
తప్పు చేయడానికి ‘నో’ అన్న యువ ఐఏఎస్
ప్రజారోగ్య శాఖలో కీలక కాంట్రాక్టు అగ్రిమెంట్‌పై సంతకానికి నిరాకరణ
రూ. 3 వేల కోట్ల విలువైన కాంట్రాక్ట్‌ను అడ్డగోలుగా అప్పగించడానికి ససేమిరా
దీంతో కింది స్థాయి అధికారితో సంతకం చేయించి సర్కారు అగ్రిమెంట్
ఓ కొత్త పథకం రూపంలో ప్రజాధనానికి గండి కొట్టేందుకు పెదబాబు, చినబాబు పన్నాగం
ఎలాగైనా బయట పడాలని సాధారణ ఫైళ్లూ చూడటం మానేసిన ఐఏఎస్ అధికారి
ఇలాగైతే తామనుకున్న పనులు జరగవని ఇటీవల జీఏడీకి అటాచ్ చేసిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి: తస్మదీయులను తన్ని తరిమేయడం. అస్మదీయులు, బంధువర్గాలకు అడ్డగోలుగా కాంట్రాక్ట్‌లు కట్టబెట్టడం తద్వారా ప్రజాధానాన్ని దోచుకోవడానికి తెగబడుతున్న పెదబాబు, చినబాబుల తీరుపై ఐఏఎస్‌లలోనూ వ్యతిరేకత మొదలైంది. జీ హుజూర్ అనే అధికారులకే పోస్టింగ్, కాదన్న వారికి ఊస్టింగ్ అన్నట్టుగా పరిస్థితులను మార్చేసిన సర్కారుపై ధిక్కారస్వరం వినిపిస్తున్నారు.
ఇప్పటికే పలువురు ఐపీఎస్‌లు రాష్ట్రానికి బై చెప్పి కేంద్ర సర్వీస్‌లకు వెళ్లగా, యువ ఐపీఎస్ సర్వీస్‌కే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఐఏఎస్ అధికారులూ అదేబాటలో పయనిస్తున్నారు. ప్రభుత్వ అడ్డగోలు విధానాలతో అంటకాగితే భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన ఓ యువ ఐఏఎస్ ఏకంగా సహాయ నిరాకరణ చేయడంతో ఆయన్ను ఏ పోస్టింగ్ లేకుండా ఇటీవల జీఏడీకి అటాచ్ చేసి ప్రభుత్వ పెద్దలు కక్ష సాధించారు.
అడ్డగోలు టెండర్ విధానంపై అసహనం
గత జనవరిలో ప్రజారోగ్య శాఖలోని ఓ విభాగానికి యువ ఐఏఎస్‌ను అధిపతిగా నియమించారు. ఇతను గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖతోపాటు, ఓ జిల్లాకు కలెక్టర్‌గా విజయవంతంగా పనిచేశారు. ఈయన ప్రజారోగ్య శాఖలో బాధ్యతలు స్వీకరించే నాటికే రూ.మూడు వేల కోట్ల విలువ చేసే అత్యవసర సేవల కాంట్రాక్ట్‌ను అస్మదీయుడికి కట్టబెట్టి నిధులు కొల్లగొట్టడానికి పెదబాబు, చినబాబు రంగం సిద్ధం చేశారు.
అడ్డగోలుగా రూపొందించిన టెండర్ మార్గదర్శకాలపై ప్రారంభంలోనే ఆ యువ ఐఏఎస్ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం టెండర్ ప్రక్రియలో నిర్వహించిన సమావేశాల్లోనూ అంటిముట్టనట్టుగానే ఉన్నారు. అయితే ముందే పక్కా ప్రణాళికతో మార్గదర్శకాలు రూపొందించడంతో తామనుకుంటున్న సంస్థకే ప్రభుత్వం దిగి్వజయంగా కాంట్రాక్ట్ కట్టబెట్టింది.
