ఇక అన్నీ కరెంటు ఇంజన్లే..

Indian Railways To Be Fully Electrified - Sakshi

పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌లే వినియోగం 

వేగంగా రైల్వే లైన్ల విద్యుదీకరణ 

రాష్ట్రంలో మిగిలింది కేవలం 400 కి.మీ. 

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో రైళ్ల డీజిల్‌ ఇంజిన్లు కనుమరుగుకాబోతున్నాయి. వాటి స్థానంలో పూర్తిగా ఎలక్ట్రిక్‌ ఇంజిన్లే రానున్నాయి. ఈమేరకు అన్ని రైల్వే లైన్లను విద్యుదీకరించే పనులను కేంద్రం వేగవంతం చేసింది. గత ఏడాది కాలంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 770 కి.మీ. మేర విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. ఇది జోన్‌ ఆల్‌టైం రికార్డు.

అదీగాక ఇంత విస్తృతంగా మరే జోన్‌లో పనులు జరగలేదు. ఇందులో తెలంగాణ పరిధిలో 326 కి.మీ. ఎలక్ట్రిఫికేషన్‌ పూర్తి కావటం విశేషం. వచ్చే సంవత్సరం డిసెంబరు నాటికి జోన్‌ యావత్తు విద్యుదీకరణ పూర్తి చేయాలని రైల్వే బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పనులు పూర్తయితే 20 నెలల్లో అన్నిలైన్లలో విద్యుత్‌ లోకోమోటివ్‌లే నడనున్నాయి.  

రాష్ట్రంలో మొత్తం 1,850 కి.మీ. 
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తెలంగాణ భూభాగం పూర్తిగా ఉంటుంది. రాష్ట్రం పరిధిలో 1,850 కి.మీ. మేర రైల్వే లైన్లు విస్తరించి ఉన్నాయి. మనోహరాబాద్‌–కొత్తపల్లి లాంటి కొత్త ప్రాజెక్టుల పనులు జరుగుతున్న నేపథ్యంలో, ఈ ప్రాజెక్టు నిడివి ఇందులో కలపలేదు. గత ఏడాది పూర్తయిన 326 కి.మీ. కలుపుకొంటే ఇప్పటివరకు 1450 కి.మీ. మేర విద్యుదీకరణ పూర్తయింది. ఇక 400 కి.మీ.మేర మాత్రమే పనులు జరగాల్సి ఉంది. దక్షిణ మధ్య రైల్వే నెట్‌వర్క్‌లో త్వరలో వందశాతం విద్యుదీకరణ పూర్తవుతుందని జనరల్‌ మేనేజర్‌ (ఇన్‌చార్జి) అరుణ్‌ కుమార్‌ జైన్‌ చెప్పారు. 

డీజిల్‌ ఇంజిన్‌తో భారీ వ్యయం 
ఖర్చు పరంగా చూస్తే డీజిల్‌ ఇంజిన్‌తో రైల్వేకు భారీగా వ్యయమవుతోంది. ప్రతి వంద కిలోమీటర్ల ప్రయాణానికి డీజిల్‌ ఇంజిన్‌తో రూ.65 వేలు ఖర్చు అవుతుండగా, ఎలక్ట్రిక్‌ ఇంజిన్‌తో రూ.45 వేలు అవుతోంది. అంటే ప్రతి వంద కి.మీ.కు ఎలక్ట్రిక్‌ వినియోగంతో రూ.20 వేలు ఆదా అవుతుంది. అదీగాక పొగరూపంలో కాలుష్యం కూడా ఉండదు.  

కన్వర్షన్‌పై దృష్టి 
ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌ తయారీకి రూ.18 కోట్లు అవుతుంది. అదే డీజిల్‌ ఇంజిన్‌ను ఎలక్ట్రిక్‌ ఇంజిన్‌గా కన్వర్ట్‌ చేసుకోవటం తక్కువ ఖర్చుతో కూడుకున్న ది. రూ.2కోట్లతో ఓ ఇంజిన్‌ను కన్వర్ట్‌ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం దేశంలో ఉన్న డీజిల్‌ ఇంజిన్లు బాగా పాతబడి ఉన్నాయి. వచ్చే ఏడెనిమిదేళ్లలో అవి పనికిరాకుండా పోయే పరిస్థితి. వాటిని మెరు గుపరిస్తే మరో పదేళ్లు వాడే వీలుందని నివేదికలు చెబుతున్నాయి. దీంతో ఉన్న డీజిల్‌ ఇంజిన్లను కన్వ ర్ట్‌ చేయటం ద్వారా తక్కువ వ్యయంతో కరెంటు ఇంజిన్లను పట్టాలెక్కించాలని రైల్వే భావిస్తోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top