ఈ మందు వాడితే కరోనా నుంచి నెలరోజుల రక్షణ! 

IIT Hyderabad Scientists Developed A Drug Prevents From Corona - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌-19 వ్యాప్తిని అడ్డుకునే లక్ష్యంతో ఐఐటీ హైదరాబాద్‌ శాస్త్రవేత్తలు వినూత్నమైన ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చారు. వీటిని ఉపయోగించిన క్షణాల్లోనే 99.99 శాతం సూక్ష్మజీవులను నాశనం చేయడంతో పాటు దాదాపు నెల రోజుల పాటు రక్షణ కల్పించే నానోస్థాయి కోటింగ్‌ ఇచ్చే ప్రత్యేక ఉత్పత్తులను అభివృద్ధి చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ శుక్రవారం ఈ ప్రత్యేక ఉత్పత్తి శ్రేణి ‘డ్యురోకియా’ను ఆన్‌లైన్‌ పద్ధతిలో విడుదల చేశారు. బయో మెడికల్‌ ఇంజినీరింగ్‌ విభాగపు అసోసియేట్‌ ప్రొఫెసర్, ఈఫోకేర్‌ ఇన్నొవేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకుడైన డాక్టర్‌ జోత్సేందు గిరి అభివృద్ధి చేసిన డ్యురోకియా ఉత్పత్తుల కనీస ధర రూ.189 మాత్రమే కావడం విశేషం.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, 1 ఎంజీ వంటి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారంలపై ఈ ఉత్పత్తులను కొనుగోలు చేయొచ్చని డాక్టర్‌ జోత్సేందు తెలిపారు. దీర్ఘకాలం పాటు వైరస్‌ వంటి సూక్ష్మజీవుల నుంచి రక్షణ కల్పించే డ్యూరోకియాను ఆపరేషన్‌ థియేటర్లతో పాటు ఐసీయూల్లోనూ ఉపయోగించవచ్చని, నానోటెక్నాలజీ సాయంతో ఇలాంటి ఉత్పత్తిని తయారు చేయడం ఇదే తొలిసారని వివరించారు. నానోస్థాయి కోటింగ్‌ కారణంగా కరోనా వైరస్‌ వంటివి దాదాపు నెల రోజుల పాటు ఆయా ఉపరితలాలపై ఉండలేవని, తద్వారా వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవచ్చని చెప్పారు. డ్యూరోకియా ఉత్పత్తులను ఇప్పటికే దేశంలోని పలు ప్రభుత్వ పరిశోధనశాలల్లో విజయవంతంగా పరిక్షించామని తెలిపారు. కార్యక్రమంలో ఐఐటీ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నెర్స్‌ చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, సంస్థ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బీఎస్‌ మూర్తి, ఈఎస్‌ఐ మెడికల్‌ కాలేజీ వ్యవస్థాపక డీన్‌ ఎం.శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

చదవండి: ఇప్పుడు కూడా కార్పొరేట్‌ యాజమాన్యాల కక్కుర్తి..!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top