కొత్త థర్మల్ ప్లాంట్‌పైపెరిగిన ధర ప్రభావం
2021లో టన్ను రూ.7 లక్షలు
2026లో రూ.14 లక్షలకు చేరిన ధర
యూనిట్ కాస్ట్ రూ.8 కోట్ల నుంచిఏకంగా రూ.14 కోట్లకు వెళ్లే చాన్స్!
అధికారుల తర్జనభర్జన.. సర్కారు దృష్టికి కొత్త డీపీఆర్!
సాక్షి, హైదరాబాద్ : రాగి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ వ్యయం అనూహ్యంగా పెరిగింది. ఇది ప్రతిపాదిత రామగుండం ప్లాంట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రామగుండం ప్లాంట్‌కు సంబంధించి ఇటీవల సవరించిన డీపీఆర్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కాగా ప్లాంట్ విషయంలో జెన్‌కో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ప్లాంట్ నిర్మాణ వ్యయం, ఉత్పత్తి అయ్యే నాటికి పరిస్థితి, మార్కెట్లో విద్యుత్ లభ్యత, లాభ నష్టాలపై అంచనాలు రూపొందిస్తున్నారు.
ఈ ప్రాజెక్టు అసలు ఎంతవరకూ అవసరం అనే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని భావిస్తున్నారు. రామగుండం, పాల్వంచ, మక్తల్‌లో థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై ప్రభుత్వం కొన్నేళ్ళుగా ఆలోచిస్తోంది. అయితే మిగతా ప్లాంట్లపై ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా.. రామగుండం ప్లాంట్‌కు సంబంధించిన సమగ్ర నివేదిక రూపొందించారు.
రాగే కీలకం..
థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో రాగి (కాపర్) కీలక పాత్ర పోషిస్తోంది. జనరేటర్, స్టేటర్ వైండింగ్స్, రోటర్ వైండింగ్స్‌లో అధిక నాణ్యత కలిగిన (హైగ్రేడ్) కాపర్ వాడతారు. స్టెప్ అప్ ట్రాన్స్‌ఫార్మర్లు, ఆక్సిలరీ ట్రాన్స్‌ఫార్మర్లకు అల్యూమినియంతో కలిపి కాపర్ కూడా వాడతారు. థర్మల్ ప్రాజెక్టులో జనరేటర్, ట్రాన్స్‌ఫార్మర్, స్విచ్‌యార్డ్, మోటార్ ప్యానల్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ కేబుల్స్‌కు ఎక్కువ కాపర్ ఖర్చు అవుతుంది.
వీటితో పాటు బాయిలర్ ఫీడ్ పంపులు, ఐడీ, ఎఫ్‌డీ, పీఏ ఫ్యాన్లు, కూలింగ్ వాటర్ పంపుల్లోనూ కాపర్ లేకుండా పని జరగదు. హీట్ ఎక్సే్ఛంజర్లు, కంట్రోల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎర్తింగ్ సిస్టమ్‌లోనూ రాగి అత్యంత కీలకమైంది. ప్రతి మెగావాట్ థర్మల్ ప్లాంట్‌కు టన్ను దాకా కాపర్ అవసరం అవుతుంది. మన దేశంలో కాపర్ ఉత్పత్తి తక్కువ. దీంతో ప్రధానంగా థర్మల్ ప్లాంట్లకు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.
ధర తడిసిమోపెడు..
కాపర్ ధరలు ఐదేళ్ళలోనే రెట్టింపు అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రవాణా చార్జీలు పెరగడం కూడా ఇందుకు ఒక కారణం. 2021లో టన్ను కాపర్ ధర రూ.7 లక్షలు ఉంటే, 2026 నాటికి ఇది రూ.14 లక్షలకు చేరింది. థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ను 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తారు. ఈ లెక్కన చూస్తే 2021 నుంచి 2026కి 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణ వ్యయం దాదాపు రూ.56 కోట్ల వరకూ పెరిగింది.
దీంతో పదేళ్ళ క్రితం మొదలు పెట్టిన థర్మల్ విద్యుత్ ప్లాంట్లు తాజాగా వాణిజ్య ఉత్పత్తిలోకి వచ్చే నాటికి మెగావాట్‌కు రూ.8 కోట్ల మేర వ్యయం అయ్యే అవకాశం ఉన్నట్టు లెక్కగట్టారు. ఇక కాపర్ ధర పెరగడం వల్ల కొత్తగా నిర్మించే రామగుండం థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణ వ్యయం మెగావాట్‌కు రూ.14 కోట్ల వరకూ వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు.
ఆ పవర్ అమ్ముకోగలమా?
భారీగా పెరిగిన నిర్మాణ వ్యయాన్ని లెక్కగడితే రామగుండం నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ ధర యూనిట్‌కు రూ.14 పైనే ఉండే వీలుందని జెన్‌కో అధికారులు అంచనా వేస్తున్నారు. అదే యాదాద్రి థర్మల్ విద్యుత్ యూనిట్‌కు రూ.8 వరకూ మాత్రమే ఉండే వీలుంది. విద్యుత్ నియంత్రణ మండలి ధరను నిర్ణయిస్తేగానీ ఈ విషయంలో స్పష్టత ఉండదు. మార్కెట్లో నాన్–పీక్ అవర్స్‌లో యూనిట్ రూ. 2లోపే విద్యుత్ లభిస్తోంది.
పీక్ అవర్స్‌లో సైతం రూ.7 నుంచి రూ.10 వరకూ మాత్రమే ఉంటోంది. అయితే వేసవిలో యూనిట్‌కు రూ.14పైన వ్యయమవుతోంది. కాగా ఒక్క వేసవిలో తప్ప కొత్త ప్లాంట్ విద్యుత్‌ను అమ్ముకునే పరిస్థితి ఉండదు. ఇతర రోజుల్లో బ్యాక్‌డౌన్ చేయడం వల్ల ఉత్పత్తి నిలిచిపోయి, పెట్టుబడులపై వడ్డీ, ఉద్యోగుల జీతాల భారం కలిపి ప్లాంట్ నిర్మాణం మరింత భారమయ్యే అవకాశం కన్పిస్తోంది. ఈ పరిస్థితుల్లో కొత్త ప్లాంట్ అవసరం ఎంతనే విషయంపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు.


