నమో భారత్‌ హబ్‌గా కాజీపేట | Kazipet as a Namo Bharat hub | Sakshi
Sakshi News home page

నమో భారత్‌ హబ్‌గా కాజీపేట

Jul 6 2026 4:22 AM | Updated on Jul 6 2026 4:22 AM

Kazipet as a Namo Bharat hub

వచ్చే ఐదేళ్లలో 200 ర్యాపిడ్‌ రైల్‌ రేక్స్‌ తయారీ

సెప్టెంబర్‌లో తయారీ సంస్థకు వర్క్‌ ఆర్డర్‌

160 కి.మీ. వేగ సామర్థ్యంతో ఆధునిక రైళ్ల తయారీ

24 కోచ్‌లతో కూడిన రేక్‌ తయారీకి వీలుగా షెడ్స్‌ విస్తరణ

సాక్షి, హైదరాబాద్‌: కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీని నమోభారత్‌ ర్యాపిడ్‌ రైళ్ల (నెక్ట్స్‌ జనరేషన్‌ మెమూ రైళ్లు) తయారీ హబ్‌గా మార్చేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం లోకల్‌రైళ్లుగా నడుస్తున్న సంప్రదాయ ఐసీఎఫ్‌ రైళ్లను పూర్తిగా తొలగించి వాటి స్థానంలో ఆధునిక రైళ్లను ప్రవేశపెడుతోంది. ప్రధాన నగరాలు, దాని ఉప పట్టణాల సమీపంలోని పెద్ద పట్టణాల మధ్య వేగవంత, సుఖమయ రైలు ప్రయాణాన్ని అందుబాటులోకి తేవాలని ఇప్పటికే నిర్ణయించింది. 300 కి.మీ. దూరంలో ఉండే ప్రాంతాల మధ్య ఇంటర్‌ సిటీ ర్యాపిడ్‌ రైళ్లను నడపాలన్న ప్రణాళికతో ఉంది. ఇందుకు దేశవ్యాప్తంగా అలాంటి రైళ్లకు భారీగా డిమాండ్‌ ఉంది. దాదాపు 500 రైళ్లు కావాలన్నది ఓ అంచనా. ఈ నేపథ్యంలో, ఈ నమోభారత్‌ ర్యాపిడ్‌ రైళ్ల తయారీని పెంచేందుకు నిర్ణయించింది. ఇప్పటికే చెన్నై ఇంటెగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ, కపుర్తలా, రాయ్‌బరేలీ కోచ్‌ ఫ్యాక్టరీల్లో వీటి తయారీ జరగుతోంది. వీటితోపాటు లాతూర్‌తోపాటు కాజీపేటలోని కోచ్‌ ఫ్యాక్టరీని కూడా ఎంపిక చేశారు. భవిష్యత్తులో దీన్ని మరింత విస్తరించటం ద్వారా ఆ రైళ్ల తయారీలో ఓ ప్రధాన కేంద్రంగా మార్చబోతున్నారు.  

వచ్చే ఐదేళ్లలో 200 రైళ్లు... 
కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీలో వచ్చే ఐదేళ్లలో 200 నెక్ట్స్‌ జనరేషన్‌ ఏసీ రైల్‌ రేక్స్‌ (రైలు సెట్‌) తయారీ చేయా లని నిర్ణయించారు. వీలైతే ఆ సంఖ్యను పెంచాలన్న యోచన ఉంది. ఎంఎంటీఎస్‌ తరహాలో నగరంలో తిరిగే రైల్‌ సెట్లతోపాటు, ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైల్‌ సర్వీసుల కోసం వీటిని ఉపయోగించనున్నారు. దేశవ్యాప్తంగా అవసరాల కోసం ఇక్కడి నుంచి సరఫరా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. 
 
టెండర్లు పిలిచిన ఐసీఎఫ్‌... 
ఈ కోచ్‌ ఫ్యాక్టరీలో రైళ్ల తయారీకి టెండర్ల ప్రక్రియను చెన్నైలోని ఐసీఎఫ్‌ కోచ్‌ ఫ్యాక్టరీకి అప్పగించగా, మూడు రోజుల క్రితం 200 నెక్ట్స్‌జనరేషన్‌ రైల్‌ కోచ్‌ల కోసం టెండర్లు ఆహా్వనించింది. సెప్టెంబరు 30న టెండర్లు తెరవనున్నారు. ఒప్పంద ప్రక్రియ పూర్తయ్యే సరికి ఈ ఏడాది ముగియనుంది. ఆ తర్వాత ఆరు నెలల్లో నిర్మాణ కంపెనీ ప్రొటోటైప్‌ రేక్‌ను సిద్ధం చేస్తుంది. దానికి ఆమోదం చెప్పగానే, ఉత్పత్తి మొదలవుతుంది. మొదటి సంవత్సరం 50 రైళ్లు తయారవుతాయి. ఆ తర్వాత ఉత్పత్తి పెంచుతారు.  

మరింత ఆధునికంగా... 
1. కాజీపేటలో తయారయ్యే రైళ్లు మరింత ఆధునికంగా ఉండనున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు 130 కి.మీ. గరిష్ట వేగం సామర్థ్యంతో ఉండగా, ఇక్కడ తయారయ్యే రైళ్ల గరిష్ట వేగం 160 కి.మీ.గా ఉండనుంది. ఆమేరకు వీటి ఎయిర్‌్రస్పింగ్‌ సస్పెన్షన్, సెల్ఫ్‌ ప్రొపెల్డ్‌ టెక్నాలజీని అప్‌గ్రేడ్‌ చేస్తున్నారు. ప్రధాన రూట్లలో 160 కి.మీ. వేగాన్ని తట్టుకునే ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నందున వీటిని ఆయా రూట్లలో తిప్పుతారు. కాజీపేటలో అన్నీ ఏసీ కోచ్‌ రైళ్లనే తయారు చేసే ఆలోచనలో ఉన్నారు.  

2. ప్రస్తుతం 16 కోచ్‌ల ఇంటర్‌సిటీ రైళ్లు ఎక్కువగా తిరుగుతున్నాయి. ఇటీవలే కొన్నింటిని 20కి పెంచారు. భవిష్యత్తులో 24 కోచ్‌లకు పెంచాలన్న ఆలోచనలో రైల్వే బోర్డు ఉంది. కాజీపేట్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 24 కోచ్‌ల కాని్ఫగరేషన్‌తో కూడిన రైళ్లను తయారు చేయనున్నట్టు, ఆదివారం ఆ కోచ్‌ ఫ్యాక్టరీని సందర్శించిన రైల్వే బోర్డు చైర్మన్‌ సతీశ్‌కుమార్‌ అధికారులతో వెల్లడించారు. ఆమేరకు కోచ్‌ ఫ్యాక్టరీలో మార్పులు చేయాలని సూచించారు. ప్రస్తుతం అక్కడి కోచ్‌ తయారీ షెడ్‌ 400 మీటర్ల పొడవుతో ఉంది. దాన్ని 500 మీటర్లకు పెంచాలని ఆయన సూచించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement