కబళిస్తోన్న స్మార్ట్‌ ఫోన్‌.. పౌరుల భవిష్యత్తుపై వైద్య నిపుణుల ఆందోళన

Impact of Smartphone Addiction on Students Academic Performance - Sakshi

వెలవెల బోతున్న క్రీడామైదానాలు 

విద్యార్థుల మనోభిప్రాయాలపై సాక్షి సర్వే

సాక్షి, నిజామాబాద్‌ : కొన్నేళ్ల క్రితం క్రీడా మైదానాలు పిల్లలతో కిటకిటలాడేవి.. ఎక్కువ సేపు మైదానంలో గడిపితే ఇళ్లకు రావాలని తల్లిదండ్రులు  మందలించేవారు. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. విద్యార్థులు ఆన్‌లైన్‌ గేమ్స్‌ పట్ల మక్కువ చూపుతూ మైదానాలకు, ఆటలకు దూరమవుతున్నారు. దీంతో తల్లిదండ్రులు పిల్లలను మైదానాలకు వెళ్లి ఆడుకోవాలని సూచిస్తున్నారు. 

స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులోకి రావడం, కోవిడ్‌ కాలంలో ఆన్‌లైన్‌ పాఠా లు చెప్పడం తదితర కారణాలలో విద్యార్థులు ఆన్‌లైన్‌ పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు.  ఆన్‌లైన్‌ గేమ్‌లు వ్యసనంగా మారాయి. అనేక కొత్త అంశాలు తెలుసుకునేందుకు, ప్రాజెక్టు వర్క్‌లు సృజనాత్మకంగా చేసేందుకు ఇంటర్‌నెట్‌ ఉపయోగపడుతున్నప్పటికీ.. ఎక్కువ మంది విద్యార్థులు స్మార్ట్‌ ఫోన్లకు బానిసలుగా మారుతుండడంతో రేపటి పౌరుల భవిత ఏమిటనే ఆందోళనను పలువురు మనస్తత్వ శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు.

బాలల దినోత్సవం నేపథ్యంలో జిల్లాలోని బోధన్, బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్‌ రూరల్, నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గాల్లోని 3 ప్రభుత్వ, 3 ప్రైవేటు పాఠశాలల్లోని 9, 10 తరగతులకు చెందిన 120 మంది విద్యార్థులపై ‘సాక్షి’ సర్వే నిర్వహించింది. వారి అభిప్రాయాలను సేక రించింది. ఇందులో 60 మంది బాలురు, 60 మంది బాలికలు ఉన్నారు.

జాతిపితపై అభిమానం.. ఆసక్తిలేని రాజకీయాలు
స్వాతంత్య్ర  సమర  యోధుల్లో జాతిపిత మ హాత్మా గాంధీ అంటే అభిమానమని ఎక్కువ మంది విద్యార్థులు మనోభిప్రాయం వ్యక్తం చేశారు. తర్వాత స్థానం భగత్‌ సింగ్‌కు దక్కింది. రాజకీయాల పట్ల ఆసక్తి కనబర్చలేదు. ఇంజినీరు, వైద్య వృత్తిపై మక్కువ చూపారు. తల్లిదండ్రుల్లో  అమ్మకే  ఎక్కువ ఓటేశారు. బాల్యం తమ అభిరుచుల మేరకు గడుస్తోందని, చదువును ఇష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. గణిత శాస్త్రానికి ప్రాధాన్యత ఇచ్చారు.  

సాఫ్ట్‌వేర్‌ వైపే మొగ్గు
మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలతో దేశ, విదేశాల్లో స్థిరపడవచ్చనే ఆలోచనతో డాక్టర్‌ చదువుల కంటే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌పై ఎక్కువ ఆసక్తి చూపుతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గణితంతో కూడిన ఎంపీసీపై శ్రద్ధ పెడుతున్నారు.
– ఖాందేశ్‌ రాజేశ్వర్‌రావు, విద్యార్థి తండ్రి, ఆర్మూర్‌

