నదులున్నా తాగునీరేదీ? | Sakshi
Sakshi News home page

నదులున్నా తాగునీరేదీ?

Published Tue, Apr 25 2023 3:11 AM

KCR Speech At BRS Aurangabad Sabha - Sakshi

‘వాస్తవానికి దేశంలో సమృద్ధిగా నీటి వనరులున్నాయి. వీటిని సాగు యోగ్యత ఉన్న భూములకు అందించాల్సి ఉంది. 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేయగల వనరులు ఉన్నాయి. దేశం మొత్తం వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇవ్వొచ్చు.  ప్రస్తుతం తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం. నేను చెప్పేది అబద్ధమైతే ఒక్క నిమిషం కూడా సీఎం పదవిలో ఉండను.
– సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: దేశ ప్రజలకు ఇప్పటికీ తాగు, సాగునీరు సరిగా అందడం లేదని బీఆర్‌ఎస్‌ అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విమర్శించారు. యువతకు ఉద్యోగాలు కూడా లేవని ధ్వజమెత్తారు. గోదావరి, కృష్ణా వంటి నదులున్నా మహారాష్ట్రకు నీటి సమస్య ఎందుకని నిలదీశారు. ‘దేశంలో ఇన్ని జీవనదులు ఉన్నా తాగేందుకు నీళ్లుండవా? పెద్దపెద్ద మాటలు మాట్లాడే పాలకులు కనీసం తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వలేరా? రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? సాగు, తాగునీరు అందించని పాపం ఎవరిది? ఇలాంటి ప్రభుత్వాలను కొనసాగించాలా? ఇంటికి పంపాలా?..’ అని ప్రశ్నించారు.

సోమవారం మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జబిందా మైదానంలో జరిగిన బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో కేసీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్, బసవేశ్వరుడు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌తో పాటు పలువురు మరాఠా యోధులకు నివాళులర్పించారు. పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే అభయ్‌ పాటిల్‌తో పాటు ఆయన అనుచరులు, ఇతర నాయకులకు గులాబీ కండువాలు కప్పి బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. అనంతరం సభకు హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడారు. 

మార్పు రాకుంటే దేశం ముందుకెళ్లదు.. 
‘మహారాష్ట్ర పవిత్రభూమికి నమస్కారం. ముస్లిం మైనారిటీలకు రంజాన్‌ శుభాకాంక్షలు. మరాఠా భూమి ఎందరో మహానుభావులకు జన్మనిచ్చింది. ముంబై దేశ ఆర్థిక రాజధాని. కానీ తాగేందుకు నీళ్లుండవా? ఔరంగాబాద్, అకోలాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. దేశం పురోగమిస్తోందా? తిరోగమిస్తోందా? ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కావట్లేదు. ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు. పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. ఇది ఇలాగే కొనసాగాలా? చికిత్స చేయాలా? ఇంకెంత కాలం పరిష్కారం కోసం ఎదురుచూడాలి? ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కల్పిస్తున్నా ఊరుకోవాలా? భయపడుతుంటే ఇంకా భయపెట్టిస్తారు.

ధైర్యంగా పోరాడితేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అన్నివర్గాలకు సరైన న్యాయం దక్కాల్సిందే. మార్పు రాకుంటే దేశం ముందుకెళ్లదు. అనివార్యమైన మార్పును తీసుకురావడం కోసమే బీఆర్‌ఎస్‌ పుట్టింది. ఒక కులం, మతం, వర్గం కోసం ఆవిర్భవించలేదు. బీఆర్‌ఎస్‌కు ఒక లక్ష్యం ఉంది. మార్పు వచ్చే వరకు పార్టీ పోరాటం ఆగదు. నిజాయితీగా మేం చేసే పోరాటానికి విజయం తథ్యం. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికీ నీరు ఇస్తాం. కొత్త పార్టీ అనగానే కొందరు అపవాదులు సృష్టిస్తారు. ఎన్ని అవాంతరాలు సృష్టించినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు..’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. 

అబద్ధమైతే సీఎం పదవిలో నిమిషం కూడా ఉండను 
‘వాస్తవానికి దేశంలో సమృద్ధిగా నీటి వనరులున్నాయి. వీటిని సాగు యోగ్యత ఉన్న భూములకు అందించాల్సి ఉంది. 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేయగల వనరులు ఉన్నాయి. దేశం మొత్తం వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇవ్వొచ్చు. నేను చెప్పేది అబద్ధమైతే ఒక్క నిమిషం కూడా సీఎం పదవిలో ఉండను. తెలంగాణలో మంచినీటి సమస్య లేకుండా చేశాం. తెలంగాణ రాకముందు రోజుకు 3 గంటలే కరెంటు ఉండేది.

