కామినేని చౌరస్తాలో ట్రాఫిక్ నియంత్రణ వదిలేసి కెమెరాతో ఫొటోలు తీస్తున్న కానిస్టేబుల్
సాక్షి, నాగోలు: ట్రాఫిక్ పోలీసుల ముఖ్య విధి ట్రాఫిక్‌ను నియంత్రించడం... ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయితే వెంటనే రంగంలోకి దిగి వాహనాలు సాఫీగా ముందుకు సాగేలా చేయడం... ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించే వాహనదారులపై చర్యలు తీసుకోవడం.. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు తమ విధులను పక్కన పెట్టి కేవలం వాహనదారులకు చలాన్లు విధించడంలోనే బిజీగా ఉంటుండంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
►ఎల్‌బీనగర్ పరిధిలోని వివిధ  చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు తమ విధులను పక్కన పెట్టి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వాహనదారులకు చలాన్లు విధించే పనిలోనే ఎప్పుడూ నిమగ్నమై ఉంటున్నారు.   
►చౌరస్తాల వద్ద  ట్రాఫిక్ జామ్ అయినా.. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిపోయినా తమకు సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నారు. కానిస్టేబుళ్లు అందరూ పోగై వాహన తనిఖీలు చేపడుతున్నారు. 
► రహదారిపై ఏదైనా ప్రమాదం జరిగితే కొంత మంది ట్రాఫిక్ కానిస్టేబుళ్లు అసలు పట్టించుకోవడం లేదు.  
►రహదారుల వెంబడి ఉన్న బడా  హోటల్ వద్ద  అక్రమంగా పార్కింగ్ చేస్తున్న వాహనాల వైపుకూడా కన్నెత్తి చూడటం లేదు.  
►ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ సమీపంలో ఉన్న ఓ హోటల్ నిర్వాహకులు తమ హోటల్‌కు వచ్చే వినియోగదారులు వాహనాలను రోడ్డుపైనే పార్కింగ్ చేయిస్తున్నారు. దీంతో రోడ్డు ఇరుకుగా మారి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.  

►వివిధ చౌరస్తాల వద్ద ట్రాఫిక్ సిబ్బంది నిలబడి చేతిలో కెమెరాలు పట్టుకొని కేవలం హెల్మెట్ లేని వారు, త్రిబుల్ రైడింగ్ చేసేవారికి ఫొటోలు తీస్తున్నారు.  
►వీరు రోజూ కనీసం 100 చలాన్లు విధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు 
►కొన్నిచోట్ల రోడ్లపై వారాంతపు సంతలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతోంది.  
► వివిధ చౌరస్తాల వద్ద ట్రాఫిక్ పోలీసులు ఉన్నప్పటికి చాలన్ విధించడమే పనిగా పెట్టుకున్నారు.  
►వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్‌ఐలతో పాటు కిందస్థాయి సిబ్బంది తమ వెంట తీసుకుని వచ్చిన వాహనలకు పత్రాలు లేని వారి నుంచి పెద్ద ఎత్తున్న డబ్బు వసలు చేస్తున్నారు.  
►సర్వీస్ రోడ్డును పూర్తిగా ఆక్రమించుకొని వాహనాలను పార్క్ చేసి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. చల్లాన్లు విధించడంలో బీజీ బీజీ... 
ట్రాఫిక్ నియంత్రణ కోసం చౌరస్తాల్లో నియమిస్తున్న ట్రాఫిక్ పోలీసులు విధులను సక్రమంగా నిర్వర్తించడంలేదు. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ట్రాఫిక్ నియంత్రణను పక్కకు వదిలేసి చేతిలో కెమెరా.. ట్యాబ్ పట్టుకొని చలాన్లు విధిస్తూ  వాహనదారుల జేబులు గుల్ల చేస్తున్నారు.  ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు కేవలం ఫొటోలు తీయడమే కాకుండా  ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కూడా  కృషి చేయాలని కోరుతున్నారు. 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