అవసరానికే వాడాలి 
కోవిడ్‌కు ముందు పిల్లలు సెల్‌ఫోన్లు ముడితే కోపగించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కోవిడ్‌ అనంతరం ఆన్‌లైన్‌ తరగతుల కారణంగా సెల్‌ఫోన్ల వినియోగాన్ని ప్రోత్సహించాల్సి వచ్చింది. సెల్‌ఫోన్‌ వల్ల మంచి ఎంత ఉందో చెడు అంతే ఉంది. విద్యార్థుల చదువుల అవసరానికి మాత్రమే సెల్‌ఫోన్, ఇంటర్నెట్‌ ఉపయోగించేలా అవగాహన కల్పించాలి. మా పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి. 
– ప్రవీణ్‌ పవార్, ప్రధానోపాధ్యాయుడు, విద్య హైస్కూల్, ఆర్మూర్‌ 

రోగగ్రస్త యువతగా రేపటి పౌరులు
విద్యార్థులు స్మార్ట్‌ ఫోన్‌కు బానిసలవుతున్నారు. శారీరక శ్రమ లేకుంటే మానసిక ధృఢత్వం ఉండ దు. విద్యార్థులను జంక్‌ ఫుడ్‌కు అలవాటు  చేయ డంతో  ఊబకాయం, శక్తి, యుక్తి, ఉత్తేజం లేని యువత తయారవుతోంది. స్మార్ట్‌ ఫోన్లలో పో ర్నోగ్రఫీతో మానసిక రోగగ్రస్తులుగా మారుతున్నారు. తలనొప్పి, కంటిచూపు దెబ్బతినడం, కోపం, చికాకు చిన్నవయస్సులోనే వస్తున్నాయి. ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలవాటు పడి తల్లి,దండ్రుల హత్యకు తెగిస్తున్నారు. ఆత్మహత్యలు చేసు కుంటున్నారు. – డాక్టర్‌ కేశవులు, మానసిక వైద్య నిపుణులు

బాల్యం మీ అభిరుచుల మేరకు గడుస్తోందా?
►అవును 99, కాదు 21 

చదువును ఇష్టంగా భావిస్తున్నారా..?
►అవును 98,  కష్టంగానా ? : కాదు 22 

ఇష్టమైన పని
►చదవడం 58, ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడడం 36, మైదానంలో ఆడడం 26 

పెద్దయ్యాక ఏమవుతారు
►డాక్టర్‌ 38, ఇంజినీర్‌ 42, పోలీస్‌ 17, కలెక్టర్‌ 14, సాప్ట్‌వేర్‌ 2, ఆర్మీ 2, టీచర్‌ 3, సీఏ 1, రాజకీయం 1 

అమ్మానాన్నల్లో ఎవరంటే ఇష్టం
►అమ్మ 55, నాన్న 30, ఇద్దరు 35 

ఇష్టమైన సబ్జెక్టు
►ఆంగ్లం 25, గణితం 43, రసాయన శాస్త్రం 10, భౌతికశాస్త్రం 11, సోషల్‌ 20, తెలుగు 11 

స్వాతంత్య్ర పోరాట యోధుల్లో ఇష్టమైనవారు
►గాంధీ  53,  నెహ్రూ  13,   సర్దార్‌ పటేల్‌ 19, భగత్‌సింగ్‌  20,  సుభాష్‌ చంద్రబోస్‌ 15

తల్లిదండ్రుల ప్రభావం ఉంటోంది 
విద్యార్థుల ఆలోచనలపై తల్లిదండ్రులు, కుటుంబాల ప్రభావం ఎంతో ఉంది. సెల్‌ఫోన్‌లు, టీవీ ల వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. పాఠశాల ల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించడం ద్వారా క్రీడలపై ఆసక్తి పెంచాలి. తల్లిదండ్రులు పిల్లలకు సెల్‌ఫోన్‌లు ఇవ్వడం మానుకోవాలి. ఒక వేళ ఇచ్చినా కొంత సమయమే గడిపే విధంగా వ్యవహరించాలి.      
–అజారుద్దీన్, తిమ్మాపూర్, మోర్తాడ్‌ మండలం 

ఇబ్బందికరంగా సెల్‌ఫోన్లు 
సెల్‌ఫోన్లు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. చదువుపై శ్రద్ధ తగ్గుతోంది. కోవిడ్‌ అనంతరం ఈ పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో కొంత మార్పు వచ్చింది. చదవాలనే పట్టుదల పెరిగింది. బాలుర కంటే బాలికలే ఉంతో ఉత్సాహంగా చదువులో ముందుంటున్నారు.     
–శేఖర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ముబారక్‌నగర్‌ ఉన్నత పాఠశాల, నిజామాబాద్‌

