పాలమ్మిన పైసలతోనే ఐఏఎస్‌ వరకు..

Jawahar Nagar Commissioner Gopi Inspirational Special Interview - Sakshi

వెటర్నరీ డాక్టర్‌ నుంచి ప్రారంభమైన ప్రస్థానం 

చిన్న పల్లెటూరు.. వ్యవసాయ కుటుంబం 

నిత్యం పాలమ్మితే వచ్చిన డబ్బులతోనే చదువు 

జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా బాధ్యతలు  

యువ ఐఏఎస్‌ డాక్టర్‌ బి.గోపి మనోగతం ఇదీ..

జవహర్‌నగర్‌/మేడ్చల్‌: నేను పక్కా పల్లెటూరి వాడిని.. పల్లె జనాల్లో గెలవాలనే తపన ఎక్కువగా ఉంటుంది. ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో ఉన్న వారంతా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినవారే.. యువత కలలు కనడమే కాదు.. వాటిని సాకారం చేసుకునేందుకు శ్రమపడాలి. అప్పుడే విజయం పరుగెత్తుతూ వస్తుంది. ఉన్నత ఉద్యోగాలు సంపాదించేందుకు కోచింగ్‌లు అక్కర్లేదు. పట్టుదల ఉంటే చాలు. అయితే కొన్నిసార్లు విజయం అందకపోవచ్చు. అంతమాత్రాన నిరాశ చెందాల్సిన అవసరం లేదు. నిరాశలోంచి కసి పుట్టాలి. అప్పుడే విజయం చేతికి చిక్కుతుందటారు జవహర్‌నగర్‌ కమిషనర్‌ (ఐఏఎస్‌) డాక్టర్‌ బి.గోపి.  

వెటర్నరీ డాక్టర్‌గా ప్రస్థానం
నేను పుట్టి పెరిగింది తమిళనాడులోని తిరువాలూర్‌ జిల్లా పొద్దాటూర్‌ పేటాయి గ్రామం. మాది ఓ చిన్న పల్లెటూరు. మా ఊర్లో పెద్దగా చదువుకున్న వారు ఎవరూలేరు. మాది పూర్తిగా వ్యవసాయ కుటుంబం. పశువులు, పాలతో వచ్చిన ఆదాయంతోనే కుటుంబం గడిచింది. అమ్మానాన్నలకు చదువు రాదు. మేము ఐదుగురము. ఒక అన్న, ముగ్గురు అక్కలు. 12వ తరగతి వరకు మా ఊర్లోని పంచాయతీ యూనియన్‌  పాఠశాలలో చదివా. తర్వాత ఉన్నత చదువుల కోసం మద్రాస్‌కు వెళ్లి పీజీ పూర్తి చేశాను. తమిళనాడులో 6 సంవత్సరాల పాటు వెటర్నరీ సర్జన్‌గా పనిచేశా. ఆ సమయంలోనే పెళ్లయ్యింది. మా శ్రీమతి డాక్టర్‌. నాకు ఒక కుమారుడు, ఒక కుమార్తె.  

ఆదిలాబాద్‌లో తొలిపాఠాలు..
ఆదిలాబాద్‌లో జిల్లాలో ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ జరిగింది. అక్కడే తొలిపాఠాలు నేర్చుకున్నాను. కిందిస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారి వరకు నిర్వర్తించే విధులపై అవగాహన కల్పించారు. ఆ తర్వాత సబ్‌కలెక్టర్‌గా ఏడాది పాటు పనిచేశాను. 2020లో నిజాంపేట్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్నాను. తాజాగా జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌కు సైతం అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.  

గ్రామీణుల్లో క్రియేటివిటీ ఎక్కువ..
గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో క్రియేటివిటీ ఎక్కువ. పట్టణవాసులతో పోలిస్తే గెలవాలన్న తపన పల్లె జనాల్లోనే అధికం. ప్రస్తుతం ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారిని పరిశీలిస్తే సగానికిపైగా గ్రామీణ నేపథ్యం ఉన్నవారే.. మొదట పల్లెటూరి వాళ్లమనే భావన దూరం చేసుకుంటే గమ్యం చేరుకోవడం సులభం. క్రమశిక్షణ, పట్టుదల, ప్రణాళిక ఈ మూడే విజయానికి సోపానాలు.

జవహర్‌నగర్‌ సమస్య ప్రత్యేకం.
నిజాంపేట్‌కు, జవహర్‌నగర్‌కు చాలా తేడా ఉంది. ఇక్కడ చాలా మంది నిరుపేదలున్నారు. వారందరికీ ప్రభుత్వం తరఫున సహకారం అందించాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్‌కు తగ్గట్టుగా ఇక్కడ పరిస్థితులు లేవు. జీవో 58, 59 అమలు పరిచి ఇక్కడి పరిస్థితులను మార్చాల్సి ఉంది. చాలామంది అయాయక ప్రజలను మోసం చేసి ప్రభుత్వ స్థలాలను విక్రయిస్తున్నారు. ఇకపై అలా జరగకుండా చూడాల్సి ఉంది. ఇప్పుడే ఇక్కడి ప్రజల స్థితిగతులను తెలుసుకుంటున్నాను. అసిస్‌మెంట్‌ ద్వారా క్రెడిట్‌ రేట్‌ను పెంచి జవహర్‌నగర్‌ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలి. దీనికి ప్రజలు, పాలకమండలి సహకరించాలి.

స్నేహితులే  స్ఫూర్తి..
వెటర్నరీ సర్జన్‌గా పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తున్న తీరు చూసిన స్నేహితులు ఐఏఎస్‌ అయితే మరింత సేవ చేసే అవకాశం లభిస్తుందని స్నేహితులు ప్రోత్సహించారు. వారు యూపీఎస్‌సీ రాసి విజయం సాధించడంతో నన్ను తరచూ గైడ్‌ చేస్తుండేవారు. ఏనాడూ కోచింగ్‌ సెంటర్‌కు వెళ్లలేదు. అవసరమైన మెటీరియల్‌ను సేకరించి చదువుకునేవాడిని. రెండుసార్లు సివిల్స్‌ రాశా. ఇంటర్వూ్య వరకు వెళ్లినా ఉద్యోగం రాలేదు. 2016లో మూడోసారి ర్యాంకు ఆధారంగా అవకాశం వచ్చింది. 

చదవండి: ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్న ‘మిలాప్‌’

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top