మావోల హిట్‌లిస్టులో పలువురు ఎమ్మెల్యేలు.. హింసతో ఉనికి చాటుకోవాలని మావోల ప్లాన్‌?

Karimnagar: Some BJP TRS MLA Names In Maoist Hit List - Sakshi

సాక్షి , కరీంనగర్‌: ఒకప్పుడు మావోయిస్టు పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి కరీంనగర్‌లో రెండువారాలుగా కలకలం రేగుతోంది. మావో యిస్టు రాష్ట్ర కార్యదర్శి మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్, యాక్షన్‌ కమిటీ సభ్యుడు పాండు అలియాస్‌ మంగులు దళాలు ప్రవేశించాయని పోలీసులు అప్రమత్తమయ్యారు. గోదావరి నది దాటి వీరు పెద్దపల్లి జిల్లాలోనూ ప్రవేశించే ప్రమాదముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో సోమవారం సీఎం పెద్దపల్లి పర్యటనలో ఆఖరు నిమిషాన రోడ్డు మార్గం వద్దని పోలీసులు కేసీఆర్‌ను ఆకాశమార్గం (హెలీక్యాప్టర్‌) ద్వారా రప్పించారు. 2005 తరువాత మావోయిస్టు పార్టీ పాత కరీంనగర్‌ జిల్లాలో దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. 2020 లాక్‌డౌన్‌ సమయంలో జిల్లాలో కార్యకలాపాలు సాగించేందుకు తిరిగి యత్నాలు ప్రారంభించింది. సిరిసిల్లలో ఓ కాంట్రాక్టరు వద్ద డబ్బులు వసూలు చేయడం, జగిత్యాలలోనూ రిక్రూట్‌మెంట్‌ కోసం ప్రయత్నించడం వంటి ఘటనలు వెలుగుచూశాయి. 

ఎక్కడికక్కడ అణిచివేత..!
మావోలతో సంబంధాలున్న ఏ నెట్‌వర్క్‌నైనా ఉమ్మడి జిల్లా పోలీసులు ఎక్కడికక్కడ భగ్నం చేశారు. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో గ్రానైట్‌ పరిశ్రమలలో పనిచేసే కొందరితో మావోలు కొంతకాలం రహస్య సంబంధాలు నెరిపారు. ఈ వ్యవహారంపై కన్నేసిన కరీంనగర్‌ సీపీ సత్యనారాయణ గంగాధర, చొప్పదండి, బావుపేట, హుస్నాబాద్‌లకు చెందిన పలువురిని అరెస్టు చేసి మావోల నెట్‌వర్క్‌ను తెంచారు. అలాగే.. జనశక్తి పేరిట కొందరు మాజీలు సిరిసిల్లలో కార్యకలాపాలకు పూనుకునేందుకు సిద్ధమైనా.. ఎస్పీ రాహుల్‌ హెగ్డే వీరిని ఆదిలోనే అణిచివేశారు. ఇదే జనశక్తికి చెందిన పలువురు ఆయుధాలతో జగిత్యాలలో సంచరిస్తుండగా.. ఎస్పీ సింధు శర్మ బృందం వీరిని అదుపులోకి తీసుకుంది. రామగుండం కమిషనరేట్‌ పరిధిలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఎలాంటి కదలికల్లేకుండా జాగ్రత్తపడుతున్నారు.

సున్నిత ప్రాంతంగా పెద్దపల్లి జిల్లా..
తాజాగా పెద్దపల్లి జిల్లాలోని ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో వెలుగుచూసిన కుంభకోణంలో మావోయిస్టు కార్యదర్శి వెంకటేశ్‌ పేరుతో విడుదలవుతున్న లేఖలపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. ఆ లేఖల్లో పలువురు నేతల పేర్లు ప్రస్తావించడంతో అవి ఎక్కడ నుంచి వచ్చాయన్న విషయంపై పోలీసులు కూపీ లాగుతున్నారు. అదే విధంగా మాజీ మావోలపైనా రహస్యంగా నిఘా కొనసాగిస్తున్నారు. ఈ లేఖలు తొలుత ఆగస్టు 25న, ఆ తరువాత 31న మావోయిస్టు పార్టీ జయశంకర్‌– మహబూబాబాద్‌– వరంగల్‌2– పెద్దపల్లి జిల్లాల డివిజన్‌ కమిటీ పేరుతో వచ్చాయి. 

తొలుత ఈ లేఖను కొందరు ఆకతాయిలు విడుదల చేశారని పోలీసులు భావించారు. కానీ.. వీటిని మావోయిస్టులే విడుదల చేశారని ఇటీవల పోలీసులు కూడా నిర్ధారించినట్లు సమాచారం. మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్‌ సరిహద్దులకు సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతంలోని కొందరు నాయకులకు ముప్పు అధికంగా ఉందని, దీన్ని సున్నిత ప్రాంతంగా గుర్తించి ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. అనుమానితులు, కొత్త వ్యక్తుల సమాచారాన్ని నిరంతరం తెప్పించుకుంటున్నారు. జిల్లా సరిహద్దుల వద్ద సీసీ కెమెరాలు, ఇన్‌ఫార్మర్ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. 
చదవండి: Hyderabad: చూస్తుండగానే బాలుడిపైకి దూసుకెళ్లిన కారు.. భయానక దృశ్యాలు

టీఆర్‌ఎస్, బీజేపీ నేతలే టార్గెట్‌..!
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, బీజేపీ నేతలను టార్గెట్‌గా చేసుకుని మావోలు దాడులకు పాల్పడతారన్న సమాచారం పోలీసుల వద్ద ఉంది. తద్వారా పాత జిల్లాలో తిరిగి ఉనికిని చాటుకోవాలన్నది మావోల వ్యూహమని పోలీసులు చెబుతున్నారు. దీంతో మావోల జాబితాలో ఉన్న సదరు నేతలను పోలీసులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఎక్కడా పర్యటించవద్దని స్పష్టంచేశారు. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా నేతలకు ముప్పు అధికంగా పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.

ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో నెట్‌వర్క్‌ నాశనమైందన్న ఆందోళనలో ఉన్న మావోలు దాన్ని పునరుద్ధరించుకోవాలన్నా.. పార్టీకి నిధులు సమకూర్చుకోవాలన్నా.. వారి ముందున్న ఏకైక మార్గం హింస. అందుకే.. పోలీసులు వీఐపీ నేతల రక్షణకు సంబంధించిన ప్రతీ అంశాన్ని చాలా పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నారు. భద్రత విషయంలో చిన్న లోపమున్నా.. మావోలు హింసకు పాల్పడతారన్న సమాచారంతో అనునిత్యం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top