విషాదం: బర్త్‌డే వేడుకలకు వెళ్లివస్తూ.. వ్యవసాయ బావిలో పడ్డ కారు

Jagtial Five Men Attend Birthday Party Car Drowned Well One Person Missing - Sakshi

జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్‌ మండలం లక్ష్మీపూర్‌ చౌరస్తా వద్ద గొల్లపల్లి–జగిత్యాల ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న వ్యవసాయ బావిలో శనివారం రాత్రి సుమారు 11.45గంటల సమయంలో కారు అదుపుతప్పి పడిపోయింది. ఆ సమయంలో కారులో ఐదుగురు ఉన్నారు. ఇందులో ఒకరు గల్లంతవగా, నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. జిల్లాలోని మల్యాలకు చెందిన సామల్ల కిశోర్, మరోనలుగురు యువకులు కలిసి కిశోర్‌ అక్క కూతురు జన్మదిన వేడుకల కోసం గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లెకు వెళ్లారు. వేడుకల్లో పాల్గొని రాత్రి కారులో తిరిగి వస్తున్నారు.


రోదిస్తున్న కుటుంబసభ్యులు

ఈక్రమంలో లక్ష్మీపూర్‌ శివారులోని నల్లగుట్ట కమాన్‌ వద్ద రోడ్డును ఆనుకుని ఉన్న వ్యవసాయబావిలో కారు అదుపుతప్పి పడిపోయింది. కారుతోపాటు సామల్ల కిశోర్, ఈశ్వర్, సాయిరఘు, గడీల సందీప్, చందు బావిలో పడిపోయారు. సాయిరఘు, సందీప్, చందు, ఈశ్వర్‌ సురక్షితంగా బయటపడ్డారు. కిశోర్‌ బావిలో గల్లంతయ్యాడు.


నీటిని తోడేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

బావినుంచి బయటకు వచ్చిన నలుగురు యువకులు కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రూరల్‌ ఎస్సై అనిల్‌ ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పైపుల ద్వారా నీటిని తోడేస్తూనే క్రేన్‌ సాయంతో కారును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, గల్లంతైన కిశోర్‌(22) కోసం కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top