బిల్లు కట్టకుంటే కనెక్షన్‌ కట్‌.. జలమండలి సీరియస్‌ 

If The Commercial Water Bill Not Paid Connection Will Be Cut - Sakshi

వాణిజ్య నల్లాల విషయంలో జలమండలి సీరియస్‌ 

సకాలంలో బిల్లులు చెల్లించాల్సిందేనంటూ ఆదేశాలు 

రంగంలోకి విజిలెన్స్‌ బృందాలు సైతం 

సాక్షి, హైదరాబాద్‌: బకాయిలు చెల్లించని వాణిజ్య నల్లా కనెక్షన్లను తొలగించనున్నట్లు జలమండలి ఎండీ దానకిషోర్‌ హెచ్చరించారు. బిల్లులు చెల్లించని కమర్షియల్‌ కనెక్షన్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. 6 నెలలు, ఆపై నుంచి నల్లా బిల్లు చెల్లించని వాణిజ్య కనెక్షన్ల బకాయిలను వసూలు చేయాలని, చెల్లించకపోతే కనెక్షన్లను తొలగించాలని చెప్పారు.

ఈ మేరకు రెవెన్యూ వసూలు బృందాలకు తోడుగా విజిలెన్స్‌ విభాగాన్ని సైతం రంగంలోకి దింపుతున్నట్లు తెలిపారు. గురువారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో రెవెన్యూ, సింగిల్‌ విండో సెల్, తదితర అంశాలపైన ఆయన అధికారులతో విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దానకిశోర్‌ మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా రెవెన్యూ పెంపుపైన జలమండలి ప్రత్యేక దృష్టి సారించిందని, ఇది సత్ఫలితాన్ని ఇచి్చందని తెలిపారు. కొన్ని మొండి బకాయిలు వసూలయ్యాయని, ఆదాయం క్రమంగా పెరుగుతోందని పేర్కొన్నారు. ఇప్పుడు మరింతగా దృష్టి సారించాలని అన్నారు. 6 నెలల కంటే  ఎక్కువ రోజులుగా బిల్లులు చెల్లించని వాణిజ్య కనెక్షన్‌లు 1095 ఉన్నట్లు గుర్తించారు.ఈ కనెక్షన్ల నుంచి నుంచి రూ.8.31 కోట్ల బకాయిలు వసూలు కావాల్సి ఉంది.  

నాన్‌ ఫ్రీ వాటర్‌ స్కీమ్‌ కనెక్షన్లపైనా... 
నాన్‌ ఫ్రీ వాటర్‌ స్కీమ్‌ (నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకానికి దరఖాస్తు చేసుకోని) పరిధిలో ఉన్న కనెక్షన్ల బకాయిలపైన కూడా దృష్టి సారించాలని, ఈ బకాయిలను సైతం వసూలు చేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే వీరికి 13 నెలల బిల్లులను ప్రభుత్వం రద్దు చేసిందని, ఉచిత తాగునీటి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అనేక అవకాశాలు ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. వీరు ఇప్పటికైనా ఉచిత తాగునీటి పథకానికి దరఖాస్తు చేసుకుంటే ఇప్పటి నుంచి పథకం వర్తిస్తుందని, బకాయిలు మాత్రం చెల్లిస్తే సరిపోతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జలమండలి రెవెన్యూ డైరెక్టర్‌ వీఎల్‌ ప్రవీణ్‌ కుమార్, ఓఆండ్‌ఎం డైరెక్టర్‌ అజ్మీరా కృష్ణ, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top