ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు జూన్‌ నెలాఖరులో! 

Inter Secondary Exams At The End Of June - Sakshi

కుదరకపోతే ఫస్టియర్‌ మార్కుల ఆధారంగా ఫలితాలు?

కనీసం 45% మార్కులు ఇచ్చేలా చర్యలు

ఆ మార్కులతో సంతృప్తి చెందకపోతే ఇంప్రూవ్‌మెంట్‌ కింద పరీక్షలు రాయొచ్చు

కేంద్రానికి చెప్పిన రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలను జూన్‌ నెలాఖరులో నిర్వహించేందుకు చర్యలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అప్పటికి కరోనా కేసులు తగ్గుముఖం పడితే ఈ పరీక్షలను నిర్వహించాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది. అప్పటికీ సాధ్యం కాకపోతే ఎలా ముందుకు సాగాలన్న విషయంలో ప్రత్యామ్నాయాలపైనా దృష్టి పెట్టినట్లు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ ఆదివారం వివిధ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, కార్యదర్శులతో ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణపై నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలిసింది. ఈ సమావేశంలో రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రం తీసుకుంది. సీబీఎస్‌ఈ పరీక్షలను జూలైలో నిర్వహించాలని భావిçస్తున్న రాష్ట్రాల అభిప్రాయాలను చెప్పాలని కోరింది.

ఇందులో భాగంగానే విద్యాశాఖ కార్యదర్శి కేంద్రానికి రాష్ట్ర అభిప్రాయాన్ని తెలియజేశారు. జూన్‌ నెలాఖరులో పరీక్షలను నిర్వహించే దిశగా కసరత్తు చేస్తున్నామని తెలిజేసినట్లు సమాచారం. అప్పుడు సాధ్యం కాకపోతే ఇంటర్‌ ప్రథమ సంవత్సరం మార్కులను ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌గా (పదో తరగతి తరహాలో) పరిగణనలోకి తీసుకొని ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మార్కులను ఇవ్వాలని భావిస్తున్నటు తెలియజేశారు. అవికూడా కనీసం 45 శాతం ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. జాతీయ స్థాయిలో ప్రైౖ వేటు విద్యా సంస్థలు, ప్రైవేటు యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందాలంటే ఇంటర్మీడియట్లో కనీసం 45 శాతం మార్కులు ఉండాలని ఆయా విద్యా సంస్థలు అడుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఇంటర్‌ ఫస్టియర్‌లో ఫెయిలైన విద్యార్థులు ఎవరైనా ఉంటే వారికి కనీసం 45 శాతం మార్కులిచ్చి, వాటిని సెకండియర్‌లో పరిగణనలోకి తీసుకొని తుది మార్కులను ఇవ్వనున్నారు. ఓపెన్‌ ఇంటర్మీడియట్‌లోనూ ఇదే విధానం అమలు చేయనున్నారు. ఒకవేళ ఆ తరువాత పరిస్థితులు అనుకూలిస్తే ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ప్రథమ సంవత్సర మార్కుల ఆధారంగా ద్వితీయ సంవత్సరంలో ఇచ్చే మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులు ఎవరైనా ఉంటే వారు ఇంప్రూవ్‌మెంట్‌ కింద ఆ పరీక్షలకు హాజరయ్యేలా కసరత్తు చేస్తున్నారు. ఇవే అంశాలను సుల్తానియా కేంద్రానికి తెలియజేసినట్లు సమాచారం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top