క్రీడలను ప్రోత్సహించాలి 
పిల్లలు ఇంటి బయట ఆడు తుంటే ఇంట్లోకి పిలిచి బయటకు వెళ్లకుండా టీవీ చూస్తూ ఆడుకో అనే తల్లిదండ్రుల సంఖ్య కూడా పెరిగిపోయింది. దీంతో పిల్లలు మానసిక, శారీరక సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలల్లో గేమ్స్‌ పీరియడ్‌ను విధిగా నిర్వహిస్తూ మైదానంలో క్రీడలు ఆడించాలి. 
– జాదె శ్రీనివాస్, విద్యార్థి తండ్రి, ఆర్మూర్‌ 

తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలి 
ఆన్‌లైన్‌ తరగతులతో ప్రతి విద్యార్థి మొబైల్‌ వాడాల్సి వచ్చింది. క్లాసుల తరువా త పిల్లలు మొబైల్‌ ఫోన్‌ల లో గేమ్స్‌కు అలవాటు పడ్డారు. ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైనప్పటికీ ఇష్టంగా చదవలేకపోతున్నారు. తల్లిదండ్రులు శ్రద్ధతో విద్యార్థులు చదువుకునేలా చూడాలి.          
–బచ్చు రవి, ఉపాధ్యాయుడు, ఘన్‌పూర్, డిచ్‌పల్లి మండలం 

ప్రాథమిక స్థాయి నుంచే ..
ప్రాథమిక పాఠశాల దశ నుంచి పిల్లలు సెల్‌ఫోన్‌కు అలవాటు పడుతున్నారు. పిల్లల సెల్‌ఫోన్‌ వియోగంపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి.తరగతి గదిలో కాకుండా ఇంటి వద్ద పాఠ్యాంశాలను చదవటంపై ఆసక్తి కనబర్చేందుకు పిల్లలపైప్రత్యేక దృష్టిపెట్టాలి.
–మధుకుమార్, టీచర్, ఇందూర్‌ హైస్కూల్, బోధన్‌ 

అభిరుచులు మారుతున్నాయి 
విద్యార్థుల అభిరుచులు రోజుకో విధంగా మారుతున్నాయి. కొంత మంది అపారమైన జ్ఞానం కలిగి ఉంటే మరి కొందరికి బద్దకం ఎక్కువ. భవిష్యత్తులో ఏమి కావాలో నిర్ణయించుకుని కృషి చేస్తున్నవారూ ఉన్నారు.          
–శ్యామ్, పీఈటీ, తిమ్మాపూర్, మోర్తాడ్‌ మండలం 

మొబైల్‌ ఫోన్లకే ప్రాధాన్యత  
పాఠశాలల్లో మొబైల్‌ ఫోన్‌ల వాడకంపై కౌన్సెలింగ్‌ ఇవ్వాలి. తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులను గాడిలో పెట్టాలి. ప్రభుత్వం మెరుగైన విద్యను అందించడానికి కృషి చేయాలి. 
– అబ్దుల్‌ హఫీజ్, ఘన్‌పూర్, డిచ్‌పల్లి మండలం 

సెల్‌ను దూరం చేయలేని పరిస్థితి  
ఆన్‌లైన్‌ పాఠాల వల్ల పిల్లలకు సెల్‌ ఫోన్‌ వాడకం ఎక్కువైంది. బడి నుంఇ ఇంటి రాగానే తల్లిదండ్రుల వద్ద ఉన్న సెల్‌ ఫోన్‌లను తీసుకుంటున్నారు. చదవటం, హోం  వర్క్‌ చాలా వరకు పాఠశాలల్లోనే సాగుతోంది. ఇంటి వద్ద చదవటం గతం కంటే తగ్గింది.  పిల్లలను సెల్‌ ఫోన్‌ నుంచి దూరం చేయలేని పరిస్థితి ఉంది. 
–మంజుల, విద్యార్థి తల్లి, బోధన్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top