చంద్రబాబు కోసమే సునీత ఆరాటం
ఆధారాలతో సహా నిలదీసిన వైఎస్ అవినాష్‌రెడ్డి
వివేకా లేఖను బయట పెట్టకపోవడం నేరం కాదా?
హంతకుడు దస్తగిరి బెయిల్ రద్దుకు ఎందుకు పట్టుబట్టడం లేదు?
హత్య చేసిన వాడికి అండగా నిలబడతారా?
ఎందుకని చంద్రబాబుకు, దస్తగిరికి, సునీతకు లూథ్రా ఒక్కడే న్యాయవాది?
ఈ కేసు ‘మర్డర్ ఫర్ గెయిన్’ కాదా?
వివేకా రెండో భార్య కొడుక్కి డీఎన్‌ఏ టెస్ట్ చేయించే ధైర్యముందా?
వివేకాకు రెండో భార్యకు మధ్య చాట్స్‌ను బైటపెట్టగలరా?
ఘటన ముందు రోజు కుటుంబ సభ్యులే పండంటి రాజశేఖర్‌ను కాణిపాకం ఎందుకు పంపించారు?
దస్తగిరి స్టేట్‌మెంట్‌లో చెప్పినట్టు కీలక డాక్యుమెంట్లపై విచారణను ఎందుకు కోరరు?.. తప్పుడు స్టేట్‌మెంట్‌ల
కోసం ఒత్తిడి తేవడం నిజం కాదా?
విచారణ జాప్యం కోసమే సునీత కోర్టులో పిటిషన్లు.. తద్వారా బాబు రాజకీయ లబ్దికి సహకారం
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలను పక్కదోవ పట్టించి, చంద్రబాబుకు రాజకీయ లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా విచారణ సాగుతోందని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్.అవినాష్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ కేసులో సునీత అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని, సీబీఐ విచారణలో ఉన్న లొసుగులను ఆధారాలతో సహా ఎండగట్టారు. ‘హత్య చేశానని ఒప్పుకున్న దస్తగిరికి సునీత మద్దతుగా నిలబడటం వెనుక మర్మమేంటని ప్రశ్నించారు. దస్తగిరి బెయిల్ రద్దు చేయాలని మేము కోర్టును కోరితే, ఆమె మాత్రం లూథ్రా వంటి ఖరీదైన న్యాయవాదులను పెట్టి అతడికి అండగా ఎలా నిలబడతారని నిలదీశారు.
హత్య జరిగిన వెంటనే వివేకానంద రాసిన లేఖ గురించి పీఏ కృష్ణారెడ్డి ద్వారా సమాచారం అందినప్పటికీ, పోలీసులు వచ్చే వరకు ఆ లేఖను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. సీబీఐ ముందు సునీత ఒకసారి లేఖ గురించి తెలుసునని, మరోసారి తెలియదని పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారని... ఇలా స్టేట్‌మెంట్లు మార్చడం వెనుక ఉద్దేశం ఏంటి? లేఖను దాచిపెట్టడం నేరం కాదా? అందులో ఉన్న నిజాన్ని ఎందుకు తొక్కిపెట్టారో సమాధానం చెప్పాలన్నారు.
