
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ భారతదేశ గతిని మార్చగలరని, ఆయన నాయకత్వం దేశ రాజకీయాలకు అవసరమని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు, తెలంగాణీయులు తీర్మానించారు. కేసీఆర్ మార్గదర్శనంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో వెళుతోందని, దేశ రాజకీయాల్లోనూ గుణాత్మక మార్పు తెచ్చేందుకు ఆయన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. టీఆర్‌ఎస్ జాతీయ పార్టీగా అవతరించబోతుందన్న వార్తల నేపథ్యంలో ప్రవాస తెలంగాణీయుడు మహేశ్‌బిగాల ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నారైలతో ఆదివారం జూమ్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ ప్రస్థానం, స్వయం పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా రూపొందుతున్న తీరును చర్చించారు. బిగాల ప్రవేశపెట్టిన ‘దేశ రాజకీయాల్లో కేసీఆర్ నాయకత్వం అవసరం’ అనే ఏకవాక్య తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభించిందని, వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులంతా ముక్తకంఠంతో కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించారని తెలంగాణ భవన్ వర్గాలు వెల్లడించాయి. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని, ఆ మార్పు కేసీఆర్‌తోనే సాధ్యమని ఎన్నారైలు అభిప్రాయడ్డారని తెలిపాయి. ఈ సమావేశంలో పలు దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.