స్టూడెంట్‌ లీడర్‌ టు మాస్‌ లీడర్‌.. కూతురి పెళ్లిరోజే రాష్ట్రస్థాయి పదవి

Karimnagar Ex Mayor Ravinder Singh appointed As Civil Supplies Chairman - Sakshi

సాక్షి, కరీంనగర్‌: ఉద్యమ నాయకుడు సర్దార్‌ రవీందర్‌సింగ్‌ను అదృష్టం వరించింది. స్టూడెంట్‌ లీడర్‌గా రాజకీయ అరంగ్రేటం చేసిన రవీందర్‌సింగ్‌ మాస్‌లీడర్‌గా, న్యాయవాదిగా, బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీ కరీంనగర్‌ పట్టణ అధ్యక్షుడిగా, ఐదుసార్లు కౌన్సిలర్‌గా, కార్పొరేటర్‌గా ఎన్నికవ్వడమే కాకుండా కరీంనగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా బాధ్యతలు నిర్వహించారు. తాజాగా రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్‌ చైర్మన్‌గా రవీందర్‌సింగ్‌ను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేయడంతో అదృష్టమంటే రవీందర్‌సింగ్‌దే అంటూ చెప్పుకోవచ్చు.

సాక్షాత్తు సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌లో రవీందర్‌ సింగ్‌ కూతురు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కొద్దిసేపటిలోనే రాష్ట్రస్థాయి చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం, టీఆర్‌ఎస్‌ పార్టీని బీఆర్‌ఎస్‌ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదిస్తూ నిర్ణయాలన్ని ఒకేరోజు కావడం అనూహ్యంగా జరిగాయి. 

సివిల్‌ సప్లయ్‌ చైర్మన్‌గా సర్దార్‌
కరీంనగర్‌ మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ను రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం జీవో ఆర్టీ 2313 నెంబర్‌ ద్వారా రవీందర్‌సింగ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ జీవో విడుదల చేశారు. కరీంనగర్‌లో రవీందర్‌సింగ్‌ కూతురు వివాహానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులను ఆశీర్వదించారు. సీఎం వివాహ వేడుక నుంచి వెళ్లిపోయిన కొద్ది సేపటిలోనే ఉత్తర్వులు వెలువడడంతో రవీందర్‌సింగ్‌ కూతురి పెళ్లికి సీఎం గిఫ్ట్‌ ఇచ్చారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 

స్టూడెంట్‌ లీడర్‌గా.. మాస్‌ లీడర్‌గా..
రవీందర్‌సింగ్‌ విద్యార్థి దశలోనే 1984లో ఎస్సారార్‌ డిగ్రీ కళాశాలకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి రాజకీయాలంటే మక్కువ. ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి న్యాయవాద వృత్తిని చేపట్టి కొద్ది కాలంలోనే రాజకీయ అరంగ్రేటం చేశారు. కరీంనగర్‌ మున్సిపాల్టీలో 1995లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా విజయం సాధించి కౌన్సిలర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2001లో బీజేపీ నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికై ఆ పార్టీ ఫ్లోర్‌లీడర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2005లో జరిగిన ఎన్నికల్లో మరోసారి బీజేపీ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికవ్వడంతోపాటు బీజేపీ నగర అధ్యక్షుడిగా 2006 వరకు పనిచేశారు.

2006లో సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. కేసీఆర్‌ పిలుపును అందుకొని బీజేపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ పార్టీలో కేసీఆర్‌ సమక్షంలో చేరారు. టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ అధ్యక్షునిగా ఉంటూ టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఇచ్చే పిలుపునందుకొని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అన్ని వర్గాలను భాగస్వాములను చేస్తూ కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా మారారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం కరీంనగర్‌ నగరంలో ఉధృతంగా నడిపించడంతో కేసీఆర్‌కు నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నారు.

కరీంనగర్‌ నగరంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎదుగుదల కోసం తీవ్రంగా పనిచేయడంతో కేసీఆర్‌ అనేక సందర్భంలో రవీందర్‌ సింగ్‌ను ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ కుటుంబానికి విధేయుడిగా ఉన్న సర్దార్‌ రవీందర్‌ సింగ్‌కు ఎమ్మెల్సీ అవకాశం ఖాయమంటూ ఒక దశలో ప్రచారం జరిగింది. కానీ ఎమ్మెల్సీ అవకాశం అందినట్లే అంది అందకుండా పోయింది. 

రాష్ట్రస్థాయి పథకాలు అమలు..
టిఆర్‌ఎస్‌ పార్టీలో కీలక నేతగా, మేయర్‌గా పనిచేసిన కాలంలో సర్దార్‌ రవీందర్‌ సింగ్‌ కరీంనగర్‌ నగరంలో ఒక్క రూపాయి మేయర్‌గా ప్రసిద్ధి పొందారు. ఒక్క రూపాయికే నల్లా కలెక్షన్‌ ఇవ్వడం, ఒక్క రూపాయికే అంత్యక్రియలు చేయడం, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ నుంచి ప్రశంసలు అందుకున్నారు. మేయర్‌గా ఉంటూనే కరీంనగర్‌ నగరంలో అనేక ప్రభుత్వ, ప్రైవేట్, ప్రైవేట్‌ టీచర్, క్రీడా, కార్మిక సంఘాలకు, సంఘటిత, అసంఘటిత కార్మిక సంఘాలకు గౌరవ అధ్యక్షుడిగా  కొనసాగుతూ మాస్‌ లీడర్‌గా, మేయర్‌గా మన్ననలు పొందారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top