Kadem Project: వరద విరుచుకుపడినా నిలబడిన కడెం.. చరిత్రలో తొలిసారి భీకర దృశ్యాలు

Kadem Project Creates Record Heavy Floods Flow Escapes From Major Threat - Sakshi

ప్రాజెక్టుకు తొలిసారి ‘ఆరున్నర లక్షల’ఇన్‌ఫ్లో 

ప్రాజెక్టు పైనుంచి పారిన వరద అయినా తట్టుకున్న ఆనకట్ట 

కొట్టుకుపోయిన రెండు గేట్ల కౌంటర్‌ వెయిట్లు 

చెత్తాచెదారంతో నిండిపోయిన గేట్ల గదులు, ప్రాజెక్టు పైభాగం  

నిర్మల్‌/కడెం: సముద్రం నుంచి సునామీ దూసుకువస్తోందా అన్నట్టు కడెం ప్రాజెక్టుపై వరద పోటెత్తింది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రాజెక్టు పైనుంచి వరద ప్రవహించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి 5 లక్షల క్యూసెక్కులు వస్తుంటేనే కడెం గుండె దడదడలాడింది. అధికారులు, సమీప గ్రామాల ప్రజలు వణికిపోయారు. అలాంటిది బుధవారం రాత్రి 2 గంటల తర్వాత ఏకంగా 6.5 లక్షల క్యూసెక్కుల వరద దూసుకొచ్చింది. ఎత్తిన 17 గేట్లతో పాటు (ఒక గేటు పనిచేయడం లేదు) ఎడమకాలువకు పడ్డ గండి నుంచి 3.5 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళ్తుండగా అంతకు దాదాపు రెట్టింపు స్థాయిలో వచ్చిన వరద ప్రాజెక్టుపై నుంచి పొంగింది.

అలా దాదాపు మూడునాలుగు గంటల పాటు కొనసాగింది. ఇక ప్రాజెక్టు కొట్టుకుపోవడం ఖాయమని భావించిన సిబ్బంది వదిలేసి వచ్చేశారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ, అంతటి తాకిడినీ తట్టుకుని ఆనకట్ట చెక్కుచెదరకుండా నిలబడింది. రెండు గేట్ల కౌంటర్‌ వెయిట్‌ దిమ్మెలు మాత్రం కొట్టుకుపోయాయి. గేట్ల గదులు, ప్రాజెక్టు పైభాగం మొత్తం వరద తాకిడితో వచ్చిన చెట్లు, చెట్లకొమ్మలు, చెత్తా చెదారంతో నిండిపోయాయి. ఈ కారణంగా గేట్లను దించడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడటంతో ప్రాజెక్టు ఖాళీ అవుతోంది. 

ఎన్నడూ చూడని వరద ఉధృతి
కడెం ప్రాజెక్టుకు తొలిసారి ఈస్థాయి ఇన్‌ఫ్లో వచ్చింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి వరదను చూడలేదని అధికారులు, స్థానికులు పేర్కొన్నారు. 1958లో ఒకసారి 5.10 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. (అప్పట్లో 9 గేట్లే ఉండేవి) దిగువన మొత్తం నీటమునిగింది. భారీ వరదకు డ్యామ్‌ ఒకవైపు కోతకు గురయ్యింది. ఆ ప్రమాదం తర్వాత మరో తొమ్మిది గేట్లను నిర్మించి, ప్రాజెక్టు ఎత్తును కూడా పెంచారు. అయితే 1995లో 4 లక్షల క్యూసెక్కుల వరద రాగా డ్యామ్‌ ఎడమ కాలువ వద్దనే గండిపడింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఏకంగా 6.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి ప్రాజెక్టుపై నుంచి పారింది. ఈసారి కూడా ఎడమవైపు గండిపడటం వల్లే కట్ట ఆగిందని చెబుతున్నారు. 

ప్రాజెక్టు ఎడమకాలువ వద్ద గండి పడటంతో కోతకు గురైన ప్రాంతం 

ప్రాజెక్టు నిలిచింది..నష్టం మిగిల్చింది 
కడెం ప్రాజెక్టు పైభాగమంతా అటవీ ప్రాంతమే ఉంటుంది. భారీ వర్షాలు కురిసినప్పుడు అధికారులు అంచనా వేసే లోపే ఎగువన ఉన్న వాగులన్నీ పొంగి ప్రాజెక్టులోకి వరద వేగంగా వచ్చేస్తుంది. ఈవిధంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి గురువారం వేకువ జాము వరకు పోటెత్తిన వరదతో కడెం ప్రాజెక్టు చాలావరకు దెబ్బతింది. భారీ నష్టాన్ని మిగిల్చింది. ప్రాజెక్టు ఒకటి, రెండు గేట్ల కౌంటర్‌ వెయిట్‌లు కొట్టుకుపోయాయి. వరద గేట్లను ఎత్తి దించేందుకు ఈ దిమ్మెలు ఉపయోగపడతాయి. 2018లో కూడా రెండో నంబర్‌ గేటు కౌంటర్‌ వెయిట్‌ కొట్టుకుపోయింది. ఇక వరద గేట్లలో మొత్తం చెత్త పేరుకుపోవడం, ఎలక్ట్రికల్‌ కనెక్షన్లు దెబ్బతినడంతో వాటిని సరిచేయడం ఇప్పట్లో కుదరని పని అని అంటున్నారు. ఎడమ కాలువకు గండిపడ్డ ప్రాంతంలో వందమీటర్ల మేర కాలువ కోతకు గురైంది. వరద ఉధృతికి ప్రాజెక్టు దిగువన సైడ్‌వాల్స్‌ మొత్తం దెబ్బతిన్నాయి.  

కొనసాగుతున్న అవుట్‌ ఫ్లో 
ప్రస్తుతం 17 గేట్ల ద్వారా దిగువకు అవుట్‌ఫ్లో కొనసాగుతూనే ఉంది. గురువారం రాత్రి 9 గంటలకు మొత్తం 700 అడుగులకు గానూ 684.725 అడుగుల నీటిమట్టం, మొత్తం 7.603 టీఎంసీలకు గానూ 4.259 టీఎంసీల నీటినిల్వ ఉంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 1,25,582 క్యూసెక్కులు ఉండగా అదేస్థాయిలో వరద దిగువకు వెళుతోంది.

పెను ప్రమాదం తప్పింది: మంత్రి 
కడెం ప్రాజెక్టుకు పెనుప్రమాదం తప్పిందని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. గురువారం సాయంత్రం అధికారులతో కలిసి ఆయన కడెం ప్రాజెక్టును సందర్శించారు. పరిస్థితిని పరిశీలించారు. కడెం వాగుకు పూజలు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top