పరారీలో బిగ్‌బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్‌! | Jubilee Hills Police Search To Bigg Boss 7 Telugu Winner Pallavi Prashanth, Deets Inside - Sakshi
Sakshi News home page

Pallavi Prashanth Police Case: పరారీలో బిగ్‌బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్‌!

Published Wed, Dec 20 2023 7:49 AM

Jubilee Hills Police SearchTo Pallavi Prashant - Sakshi

హైదరాబాద్: పబ్లిక్‌ న్యూసెన్స్‌కు కారకుడైన బిగ్‌బాస్‌ సీజన్‌–7 విజేత గొడుగు పల్లవి ప్రశాంత్‌ కోసం జూబ్లీహిల్స్‌ పోలీసులు గాలింపు చేపట్టారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉండగా ఫోన్‌ కూడా స్విచ్చాఫ్‌లో ఉండటంతో అతడి అనుచరులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గజ్వేల్‌ సమీపంలోని కొలుగూరు గ్రామానికి చెందిన పల్లవి ప్రశాంత్‌ ఆదివారం రాత్రి జరిగిన బిగ్‌బాస్‌–7 విజేతగా ఎంపిక కాగా,  అమర్‌దీప్‌ రన్నరప్‌గా నిలిచారు.

ఈ నేపథ్యంలో ఇద్దరి అభిమానులు పెద్ద సంఖ్యలో జూబ్లీహిల్స్‌రోడ్‌ నె.ం 5లోని అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకుని నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమర్‌దీప్‌ను విజేతగా ప్రకటించ కపోవడంతో ఆయన అభిమానులు గొడవకు దిగారు. మరోవైపు పల్లవి ప్రశాంత్‌ అభిమానులు వేలాదిగా అక్కడికి చేరుకుని నినాదాలు చేస్తూ అమర్‌దీప్‌ కారును ధ్వంసం చేశారు.

ఈ సందర్భంగా ఇరువర్గాలు పరస్పర దాడులకు దిగడమేగాక అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. బయట గొడవ జరుగుతున్నట్లు గుర్తించిన బిగ్‌బాస్‌ యాజమాన్యం పల్లవి ప్రశాంత్‌ను స్థానిక పోలీసుల సహకారంతో రహస్య మార్గం నుంచి బయటికి పంపించింది. మళ్లీ ఇటు వైపు రావొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయితే పల్లవి ప్రశాంత్‌ ఇటు పోలీసుల ఆదేశాలను, అటు బిగ్‌బాస్‌ యాజమాన్యం సూచనలను బేఖాతర్‌ చేస్తూ గొడవ జరుగుతున్న ప్రాంతానికి ఓపెన్‌ టాప్‌ జీప్‌పై చేరుకోవడంతో రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

ఇరు వర్గాల మద్దతుదారులు రాళ్లు రువ్వుతూ మహిళా కంటెస్టెంట్లపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. ఇందుకు కారకుడైన పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్‌ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం ఈ విషయం తెలుసుకున్న పల్లవి ప్రశాంత్‌ ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి పోలీసులకు దొరక్కుండా పరారయ్యాడు. దీంతో అతడి సోదరుడు పరుశరాములు కోసం పోలీసులు ఒక బృందాన్ని స్వగ్రామానికి పంపించారు. కారు డ్రైవర్‌ సాయి కిరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పల్లవి ప్రశాంత్‌ కోసం ప్రత్యేకంగా మూడు బృందాలు ఏర్పాటు చేశారు.

ఆయన అనుచరుల ఫోన్‌ డేటాను సేకరించారు. కొమరవెల్లి సమీపంలోని ఓ గ్రామంలో పల్లవి ప్రశాంత్‌ ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు అక్కడికి కూడా ఓ బృందాన్ని పంపించనున్నారు. ఇదిలా ఉండగా బస్సులపై రాళ్లు రువి్వన వ్యక్తులను గుర్తించేందుకు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇందుకోసం 15 మంది పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలను వడపోస్తున్నారు. 

Advertisement
 
Advertisement