మరోవైపు వివేకానందరెడ్డి గారి రెండో భార్య షమీమ్, ఆమె కుమారుడికి ఆస్తిలో వాటా వెళ్తుందనే భయంతో ఈ హత్య జరిగి ఉండవచ్చన్న అవినాష్ రెడ్డి... ఇది ‘మర్డర్ ఫర్ గెయిన్’ (ఆస్తి కోసం జరిగిన హత్య) కోణం కాదా? ఈ విషయాలపై దర్యాప్తు చేయాలని సునీత ఎందుకు కోరడం లేదని నిలదీశారు. షమీమ్ కుమారుడికి డీఎన్‌ఏ టెస్ట్ చేయించే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. అలాగే వివేకాకు, షమీమ్‌కు మధ్య నడిచిన చాట్స్‌ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ఈ కేసును వచ్చే ఎన్నికల వరకు లాగడం ద్వారా చంద్రబాబుకు పొలిటికల్ మైలేజ్ ఇవ్వడమే సునీత లక్ష్యంగా కనిపిస్తోందని స్పష్టం చేశారు.. ఢిల్లీలో ఉన్న కొందరు పెద్ద మనుషుల అండతో, టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని మండిపడ్డారు. అయితే న్యాయం గెలిచే రోజు వస్తుందని... మమ్మల్ని అనవసరంగా నిందించిన వారంతా ముక్కున వేలేసుకునే రోజు దగ్గర్లోనే ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరగా విచారణ పూర్తి చేసి నిజాలను ప్రజల ముందు ఉంచాలి అని అవినాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
వివేకానంద రెడ్డి గారి హత్య అనంతరం నిందితులు విచారణలో అనేక విషయాలు చెప్పారు. వివిధ లావాదేవీల్లో వైఎస్ వివేకానందరెడ్డికి డబ్బులు, డైమండ్స్ రూపంలోనూ, ల్యాండ్ సెటిల్మెంట్ రూపంలో రావాల్సి ఉంది. దాని కోసం వివేకానందరెడ్డి గారు కొంత మొత్తంలో డబ్బులు ఖర్చుపెట్టారు. ఆ ఖర్చు పెట్టిన డబ్బు పోయిందీ, రావాల్సిన డబ్బు రాకుండా పోయిందన్న బాధ ఆయనకు ఉంది. అందుకే అందరి మీద కోప్పడేవారని ఉంది. దాని మీద ఎందుకు తదుపరి దర్యాప్తు సునీత కోరడం లేదు?.
మరోవైపు తొలిసారి 161 స్టేట్‌మెంట్‌లో దస్తగిరి... వివేకానందరెడ్డి గారిని చంపక ముందు డాక్యుమెంట్లు గురించి అడిగామని చెప్పారు. ఆ డాక్యుమెంట్లు ఎక్కడున్నాయో కనుక్కోవడానికి ఆయన్ను తీవ్రంగా కొట్టామని చెప్పారు. ఆ డాక్యుమెంట్లు ఎక్కడున్నాయో కనుక్కున్న తర్వాత అవి తాము అనుకున్నవో కావో తేల్చుకున్న తర్వాతే చంపామని చెప్పాడు. హత్య అనంతరం రెండు మూడు సార్లు డాక్యుమెంట్లు వెరిఫై చేసుకున్న తర్వాతే బయటకు వెళ్లామని కూడా చెప్పాడు.
దస్తగిరి బెయిల్ ఎందుకు అడ్డుకోలేదు?
మీకు అత్యంత ఆప్తుడైన దస్తగిరి ఇంత స్పష్టంగా చెప్పాడు. ఆయన బెయిల్ రద్దు చేయమని మేమే కోర్టులో వేసినా.. మీరు మాత్రం ఆయనకు మద్దతుగా నిలబడతారు. ఏకంగా లూథ్రా లాంటి న్యాయవాదిని దస్తగిరి తరపున నియమించి మాపై పోరాడతారు. చంద్రబాబుకు, వివేకాను హత్య చేసిన దస్తగిరికి, మీకు న్యాయవాదిగా లూథ్రాయే ఉండడంలోని ఆంతర్యమేమిటి? దస్తగిరికి యాంటిసిపేటరీ బెయిలిచ్చినా మీరు అడ్డుకోలేదు.
ప్రతి అంశానికి అడ్డుపడే మీరు తానే మీ నాన్నగారిని చంపానని దస్తగిరి చెప్పినా ... అతను దర్జాగా బయట తిరుగుతున్నా కనీసం బెయిల్‌ను అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఆయన్ను శిక్షించాలని మీరు ఎందుకు కోరరు? అంత కీలకమైన డాక్యుమెంట్లు ఏవని అడగాల్సిన బాధ్యత మీకు లేదా? ఇదే విషయాన్ని అడగడానికి మీకు ఎందుకు నోరు రావడం లేదు? కోర్టును, సీబీఐను అడగాల్సిన బాధ్యత మీకు లేదా?
హత్య అనంతరం లేఖ గురించి ఎందుకు చెప్పలేదు?
