సాక్షి, నల్గొండ జిల్లా: నల్గొండ పట్టణంలోని ప్రసాద్ ఉడిపి హోటల్ దారుణం జరిగింది. సాంబారులో జెర్రీ కనిపించింది. పూర్తిగా తిన్న తర్వాత సాంబారులో జెర్రీని గమనించిన ఓ వ్యక్తి.. హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా.. పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. భారీగా రేట్లు తీసుకోవడమే కాదని.. ప్రజల ప్రాణాలను లెక్కలోకి తీసుకోవాలని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఈ తరహా ఘటనలు వరుసగా చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇటీవల విజయవాడ సూర్యారావుపేటలోని కాకినాడ సుబ్బయ్య హోటల్ భోజనంలో జెర్రి రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఫుడ్ అండ్ అడల్ట్ట్రేషన్ కేసు నమోదు చేసి హోటల్‌ను సీజ్ చేశారు.
మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రెస్టారెంట్, హోటల్ నిర్వాహకుల నిర్వాకాలు వెలుగులోకి వస్తున్నాయి. రోజుల తరబడి నిల్వచేసిన పదార్థాలు.. కుళ్లిన ఆహారాన్ని నిబంధనలు అతిక్రమించి విక్రయిస్తున్నారు. అధికారుల తనిఖీల్లోనూ వాస్తవాలు బట్టబయలవుతున్నాయి. కల్తీ, కుళ్లిన ఆహార పదార్థాలు తిని ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు.


