
సాక్షి,హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఈటల రాజేందర్‌కు మంగళవారం (మే 20) నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల్లో జూన్ 5న కేసీఆర్, 6న హరీశ్ రావు, 9వ తేదీన ఈటల రాజేందర్ విచారణకు రావాలని ఆదేశించింది. తాము పంపించిన నోటీసులకు 15 రోజుల్లో రిప్లై ఇవ్వాలని సూచించింది.
కాగా, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బీఆర్‌ఎస్ హయాంలో హరీష్‌రావు నిటి పారుదల వ్యవసాయ శాఖ మంత్రిగా, ఈటల రాజేందర్ ఆర్ధిక శాఖ మంత్రిగా పని చేశారు.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ గడువు పొడిగింపు
కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (Kaleshwaram commission) విచారణ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. మరో రెండు నెలలపాటు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్,హరీష్‌రావు,ఈటల రాజేందర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపించింది.
