
అధిష్టానం పిలుపు మేరకే కాంగ్రెస్‌లోకి వచ్చా.. ప్రభుత్వ పెద్దలు భాష మార్చుకోవాలి
బీఆర్‌ఎస్ భవిష్యత్‌లో ఉండదు...
ప్రతిపక్ష నేత పదవి వేరేవారికి ఇవ్వాలి
తెలంగాణకు అన్యాయం జరిగితే బహిరంగంగానే మాట్లాడతా
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి పార్టీలోకి తీసుకొచ్చారని, అధిష్టానం పిలుపు మేరకే తాను తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చానని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, ఐదేళ్లు అధికారంలో ఉంటుందని చెప్పిన ఆయన.. తప్పు ఎక్కడ జరుగుతుందో తెలియకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని, అందుకే కొన్ని విషయాలను చెబుతున్నానన్నారు.
రాష్ట్రంలోని డిజిటల్ మీడియా ప్రతినిధులు హైదరాబాద్‌లోని నివాసంలో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని బుధవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు భాష మార్చుకోవాలని హితవు పలికారు. ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకోవాలని, తక్కువ మాట్లాడి ఎక్కువ పనులు చేయాలన్నారు. ఖాళీగా ఉన్న కేబినెట్ బెర్తులను భర్తీ చేసి, వీలున్నంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. తాను రేవంత్‌రెడ్డిని విమర్శించడం లేదని సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తున్నానని చెప్పారు.
వాళ్లు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు
బీఆర్‌ఎస్ పార్టీ అధికారం పోయిందన్న ఫ్ర్రస్టేషన్‌లో ఉందని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హోదాలో కొనసాగే అర్హత లేదని, ఆయన అసెంబ్లీకి రావాలని లేదంటే ప్రతిపక్ష నేత హోదా ఇంకెవరికైనా ఇవ్వాలన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ ఉండదని జోస్యం చెప్పారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ దివాలా తీయిస్తే ఆంధ్ర పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, సమయం వచ్చినప్పుడు వారి బండారం బయటపెడతానన్నారు.
రాష్ట్ర సంపదను లూటీ చేసే విషయంలో, కాంట్రాక్టుల విషయంలో, భూములు, ఇసుక మాఫియా విషయంలో... తెలంగాణకు అన్యాయం జరిగే ఏ విషయం గురించైనా తాను బహిరంగంగానే మాట్లాడతానని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ ఫ్యామిలీ లక్షల కోట్లు దాచుకుందని, విచారణల పేరుతో కాలయాపన చేయకుండా గత పదేళ్ల కాలంలో అవినీతి సొమ్మును దోచుకున్న వారందరినీ వీలున్నంత త్వరగా జైల్లో పెట్టాలని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కోరారు.