మీ తల్లి, భర్త అటెండర్‌కు సెలవు ఇచ్చి పంపిస్తే మీరు ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడ్డం లేదు? హత్య జరిగిన రోజు రాత్రి దోపిడీకి గురైన డాక్యుమెంట్ల గురించి కూడా మీరు నోరు మెదపడం లేదు.. సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తూ.... కీలకమైన విషయాలను ఇగ్నోర్ చేసే కార్యక్రమం మీరు ఇన్నాళ్లూ చేశారన్నది పచ్చి నిజం. ఈ కేసులో పీఏ కృష్ణారెడ్డి తొలుత మృతదేహాన్ని, లేఖను చూసిన తర్వాత తొలుత సునీత, ఆమె భర్త రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి బావమరిది, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి సొంత సోదరుడు శివప్రకాష్ రెడ్డికి ఆ లేఖ గురించి, చనిపోయిన విషయం కూడా చెప్పాడు.
ఆ లెటర్‌లో అంశాలు కూడా మీ అందరికీ చదివి వినిపించాడు. కానీ వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన తర్వాత అక్కడున్న లెటర్ గురించి ఎందుకు పోలీసులకు సమాచారం ఇవ్వలేదు?. వివేక అటెండర్ పండంటి రాజశేఖర్‌ను హత్యకు ముందు రోజు కుటుంబసభ్యులే కాణిపాకం ఎందుకు పంపించారు?
సునీత పరస్పర విరుద్ధ ప్రకటనలు...
పైగా ఎవరికీ లేని అవకాశం సీబీఐ సునీతకి ఇచ్చింది. 2020 జులై 28న ఆ లేఖ గురించి సునీతను సీబీఐ అడిగింది. ఈ లేఖ చాలా కీలకమైన ఆధారం, ఆ లేఖ గురించి తెలిస్తే ఇది హత్య అని తెలిసి ఉండేది, అంత ప్రాముఖ్యత ఉన్న లెటర్‌ను ఎందుకు దాచిపెట్టమన్నారని ప్రశ్నించింది. దానికి ఆమె లెటర్ ఉన్న విషయం పీఏ కృష్ణారెడ్డి తమకు వాట్సప్‌లో చెప్పాడని అంగీకరించింది. అదే టైంలో ఎందుకు బయట పెట్టలేదనడానికి ఊరంతా గొడవలు అవుతాయని చెప్పలేదంటూ పెద్ద థియరీ చెప్పారు.
మరలా నెల రోజులకు 27 ఆగస్టు 2020 నాడు సీబీఐ ముందుకు వచి్చ, నెల రోజుల క్రితం లెటర్ గురించి తాను చెప్పినదంతా తూచ్... నాకు ఆ లేఖ గురించి ఏం తెలియదు, నేను ఏ లెటరూ చూడలేదు, సాయంత్రం ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ గారి చేతిలో లేఖ చూడ్డం తప్ప నాకేమీ తెలియదు అని అబద్దం చెప్పింది. ముందు ఒక వాంగ్మూలం ఇచి్చన తర్వాత దాన్ని కవర్ చేయడానికి సీబీఐ మరో వాంగ్మూలం తీసుకోవడం ఎంత వరకు సమంజసం? మరో కీలమైన అంశం నా బెయిల్ గురించి హైకోర్టులో వాదనలు జరిగినప్పుడు... గతంలో సునీత మాట్లాడిన వీడియోను హైకోర్టు ముందు ఉంచాను.
వివేకానంద రెడ్డి గారు చనిపోయిన 12 రోజులకు అంటే మార్చి 27, 2019లో మాట్లాడుతూ... గడిచిన కొన్ని నెలలుగా అవినాష్‌ని ఎంపీ చేయడానికి, జగనన్నను సీఎం చేయడానికి మా నాన్న శ్రమిస్తున్నారు అని మాట్లాడిన వీడియోను హైకోర్టుకు సమర్పించాను. అనంతరం నాకు బెయిల్ వచ్చిన తర్వాత మరలా సీబీఐ అధికారులను సునీత పిలిచి... మరలా మే 31, 2023 అంటే మూడేళ్ల తర్వాత గతంలో మాట్లాడిన వీడియోను కవర్ చేసే విధంగా మరో స్టేట్‌మెంట్ ఇప్పించారు. అందులో భాగంగా గతంలో మీరు ఎందుకు అలా మాట్లాడారు అని సీబీఐ అడిగితే నాకు సజ్జల రామకృష్ణారెడ్డి అలా మాట్లాడమన్నారు అందుకే మాట్లాడానని చెప్పింది. విచారణలో లొసుగులను ఇవన్నీ తేటతెల్లం చేస్తున్నాయి.
