
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటలో ఘటన
దారికాచి మారణాయుధాలతో దాడి
గ్రామానికి చెందిన టీడీపీ నాయకులే కారణం
ప్రత్యక్ష సాక్షులు, కుటుంబ సభ్యుల వెల్లడి
ఈ గ్రామంలో ఇది రెండో రాజకీయ హత్య
పోలీసుల తీరుపై నిరసన.. హైవే దిగ్బంధం
కేసును తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపణ
సంఘటనా స్థలి నుంచి వెళ్లిపోయిన ఎస్‌ఐ
శ్రీకాకుళం క్రైమ్, ఎచ్చెర్ల: రోడ్డు పనులు పరిశీలించి వస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. మూకుమ్మడిగా దాడిచేసిన అధికార టీడీపీ కార్యకర్తలు.. ఆయనను అంతమొందించారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు.. ఫరీదుపేటకు చెందిన సత్తారు గోపి వైఎస్సార్‌సీపీ కార్యకర్త. ఊరి కూడలి ఎన్‌హెచ్–16 సమీపంలోని కొయిరాలమెట్ట వద్ద అప్రోచ్ రోడ్డు నిర్మాణంలో ఉంది. శుక్రవారం మధ్యాహ్నం చిన్నాన్న సత్తారు కోటేశ్వరరావుతో కలిసి గోపి ఆ రహదారి పనులను పరిశీలించి ఇంటికి భోజనానికి బైక్ (ఏపీ30పి6845)పై బయల్దేరారు.
ఇంతలో కొయిరాలమెట్ట వద్ద దారికాచిన ఎనిమిది మంది కర్రలతో దాడికి దిగారు. గోపి వారికి చిక్కగా... బైక్‌పై వెనుక కూర్చున్న కోటేశ్వరరావు పరిస్థితి గ్రహించి పారిపోయాడు. అప్పటికే కర్రలతో గోపి తలపై బాదిన దుండగులు ఆయనను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి హత్య చేశారు. ఈ దాడిలో మారణాయుధాలు కూడా వాడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గోపి ఎంపీపీ మొదలవలస చిరంజీవికి ప్రధాన అనుచరుడు. భర్త హత్య విషయం తెలిసి గోపి భార్య పుణ్యవతి కుప్పకూలారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు. గోపికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.
టీడీపీ వారే చంపారు...
ఫరీదుపేట గ్రామ టీడీపీ నాయకులే గోపి హత్యకు ఒడిగట్టారని ప్రత్యక్ష సాక్షులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులకు సైతం ఇదే విషయం తెలిపారు. రాజకీయంగా కక్ష కట్టిన టీడీపీ నేతలు... కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామంలో రెండో హత్యకు పాల్పడ్డారు. ఏడాది కిందట వైఎస్సార్‌సీపీ కార్యకర్త కూన ప్రసాద్‌ను టీడీపీ మద్దతుదారులు హత్య చేశారు.
హత్యను తప్పుదారి పట్టించే కుట్ర..
హత్య విషయం తెలిసి పోలీసులు, గోపి కుటుంబసభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్రోచ్ రోడ్డు వద్ద ఒక కర్ర, వెనుక నిర్మానుష్య ప్రదేశంలో రక్తపు మడుగులో గోపి మృతదేహం పక్కన లావుపాటి కర్ర ఉండటం గమనార్హం. నిరుడు కూన ప్రసాద్‌నూ ఇదే తరహాలో టీడీపీ వర్గీయులు హతమార్చారు. ఆ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయకుండా వదిలేశారని.. వారివల్లే గోపి హత్య జరిగిందని వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు, కుటుంబసభ్యులు పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. దాదాపు అరగంట పాటు హైవేను దిగ్బంధించారు.

పూర్తిగా రాజకీయ కారణాలు ఉండగా.. భార్యాభర్తల తగాదా కేసులో భాగంగా అంటూ కేసు తీవ్రత తగ్గిస్తూ, టీడీపీవారిని తప్పించేలా పోలీసులు వ్యవహరించారని గోపి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. డీఎస్పీ వివేకానంద సైతం ఇలానే మాట్లాడుతున్నారని తెలిపారు. పరిస్థితి తీవ్రతను గమనించిన ఎచ్చెర్ల ఎస్‌ఐ వి.సందీప్ ఘటనా స్థలి నుంచి వెళ్లిపోయారు. డీఎస్పీ సీహెచ్ వివేకానంద, సీఐ అవతారం, సబ్ డివిజన్ పోలీసులంతా వచ్చినా ఆందోళనకారుల ఆగ్రహాన్ని చల్లార్చలేకపోయారు. దీంతో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి రావాల్సి వచ్చింది. గోపి హత్య నిందితులైన టీడీపీ నాయకులను తక్షణమే అరెస్టు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.
కిందకు లాగేసి.. దుర్భాషలాడుతూ..
తొమ్మిదిమంది టీడీపీ వాళ్లు వచ్చి బైక్‌పై వెళ్తున్న గోపిని, నన్ను లాగేశారు. తీవ్రంగా తిడుతూ నా ఫోన్‌ను తీసేసుకున్నారు. చంపేస్తారనే భయంతో పారిపోయా. గ్రామస్థులకు సమాచారం ఇవ్వడానికి వెళ్లా. మారణాయుధాలతో గోపిని చంపేశారు. – గోపి చిన్నాన్న కోటేశ్వరరావు