ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్న ‘మిలాప్‌’

Milap Crowdfunding Is A Platform For Many People Who Suffer Health Issues - Sakshi

ఆపదలో ఉన్నవారిని దాతల దరికి చేర్చే ‘మిలాప్‌’

క్రౌడ్‌ఫండింగ్‌ సామాజిక వేదిక

గ్రేటర్‌లో 20 వేల మంది బాధితులకు కనిపించని దాతల వితరణ

అత్యవసర వైద్యం, అవయవ మార్పిడి, విద్య,ఉపాధి.. 

అన్నింటిలోనూ ఆదుకొనే నేస్తం ‘మిలాప్‌’

సాక్షి, హైదరాబాద్‌ : గచ్చిబౌలికి చెందిన ఏడాది పసివాడు ఆకాశ్‌. ఎముకల చుట్టూ ఉన్న కణజాలాన్ని కబళించే అరుదైన  కేన్సర్‌ బారిన పడ్డాడు. దుస్తుల దుకాణంలో పని చేసే తండ్రి  వీరేశం అప్పటికే  రూ. 6 లక్షలకు పైగా ఖర్చు చేశాడు. మరే ఆధారం లేదు. ఆ బిడ్డ వైద్యం కోసం రూ.15 లక్షలు అవసరం. సరిగ్గా ఆ సమయంలోనే వైద్యుల సలహాతో ఉచిత క్లౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘మిలాప్‌’ లో జబ్బు వివరాలతో పాటు అందుకయ్యే ఖర్చు, వైద్యుల డయాగ్నసిస్‌ నివేదికలను అప్‌లోడ్‌ చేశారు. పసివాడి దయనీమైన ఫొటో మానవతామూర్తులను కదిలించింది. సాయం అందింది. బిడ్డ బతికాడు. ఒక్క ఆకాశ్‌ మాత్రమే కాదు. ఆపదలో,కష్టాల్లో ఉన్న ఎంతోమందికి  మిలాప్‌  ఒక వేదికనిస్తోంది. పూర్తి ఉచితంగా, పారదర్శకంగా సేవలందజేస్తోంది. 

కూకట్‌పల్లికి చెందిన మరో రెండేళ్ల చిన్నారి విశాల్‌కు లివర్‌ మార్పిడికి మిలాప్‌ ప్రచార ఉద్యమం రూ. 24 లక్షల వరకు ఆర్జించి పెట్టింది. కోవిడ్‌ బారిన పడి ఐసీయూలో చేరిన ఎంతోమంది మిలాప్‌ను ఆశ్రయించి బాధలను విన్నవించుకున్నారు. స్పందించిన దాతలు సాయమందజేశారు. ఒక్క వైద్యమే కాదు. ఆపద ఎలాంటిదైనా సరే మిలాప్‌ ఉచిత క్లౌడ్‌ ఫండింగ్‌ సోషల్‌ ప్లాట్‌ఫామ్‌ ఒక వేదికకల్పిస్తోంది.  

ఒక కలయిక... 
ప్రతి కష్టానికి, ఆపదకు ఒక పరిష్కారం ఉంటుంది. కనుచూపు మేరలో ఉన్న దారులన్నీ మూసుకుపోయి, ఆ బాధల్లోంచి బయటపడేందుకు ఇక ఎలాంటి అవకాశం లేదని నిస్సహాయ స్థితికి చేరుకున్నప్పుడు...ఇదిగో  మేమున్నాం‘ అంటూ ఎవరో ఒకరు వచ్చి ఆదుకున్నప్పుడు, ఆ బాధల సుడిగుండంలోంచి బయటకు తీసినప్పుడు  అది  ఒక పునర్జన్మే అనిపిస్తుంది. గొప్ప ఊరట లభిస్తుంది.కానీ అలాంటి దాతలు, ఇతరుల కష్టాలకు, బాధలకు స్పందించి చేయూతనందించే మానవతామూర్తులను చేరుకోవడమే పెద్ద సమస్య. ‘మిలాప్‌ క్లౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల్లో దాతలతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. అదే సమయంలో హైదరాబాద్‌లోని అన్ని ప్రధాన ఆసుపత్రులతో సమన్వయం చేసుకొని పని చేస్తున్నాం. దీంతో సామాజిక ప్రచార ఉద్యమం చక్కటి ఫలితాలనిస్తోంది.’ అని చెప్పారు ఆ సంస్థ సీఈవో మయూఖ్‌.  

వైద్యరంగంతోపాటు అన్ని రంగాల్లో...
గత పదేళ్లుగా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తోన్న  మిలాప్‌ ఒక్క వైద్య రంగానికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ఇప్పటి వరకు 20 వేల మందికి పైగా బాధితులకు ఆర్ధిక సహాయం అందజేసేందుకు వేదికకల్పించిందని  చెప్పారు. స్కూళ్లు,కాలేజీల్లో ఫీజులు చెల్లించలేని నిరుపేదల పిల్లలకు చేయూతనిచ్చింది. పిల్లలను చదివించలేని ఒంటరి తల్లులకు ఉపాధి కల్పించింది. జంతువులు, పక్షులు, పర్యావరణ పరిరక్షణ కోసం పని చేస్తున్న సామాజిక కార్యకర్తలు, స్వచ్చంద సంస్థలు కూడా మిలాప్‌ ద్వారా క్లౌడ్‌ ఫండింగ్‌ పొందినట్లు  ఆయన పేర్కొన్నారు.  

 ఇలా చేరుకోవచ్చు: ‘మిలాప్‌ డాట్‌ ఓఆర్‌జీ’ ద్వారా ఆ సంస్థ వెబ్‌సైట్‌లోకి వెళ్లి వివరాలను నమోదు చేయాలి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top