సంతకం పెట్టేందుకు ససేమిరా
ఐదేళ్లకు రూ.3 వేల కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్ ఇది. చేసిన పనికి బిల్లులు ప్రాసెస్ చేయడం, ఫైన్‌లు వేయడం సహా మొత్తం కాంట్రాక్ట్ పర్యవేక్షణ బాధ్యతలన్నీ ఆ యువ ఐఏఎస్ విభాగం కిందకే వస్తాయి. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం టెండర్ ప్రక్రియ ముగిశాక ఎంపిక చేసిన కాంట్రాక్ట్ సంస్థతో చేసుకునే అగ్రిమెంట్‌పై విభాగాధిపతే సంతకం చేయాలి. గతంలో విభాగాధిపతులుగా పనిచేసిన ఐఏఎస్‌లే అగ్రిమెంట్‌పై సంతకాలు చేస్తూ వచ్చారు. ప్రస్తుతం యువ ఐఏఎస్ అధికారి అగ్రిమెంట్‌పై సంతకం చేయడానికి ససేమిరా అనేశారు. పైనుంచి వచి్చన ఒత్తిడికి తలొగ్గలేదు. దీంతో కింది స్థాయి అధికారితో సంతకం చేయించి ప్రభుత్వం అగ్రిమెంట్ తంతు ముగించింది.
ఒక్క ఫైల్ కూడా ముందుకు కదలని స్థితిలో..
వాస్తవానికి సదరు ఐఏఎస్ బాధ్యతలు స్వీకరించే నాటికే ఈ విభాగంలో మంత్రుల సిఫార్సులతో తిష్ట వేసిన అధికారులు పెద్ద ఎత్తున అవినీతి దందా చేశారు. ప్రక్షాళనలో భాగంగా అవినీతి అధికారులను బయటకు పంపడానికి వీల్లేని పరిస్థితులు ఉండటంతో అయిష్టంగానే ఆ స్థానంలో కొనసాగుతూ వచ్చారు. ఇదిలా ఉండగా పేద ప్రజల ఆరోగ్య భద్రతకు గండి కొడుతూ మరో కొత్త పథకాన్ని ప్రభుత్వం తేవాలని నిర్ణయించింది. ఈ పథకంలో భాగంగా రూ. వేల కోట్ల ప్రజా ధనాన్ని ప్రైవేట్ కంపెనీలకు మళ్లించి తమ జేబులు నింపుకోవాలని పెద్దలు వ్యూహ రచన చేశారని ఆరోపణలు ఉన్నాయి.
గతేడాది నుంచే పథకాన్ని రూపొందించడంపై ప్రజారోగ్య శాఖలో కసరత్తు నడుస్తోంది. కాగా, గడిచిన రెండు నెలల్లో మార్గదర్శకాలు ఖరారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లడం, ఆమోదం లభిస్తే టెండర్ పిలిచే దశకు పురోగతి చేరుకుంది. దీంతో ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలనే ఉద్దేశంలో ఉన్న ఆ అధికారి సాధారణ పరిపాలన అంశాలను పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. ఒక్క ఫైల్ ముందుకు కదలడం లేదని, ఈ పరిస్థితులను చక్కబెట్టడ్డానికి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శే విభాగం ప్రధాన కార్యాలయానికి చేరుకుని గత నెలాఖరులో సమీక్ష నిర్వహించారు.
పనులు ముందుకు సాగడం లేదని యువ ఐఏఎస్‌ను మందలించారు. అనంతరం కొద్ది రోజులకే యువ ఐఏఎస్ వ్యక్తిగత సెలవు పెట్టారు. సెలవు ముగిశాక యథా స్థానంలో చేరాలని తొలుత సీఎస్ ఉత్తర్వులు కూడా ఇచ్చారు. అయితే ఈ అధికారి అక్కడే కొనసాగితే తామనుకుంటున్న పనులు ముందుకు సాగవని భావించిన ప్రభుత్వ పెద్దలు మరుసటి రోజే జీఏడీకి అటాచ్ చేయిస్తూ ఆదేశాలు ఇప్పించారు.