బాబు పాలన హిందుత్వానికి ప్రమాదకరం | Chandrababu Naidu Rule Has Become Dangerous For Hindutvam, VHP Raises Demands Probe Into TTD Issues And Temple Land Decisions | Sakshi
Sakshi News home page

బాబు పాలన హిందుత్వానికి ప్రమాదకరం

Mar 17 2026 4:37 AM | Updated on Mar 17 2026 9:53 AM

Chandrababu Naidu rule has become dangerous for Hindutvam says VHP

ఆందోళన వ్యక్తం చేసిన విశ్వ హిందూ పరిషత్‌

ఆరోపణలొస్తే టీటీడీ చైర్మన్‌పై విచారణేదీ? 

దేవదాయ భూముల భక్షణకు సర్కారు కుటిల యత్నం  

భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని చూస్తే తీవ్ర పోరాటం   

ప్రభుత్వ ధోరణి మారకుంటే సహించం.. పిల్లలను కనాలంటూ సీఎం పిలుపు అనుమానాస్పదం 

మరో ధార్మిక స్వతంత్ర పోరాటానికి హిందువులు సిద్ధం కావాలి  

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన హిందుత్వానికి ప్రమాదకరంగా మారిందని విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్‌పై ఆరోపణలొస్తే విచారణ జరిపించకుండా తాత్సారం ఏమిటని ప్రశ్నించారు. సోమవారం విజయవాడలోని వీహెచ్‌పీ కార్యాలయంలో పరిషత్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభాగం క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్, రాష్ట్ర విభాగం కోశాధికారి దుర్గాప్రసాదరాజు, విజయవాడ మహానగర కార్యదర్శి శ్రీహరి విలేకరులతో మాట్లాడారు. 

ప్రజా జీవితంలో ఉన్నవాళ్లు, ధార్మిక, ఆధ్యాత్మిక బాధ్యతల్లో ఉన్నవాళ్లపై ఆరోపణలొస్తే తక్షణమే నైతిక బాధ్యతవహించి బాధ్యతల నుంచి తప్పుకోవాలని, లేకుంటే ప్రభుత్వమే దర్యాప్తునకు ఆదేశించాలని పేర్కొన్నారు. కానీ రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడిపై ఆరోపణలొస్తే మిన్నకుండడం ఏమిటని ధ్వజమెత్తారు. 

ఎంపీ డ్రగ్స్‌ తీసుకున్న ఘటనపై స్పందించిన చంద్రబాబు, టీటీడీ చైర్మన్‌పై చర్యలు తీసుకోకపోవడం ఏమిటని నిలదీశారు. ఇటీవల తరచూ ఎక్కువ మంది పిల్లలను కనండి అంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు అనుమానాస్పదంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. పిల్లలను కంటే రాయితీలు ఇస్తామని చేస్తున్న ప్రకటన ఏ వర్గాలకని ప్రశ్నించారు.   

దేవుడి భూములను కాపాడాలని సర్కారుకు లేదు  
దేవదాయ శాఖ భూముల విషయంలో సర్కారు తీరు హిందూ సమాజానికి చాలా ప్రమాదకరంగా ఉందని తనికెళ్ల రవికుమార్‌ విమర్శించారు. ప్రైవేట్‌ వ్యక్తుల భూములు లక్షన్నర ఎకరాలు దేవదాయ భూముల్లో కలిశాయన్న సాకుతో దేవుడి మాన్యాలను దోచుకునే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. సర్వే నంబర్లు మారాయన్న పేరుతో దేవదాయ భూములను ప్రైవేట్‌ వ్యక్తులకు, కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూస్తే తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.   

దీర్ఘకాలిక లీజులెందుకు?  
పట్టణ ప్రాంతాల్లో ఉండే దేవాలయాల భూములను 33 ఏళ్ల పాటు దీర్ఘకాలికంగా ప్రైవేట్‌ సంస్థలకు లీజుకివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం జీఓ 139 తేవడాన్ని సత్య రవికుమార్‌ తప్పుపట్టారు. దేవుడి భూములను గరిష్టంగా 11 ఏళ్లకు మాత్రమే టెండరు ద్వారా లీజుకు ఇవ్వాలని చట్టం ఉంటే 33 ఏళ్లకు ఎందుకు పెంచాల్సి వచ్చిందని బాబు ప్రభుత్వాన్ని నిలదీశారు.    

వీహెచ్‌పీ నేతలు లేవనెత్తిన మరిన్ని అంశాలివీ..  
»‘‘కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని గొడుగుపేట ఆలయ భూమి విజయవాడ సమీపాన గొల్లపూడిలో ఉంటే ఆ భూమిని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ కోసం, గోల్ఫ్‌ కోర్టుకు సర్కారు కేటాయించింది. దీనిని తప్పుబడుతూ సుప్రీంకోర్టు స్టే ఇస్తే.. 56 రోజుల్లో దానిని ఖాళీ చేసి అప్పగిస్తామని అఫిడవిట్‌ ఇచ్చిన సర్కారు ఇప్పటికి వంద రోజులైనా, భూమిని దేవస్థానానికి ఎందుకు అప్పగించలేదు.   
» కాకినాడ శ్రీభావనారాయణస్వామి ఆలయ భూములను క్రికెట్‌ స్టేడియం కోసం ఇచ్చారు. దీనిపై కోర్టుకెళ్లి స్టే తీసుకురావాల్సి వచ్చింది.   
» సింహాచలం ఆలయ భూములను పంచ గ్రామాల పరిధిలో ఆక్రమిస్తే ఆక్రమణదారులకు రెగ్యులర్‌ చేయడం కోసం ప్రభుత్వం కమిటీ వేయడం ఏమిటీ? ఈ భూముల్లో కొందరు చర్చిలు, మసీదులూ కట్టారు.  
»  ఎన్టీఆర్‌ జిల్లా గంపలగూడెం మండలంలో వందలాది ఎకరాల దేవదాయ భూమిని రాత్రికిరాత్రి ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టేయత్నం చంద్రబాబు సర్కారు చేసింది. తిరుపతిలో ముంతాజ్‌ హోటల్‌కు భూములివ్వాలని ప్రభుత్వం యత్నిస్తోంది.   
»  దేవదాయ భూముల పరిరక్షణ కోసం వీహెచ్‌పీ దేశవ్యాప్తంగా ఉద్యమిస్తోంది. రాష్ట్రంలో ఇటీవల హైందవ శంఖారావం సభను నిర్వహించాం. దేవదాయ భూముల రక్షణకు  చట్ట సవరణ నమూనా డ్రాప్ట్‌ తయారు చేసి ప్రభుత్వానికి, సీఎం, డిప్యూటీ సీఎం, బీజేపీ అధ్యక్షుడుకి ఇచ్చాం. అయినా ప్రభుత్వం దైవ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోంది. వీటిన్నింటిపై హిందూ సమాజాన్ని జాగృతం చేస్తాం. మరో ధారి్మక స్వతంత్ర పోరాటానికి హిందువులను సిద్ధం చేస్తాం.’’  

Advertisement
 
Advertisement
Advertisement