అభియోగం ఉంది. కిడ్నీ రాకెట్‌పై సరూర్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. రాజశేఖర్‌ను పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు.

కాగా, అలకనందా ఆసుపత్రి యజమాని సుమన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అలకనంద కిడ్నీ రాకెట్ కేసు విచారణను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే తాజాగా ఆసుపత్రి యజమాని సుమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఉజ్బెకిస్థాన్‌ ఎంబీబీఎస్‌ సర్టిఫికెట్‌తో సుమన్‌ క్లీనిక్‌ అనుమతి పొందినట్టు పోలీసులు గుర్తించారు.

అయితే, ఆసుపత్రిలో నెఫ్రాలజీ ట్రీట్‌మెంట్‌కు ఎలాంటి అనుమతి లేకపోవడం గమనార్హం. ఎంబీబీఎస్‌ సర్టిఫికెట్‌తో తొమ్మిది బెడ్స్‌కు క్లీనిక్‌కు అధికారులు అనుమతిచ్చారు. కానీ, అక్కడ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని సుమన్‌ నిర్వహిస్తున్నాడు. దీంతో​, డీఎంహెచ్‌వో ఆసుపత్రిని సీజ్‌ చేశారు. ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు ఈ కేసులో ఎనిమిది మంది బ్రోకర్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ పవన్, మద్యవర్తి ప్రదీప్‌ను అరెస్ట్‌ చేశారు. అలాగే, తమిళనాడుకు చెందిన నస్రీంభాను, ఫిర్ధోస్‌లను కిడ్నీ డోనర్లుగా గుర్తించారు. బెంగళూరుకు చెందిన రాజశేఖర్, బట్టు ప్రభకు కిడ్నీలు అమర్చిన వైద్యులు. ఈ క్రమంలో ఒక్కో ఆపరేషన్ 55లక్షల వసూలు చేశారు ఆసుపత్రి సిబ్బంది.

మరోవైపు, కిడ్నీ రాకెట్‌ కేసును తెలంగాణ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలన్నారు. కేసు పూర్వపరాలను సమీక్షించిన మంత్రి.. తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రభుత్వాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

 


 

Advertisement
 
Advertisement
Advertisement