మర్డర్ ఫర్ గెయిన్ కోణంలో ఎందుకు విచారించరు?
వివేకాకు, ఆయన రెండో భార్య షమీమ్‌కు మధ్య నడిచిన చాట్స్‌ను బయటపెట్టే ధైర్యం ఉందా? వివేకా రెండో భార్య కుమారుడికి డీఎన్‌ఏ టెస్ట్ చేయించే ధైర్యం మీకు ఉందా? ఈ కేసులో విచారణను పరిశీలిస్తే.. వివేకానందరెడ్డి ఆమె పేరిట ఆస్తులు ఇవ్వాలనుకున్నారని ఉంది. హైదరాబాద్‌లో ఒక ఇల్లు కొనివ్వాలనుకున్నాడని ఉంది. షమీమ్ కుమారుడిని హెచ్‌పీఎస్ స్కూలులో అడ్మిషన్ తీసుకుని చేర్చాలనుకున్నాడని ఉంది. వాళ్లను పూర్తిగా సెటిల్ చేయాలనుకున్నాడని ఉంది. ఒకవైపు వివేకాకు సౌభాగ్యమ్మ, సునీత, రాజశేఖర్ పూర్తిగా చెక్ పవర్ తీసేశారు. ఖర్చులకు కూడా డబ్బులేని పరిస్థితికి ఆయన్ను తీసుకొచ్చారు. చివరగా గత మూడేళ్లులో ఆయనతో మాట్లాడడంలేదని కూడా విచారణలో సునీతక్క మాటల్లో ఉంది.
ఆ కోణంలో ఎందుకు విచారించడం లేదు..? షమీమ్‌కు వివేకా ఎన్నో హామీలిచ్చారు. అవి నెరవేరకుండానే హత్యకావించబడ్డారు. ఎవరు చేసి ఉంటారు ఈ హత్య? ఈ హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? వివేకా ఆస్తులు షమీమ్‌కు, ఆమె కొడుకుకు పోతే నష్టపోయేదెవరు? ఆ నష్టం వాటిల్లకుండా వారే చేసి ఉండవచ్చు కదా? మర్డర్ ఫర్ గెయిన్ ఎందుకు కాకూడదు ఇది? ఆ దొంగిలించబడ్డ రౌండ్ సీల్ ఉన్న డాక్యుమెంట్స్ ఏమిటి? ఈ కోణంలో సీబీఐ ఎందుకు విచారణ చేయలేదు?
నిత్యం విచారణను అడ్డుకునే ప్రయత్నంలో సునీత...
ముఖ్యంగా రామ్ సింగ్ వీళ్ల చేతుల్లోకి వచి్చన తర్వాత సుధాసింగ్, దీపక్ గారిని విచారణ నుంచి తప్పించిన తర్వాత పూర్తిగా శిక్షణ ఇచ్చి ఇష్టమొచి్చనట్లు స్టేట్ మెంట్లు తీసుకున్నారన్నది పచ్చి నిజం. అదే విధంగా దస్తగిరి తన స్టేట్‌మెంట్‌లో వివేకానందరెడ్డి గారికి అనేక అక్రమ సంబంధాలున్నాయని చెప్పారు. ఆ కోణంలో కూడా విచారణ అడిగే ప్రయత్నం సునీత చేయదు. అది వ్యక్తిగత అంశం కాబట్టి నేను అటువైపు వెళ్లదల్చుకోలేదు.
నేను అనేకసార్లు సీబీఐ డైరెక్టర్‌కి వినతిపత్రం ద్వారా మొరపెట్టుకున్నా మా మొర ఆలకించలేదు. ఆ రోజుల్లో విచారణలో వాస్తవాలను వెలికి తీసే ప్రయత్నాలు జరగలేదు. ఏకపక్షంగా విచారణ జరిగింది. ఇప్పుడు కూడా ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి కోర్టుకు వెళ్లి, విచారణ అడ్డుకునేలా ప్రయత్నం చేస్తోంది. గడిచిన రెండు, మూడేళ్లుగా ఇదే పని చేస్తోంది.