ఒక్కోసారి అది కూడా ఉండేది కాదు. ప్రస్తుతం తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం. భూముల రిజిస్ట్రేషన్లు పావుగంటలో అవుతున్నాయి. రైతు చనిపోతే బీమా కల్పిస్తున్నాం. ఇవి మహారాష్ట్రలో ఎందుకు అమలు కావడం లేదు? తెలంగాణలో సాధ్యమైనప్పుడు మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదు? ఎందుకంటే ప్రధాని, రాష్ట్రాల సీఎంలకు ఆ పనిచేసే సామర్థ్యాలు లేవు..’ అని కేసీఆర్‌ విమర్శించారు.  

కొత్త లక్ష్యాలు, కొత్త సంకల్పంతో ముందుకు సాగాలి 
‘నా మాటలు ఇక్కడ విని ఇక్కడే మరిచిపోకండి. గ్రామాలకు వెళ్లి చర్చ చేయండి. మీ ఇంటివాళ్లు, స్నేహితులు, వీధిలో ఉన్న వారితో చర్చించండి. దేశంలో ఉండాల్సిన స్థితిలో ఉందా? లేదా? అనే విషయంపై చర్చ పెట్టాలి. లక్ష్యం లేని ప్రయాణం ఎక్కడికి వెళుతుంది? దేశం కొత్త లక్ష్యాలు, కొత్త సంకల్పంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయ్యింది. అయినా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. శంభాజీనగర్‌లో వారానికోసారి నీళ్లు వస్తాయా? మహారాష్ట్రలో కేబినెట్‌ ఉంటుంది. చీఫ్‌ సెక్రటరీ ఉండరా?..’ అని ప్రశ్నించారు. 

తెలంగాణ మోడల్‌ అమలు చేస్తే ఎందుకు వస్తా? 
‘కేసీఆర్‌కు మహారాష్ట్రలో ఏం పని అని ఫడ్నవీస్‌ అంటున్నారు. తెలంగాణ లాంటి మోడల్‌ మహారాష్ట్రలో తీసుకొస్తే నేనెందుకు వస్తాను? మహారాష్ట్రలో దళితబంధు, రైతుబంధు అమలు చెయ్‌.. 24 గంటల కరెంటు ఇవ్వు. రైతుబంధు, రైతుబీమా కల్పించండి. ఇవన్నీ అమలు చేస్తే మహారాష్ట్రకు రానే రాను. అంబేడ్కర్‌ జన్మించిన నేలపై దళితులను పట్టించుకోరా? దళితబంధు లాంటి పథకం మహారాష్ట్రలో ఎందుకు అమలు చేయరు?..’ అని నిలదీశారు.  

ప్రజల ఆకాంక్ష గెలవాలి 
‘దేశంలో పరివర్తన రావాల్సిన అవసరం ఉంది. ఒక పార్టీ గెలిస్తే.. మరో పార్టీ ఓడిపోవడం పరివర్తన కాదు. ఎవరు గెలిచినా సమస్య అపరిష్కృతంగానే ఉంటోంది. అందువల్ల పార్టీలు గెలవడం ముఖ్యం కాదు.. ప్రజల ఆకాంక్ష గెలవడం ముఖ్యం.  పరివర్తన రానంత కాలం ఈ దేశం ఇలాగే కునారిల్లుతుంది. ఎంత త్వరగా మేల్కొంటే.. అంత తర్వగా బాగుపడతాం..’ అని కేసీఆర్‌ అన్నారు. నూతనంగా నిర్మించే పార్లమెంటుకు అంబేడ్కర్‌ పేరు పెట్టాలని డిమాండ్‌ చేశారు.    

అభయ్‌ పాటిల్‌ ఇంటికి కేసీఆర్‌ 
హైదరాబాద్‌ నుంచి ఔరంగాబాద్‌ సభకు వెళ్లిన కేసీఆర్, విమానాశ్రయం నుంచి నేరుగా వైజాపూర్‌ మాజీ ఎమ్మెల్యే అభయ్‌ పాటిల్‌ ఇంటికి చేరుకున్నారు. ఆయనకు అక్కడ అపూర్వ స్వాగతం లభించింది. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసు ఏర్పాటు చేస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. కేసీఆర్‌ వెంట పార్టీ ఎంపీలు కేశవరావు, రంజిత్‌ రెడ్డి, సంతోష్‌ కుమార్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, కడియం శ్రీహరి, ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ఉన్నారు.   

Advertisement
Advertisement