పెంచుకున్నతండ్రి చంకనెక్కి వెక్కివెక్కి ఏడ్చిన బాలుడు
జగిత్యాల శిశుగృహంలో హృదయవిదారక ఘటన
జగిత్యాల/జగిత్యాలటౌన్: ‘అమ్మా నాకు భయమేస్తోంది. నన్ను తీసుకెళ్లండి..’అంటూ పెంచిన తల్లిదండ్రులతో చిన్నారి ఏడ్చిన హృదయవిదారక ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రానికి చెందిన కాసారపు శ్రీనివాస్, సరిత దంపతులకు సంతానం లేకపోవడంతో హిందూ సాంప్రదాయం ప్రకారం ఓ బాలుడిని దత్తత తీసుకున్నారు. మూడేళ్లు అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అయితే చట్టపరంగా దత్తత తీసుకోలేదంటూ ఆ బాలుడిని శిశుసంక్షేమశాఖ అధికారులు శిశుగృహానికి తరలించారు. దీంతో దంపతులు హైకోర్టును ఆశ్రయించారు.
ఆ బాలుడిని తల్లిదండ్రులు తీసుకెళ్లవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. కానీ..శిశుగృహ అధికారులు నిరాకరించారు. జరిగిన ఘటనపై ఆ దంపతులు ప్రజావాణిలో ఫిర్యాదు చేసి.. చిన్నారిని చూసేందుకు శిశుగృహానికి వెళ్లారు. వారిని చూసిన బాలుడు పరుగున వచ్చి శ్రీనివాస్ చంకనెక్కి తనని తీసుకెళ్లండంటూ అంటూ వెక్కి వెక్కి ఏడ్వడం ఆ దంపతులను కలచివేసింది. దీనిపై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించి జిల్లా అధికారులతో సంప్రదించి బాలల హక్కుల కమిషన్‌కు లేఖ రాసింది.
మూడేళ్లుగా దంపతుల సంరక్షణలో ఉన్న బాలుడిని వారి నుంచి వేరుచేసి శిశు సంక్షేమ శాఖకు తరలించిన నేపథ్యంలో హైకోర్టు తీర్పు మేరకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ ఘటనపై కలెక్టర్ సత్యప్రసాద్ స్పందించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు బాలుడిని తల్లిదండ్రులకు అప్పగిస్తామన్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనుమతి, పరిపాలనాపరమైన కారణాలతో జాప్యమైనట్లు తెలిపారు.