వచ్చే ఎన్నికల వరకు హత్య కేసును లాగడమే లక్ష్యం...
ఎప్పుడు విచారణ జరిగినా.. దేవుడి ముందు, చట్టం ముందు మేం తప్పు చేయలేదన్న విషయాన్ని నిరూపించుకుంటామన్న ధైర్యం, నమ్మకం, విశ్వాసం మాకుంది. విచారణ జరిగేలా సహకరించమని సునీతని కోరుతున్నాం. కానీ వీరి ఆలోచన మాత్రం వచ్చే ఎన్నికల వరకు వివేకానంద రెడ్డి హత్య కేసును లాగడం ద్వారా చంద్రబాబుకి లబ్ధి చేకూర్చడమే వీరి లక్ష్యంగా కనిపిస్తోంది. విచారణ జరగకూడదన్నట్లు, దోషులెవరూ బయటకు రాకూడదన్నట్లు ఆమె వైఖరి ఉంది.
ఎవరైనా ఆధారాలుంటే విచారణ సందర్భంగా సమర్పిస్తారు.. కానీ సునీత అలా చేయకుండా ఈ కేసును ఇలాగే కొనసాగించాలని, చంద్రబాబు చేతిలో పావులా మారి ఆయనకు రాజకీయంగా ఉపయోగపడాలన్న ఆరాటం తప్ప.. న్యాయం కోసం పోరాటం అన్నది ఎక్కడా లేదు. కాబట్టి చంద్రబాబుకు రాజకీయ లబ్ధి చేకూర్చాలన్న ఆలోచనలను పక్కన పెట్టాలని కోరుతున్నాను.
తప్పుడు స్టేట్‌మెంట్లు ఇప్పిస్తూ...
ఏపీకి సంబంధించిన పెద్ద మనిషి, ఢిల్లీలో కీలకమైన పోస్టులో ఉండడం, ఆయన ఆశీస్సులతో అప్పటి సీబీఐ డైరెక్టర్ నియామకం జరగడం, ఆయనను సునీత అనేకసార్లు కలవడం, చంద్రబాబు నాయుడు, సునీత కలిసి ఒక టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ దిశగా కేసును తీసుకెళ్లారు. వారికి నచి్చన వారిని తీసుకెళ్లి సీబీఐ విచారణ చేసింది. గతంలో ఎన్నికల ముందు 2024 ఏప్రిల్‌లో నేను చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పాను. నన్ను సీబీఐ 12 సార్లు విచారణకు పిలిచింది.
నేను మూడోసారి సీబీఐ విచారణకు వెళ్లినప్పుడు హత్య జరిగిన రోజు మేము గమనించిన విషయాలు చెప్పాను. నేను సీఐ గారికి సమాచారం ఇచ్చాను. స్థానికులు వివేకానందరెడ్డి గారిని చూస్తామని గట్టిగా గొడవపడితే వాళ్లను కూడా అనుమతించాం. ఆ రోజు నేను సీబీఐకి చెప్పాను. ఆ రోజు వచి్చన హిమకుంట్ల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి.. చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. 2025లో సునీత, ఆమె భర్త ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి... ఘటన జరిగిన తర్వాత వెళ్లిన వాళ్లలో నువ్వు కూడా ఉన్నావు, సీబీఐ వాళ్లు నిన్ను పిలిచి విషయం అడుగుతారని చెప్పారు.
దానికి ఆయన నేను తప్పకుండా చెబుతానంటే... అలా చెప్పడం కాదు అవినాష్ రెడ్డి గుండెపోటు అని చెప్పాడని స్టేట్‌మెంటు ఇమ్మన్నారు. నాకు అలా చెప్పలేదంటే... మా నాన్నకి ఆప్తుడివి నువ్వు అలా చెప్పాల్సిందేనని అంటే... అక్కడ నుంచి వెళ్లిపోయి మరలా వారం తర్వాత ఆయనపై ఒత్తిడి తెచి్చ.. తాము చెప్పమన్నట్టే స్టేట్‌మెంట్ ఇమ్మని ఒత్తిడి చేశారు. అందుకు ఆయన ఒప్పుకోకపోవడంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇదే రీతిలో తప్పుడు స్టేట్‌మెంట్లను ఇప్పిస్తూ వచ్చారు. వారినే సీబీఐ పిలుస్తూ వచి్చంది.
విచారణ పూర్తి చేయాలి..
సునీత లేఖ దాచిపెట్టిన విషయం, సౌభాగ్య పెద్దమ్మ, నర్రెడ్డి రాజశేఖర్ కలిసి అటెండర్‌కి సెలవు ఇచ్చి కాణిపాకం పంపించడం, డాక్యుమెంట్ దొంగతనం వంటి అంశాలపై దర్యాప్తు కోరాల్సింది పోయి.. అసలు సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తోంది. దస్తగిరి బెయిల్ క్యాన్సిల్ విషయంలోనూ అదే విధంగా వ్యవహరిస్తున్నారు. దస్తగిరి బెయిల్ క్యాన్సిలేషన్ కోసం మేం పిటిషన్ వేస్తే.. వెంటనే ఆమె ఇంప్లీడ్ అయి.. దస్తగిరి తరపున లూథ్రాతో వాదనలు వినిపిస్తారు.
ఈ కేసు విషయంలో గత మూడేళ్లుగా వాస్తవాలు తెలియకుండా మమ్నల్ని ఎంతో మంది దూషించారు. వీళ్లంతా తాము అనవసరంగా నిందించామని తెలుసుకునే రోజు తప్పకుండా వస్తుంది. ఈ కేసు ఆలస్యం కాకుండా త్వరగా విచారణ జరిగే దిశగా న్యాయస్థానాలు, దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకోవాలి. సునీత భర్త రాజశేఖర్‌కు టీడీపీ నాయకుడు బీటెక్ రవికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాలి.
గుండెపోటు థియరీని సృష్టించింది సునీతే..
ఈ కేసులో అనేక సందర్భాల్లో సీబీఐ అప్పటి డైరెక్టర్‌కు తాము చెప్పిన కోణాల్లో దర్యాప్తు చేయాలని విజ్ఞపి చేశాం. పైన నేను చెప్పిన అన్ని అంశాలను లేఖ రూపంలో రాశాను. కేవలం టార్గెటెడ్ దర్యాప్తు చేసిందే తప్ప... సీబీఐ వాస్తవాలను వెలికి తీసే దిశగా దర్యాప్తు చేయలేదు. గతంలో కేంద్ర హోంమంత్రి, ప్రధానమంత్రి, సీబీఐకి మెయిల్స్, రిజిస్టర్డ్ పోస్టు రూపంలో మేము అనుకున్న అంశాలపై ఫిర్యాదు చేశాం. సునీత ఇప్పుడు కూడా చంద్రబాబు ఆదేశాల ప్రకారం పలు రకాల పిటిషన్స్ వేసి విచారణను మరింత ఆలస్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల వరకు ఈ అంశాన్ని వెలుగులో ఉంచడమే వీరి లక్ష్యం. వివేకానంద రెడ్డి హత్య జరిగే నాటికి చంద్రబాబు సీఎంగా ఉన్నారు. అదే విధంగా గుండెపోటు అని అవినాష్ రెడ్డి చెప్పాడని చెప్పమంటూ.. సునీత చాలా మందిని ట్రైన్ చేశారు. గుండెపోటు అని తాను అనుకున్నానని సునీత చెప్పింది. అసలు ఆ థియరీని సృష్టించింది, సిట్ ముందు చెప్పిందే సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఆదినారాయణ రెడ్డి కూడా సిట్ ముందు హాజరై శివప్రకాష్ రెడ్డి, ఆయన కుమారుడు ఫోన్ చేసి వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు చెప్పారన్నారు. చేసినదంతా వాళ్లే చేసి అన్యాయంగా మా మీద నిందలు వేశారు.
మార్చి 16న సునీత తానే స్వయంగా సిట్ ముందు గుండెపోటు అని చెప్పిన వీడియోలు కూడా ఉన్నాయి. కీలకమైన అంశాలను పక్కనపెట్టి.. ఇతర అంశాలను కోర్టు దృష్టికి, సీబీఐ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా విచారణను జాప్యం చేయడం ద్వారా చంద్రబాబుకి లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు వివేకానందరెడ్డి చెక్ పవర్ తీసివేసి చనిపోయే ముందు ఖర్చులకు డబ్బుల్లేని పరిస్థితికి తీసుకొచ్చారు. ఆయనతో మాట్లాడలేదు. ఆ కోణంలో విచారణ జరగాలి.
షమీమ్‌కి వివేకానంద రెడ్డికి మధ్య జరిగిన చాట్స్ బయటకు రావాలి. దొంగిలించబడిన రౌండ్ సీల్ డాక్యుమెంట్లలో ఏముంది? మర్డర్ ఫర్ గెయిన్ దిశగా సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయడం లేదన్నదే మా వాదన. కొంతమందిని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా వివేకం అని సినిమా తీసి రాక్షసానందం పొందారు. కానీ పైన దేవుడు కూడా క్షమించడు. వాళ్లందరినీ దేవుడు శిక్షించడం ఖాయం.
ఈ ప్రశ్నలకు బదులేది?
ఈ విషయాలపై మరింత విచారణకు సునీత ఎందుకు పట్టుబట్టడం లేదు?
1. హత్యకు ముందు రోజు వివేకా అటెండర్ పండంటి రాజశేఖర్‌ను సౌభాగ్యమ్మ, అల్లుడు రాజశేఖర్ కాణిపాకం ఎందుకు పంపించారు?
2. వివేకాను హత్య చేయడానికి ముందు కొన్ని డాక్యుమెంట్ల కోసం ఆయన్ను హింసించామని దస్తగిరి చెప్పాడు. డాక్యుమెంట్లను వెరిఫై చేసుకున్న తర్వాతనే హత్య చేసినట్లు చెప్పాడు. హత్య చేశాక కూడా ఒకటికి రెండుసార్లు డాక్యుమెంట్లు వెరిఫై చేసుకున్న తర్వాతే బయటకు వెళ్లినట్లు చెప్పాడు. రౌండ్ సీల్‌తో ఉన్న ఆ డాక్యుమెంట్లు ఏమిటి?
3. హత్య జరిగిన చోట లేఖను సునీత భర్త రాజశేఖర్ ఎందుకు దాచినట్లు? లేఖలో విషయాలు ఎవరికీ చెప్పకుండా లేఖను దాచాల్సిందిగా పీఏ కృష్ణారెడ్డిని ఆదేశించడం అనుమానాస్పదం కాదా?
4. వివేకాకు అనేకమందితో అక్రమ సంబంధం ఉందని పేర్లతో సహా దస్తగిరి స్టేట్‌మెంట్‌లో ఉంది. ఆ మహిళల భర్తలు, పిల్లలు వివేకాపై కక్ష పెంచుకున్నారని ఆ స్టేట్‌మెంట్‌లో ఉంది.
5. వివేకాను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆయన జీవించి ఉంటే 30 నుంచి 40శాతం ఆస్తులను తన రెండో భార్యకు ఇచ్చేవారు. అందుకని ఇది మొదటిభార్య కుటుంబం చేసిన మర్డర్ ఫర్ గెయిన్ కాదా?
6. హంతకుడు దస్తగిరి ముందస్తు బెయిల్‌ను సునీత అడ్డుకోదు. ఎందుకంటే సునీత ఏం కోరుకుంటుందో అదే దస్తగిరి చెబుతాడు. స్టేట్‌మెంట్‌గా ఇస్తాడు. మేం దస్తగిరి బెయిల్‌ను రద్దు చేయాలని హైకోర్టుకు వెళితే సునీత ఇంప్లీడ్ అయ్యింది. బెయిల్ రద్దు కోసం కాదు.. దస్తగిరి బెయిల్ ఉండాలని.. దస్తగిరి రక్షణ కోసం లూద్రా వంటి సీనియర్ లాయర్‌ను దింపుతుంది.


